పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
x
Highlights

తెలంగాణలో నిర్వహించే బోనాల్లో.. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ...

తెలంగాణలో నిర్వహించే బోనాల్లో.. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

హైదరాబాద్‌ అంతటా బోనాల జాతర వైభవంగా జరిగింది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలు సమర్పించారు.

అమ్మవారిని దర్శించిన వారిలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి బండారుదత్తాత్రేయ, నటి, కాంగ్రెస్‌ నేత విజయశాంతి, ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి, చంద్రకళ, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఎమ్మెల్యే రాజా సింగ్, నటుడు సుమన్‌ తదితరులు ఉన్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories