వరల్డ్ కప్ క్రికెట్ ఇప్పటి వరకూ ఎవరెవరు గెలిచారో తెలుసా?

వరల్డ్ కప్ క్రికెట్ ఇప్పటి వరకూ ఎవరెవరు గెలిచారో తెలుసా?
x
Highlights

వరల్డ్ కప్ 2019 సరిగ్గా రెండు వారాల్లో మొదలవబోతోంది. క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికే వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? ఏ టీమ్ ప్రస్తుతం బావుంది? ఏ ఆటగాడు ఫామ్...

వరల్డ్ కప్ 2019 సరిగ్గా రెండు వారాల్లో మొదలవబోతోంది. క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికే వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? ఏ టీమ్ ప్రస్తుతం బావుంది? ఏ ఆటగాడు ఫామ్ లో ఉన్నాడు? ఎంపికైన క్రికెటర్ తో వరల్డ్ కప్ లో లాభమా.. నష్టమా? ఇలా బోలెడన్ని సంగతుల మీద చర్చలు జరిగిపోతున్నాయి. మరోపక్క ప్రపంచ కప్ లో ఆడటానికి.. కప్ గెలవడానికి కావలసిన గేమ్ ప్లాన్ లను సిద్ధం చేసుకుంటున్నాయి టీమ్ లు. ఐపీఎల్ ముగియడంతో వరల్డ్ కప్ పై దృష్టి సారించారు అందరూ..

వచ్చే వరల్డ్ కప్ లో ఎవరు గెలుస్తారో తేలడానికి ఇంకా సమయం ఉంది. ఈలోపు ప్రపంచ కప్ ముందున్న వేళలో గతం లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో ఎవరెవరు గెలిచారు? ఫైనల్లో వారు ఎలా ఎవరి మీద గెలిచారు అనే విశేషాలివి.. మీ కోసం..


మొదటి ప్రపంచకప్ 1975లో జరిగింది. ఇంగ్లాండ్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకున్నాయి. లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ గెలిచి మొదటి కప్ ను సగర్వంగా ముద్దాడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా 102 పరుగులు చేసిన క్లైవ్ లాయిడ్ నిలిచాడు.

1979 లో రెండవ ప్రపంచకప్ నిర్వహించారు. ఇది కూడా ఇంగ్లాండ్ వేదికగానే జరిగింది. ఈసారీ ఫైనల్స్ లార్డ్స్ మైదానంలోనే. ఫైనల్ కు వెస్టిండీస్, ఇంగ్లాండ్ చేరాయి. దీనిని కూడా వెస్టిండీస్ గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. 138 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన వివ్ రిచర్డ్స్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక మూడో వరల్డ్ కప్ 1983తో ప్రపంచ క్రికెట్ లో సంచలనం నమోదైంది. అనామకులుగా.. అసలు సెమీస్ కైనా వస్తారా అనే విధంగా బరిలోకి దిగిన భారత జట్టు దుమ్ము దులిపింది. ఒక్కో మ్యాచూ గెలుచు కుంటూ ఫైనల్ పోరుకు హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్న వెస్టిండీస్ పై సిద్ధమైంది. కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కేవలం పన్నెండు పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీయడమే కాకుండా, 26 పరుగులు చేసిన మొహిందర్ అమర్నాథ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.

నాలుగో కప్ కు ఇండియా & పాకిస్తాన్ సంయుక్తంగా 1987 లో ఆతిథ్యమిచ్చాయి. కోల్కత్త లో ఫైనల్స్ జరిగాయి. ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా డేవిడ్ బూన్ (75 పరుగులు) ఎంపికయ్యాడు.


ఐదో వరల్డ్ కప్ 1992 లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ సంయుక్తంగా ఙిర్వహించిన ఈ టోర్నీని అనూహ్యంగా పాకిస్థాన్ గెలుచుకుని సంచలనం సృష్టించింది. వసీం అక్రమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.

1996 లో ఆరో టోర్నీని ఇండియా , పాకిస్థాన్ & శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి. లాహోర్ లో ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. శ్రీలంక ఆస్ట్రేలియా కప్ కోసం పోటీ పడ్డాయి. ఈసారీ పెను సంచలనమే జరిగింది. శ్రీలంక ఆస్ట్రేలియాను ఖంగు తినిపించి కప్ గెలిచింది. అరవింద డి సిల్వా (107 నాట్ అవుట్ మరియు 3/42) అల్రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు.

ఇంగ్లాండ్ లో 1999 లో నిర్వహించిన ఏడో ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది ఫైనల్లో పాకిస్థాన్ పై విజయం సాధించి కప్ గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా షేన్ వార్న్ ఎంపికయ్యాడు.

దక్షిణ ఆఫ్రికా, కెన్యా & జింబాబ్వే సంయుక్తంగా 2003 లో ఎనిమిదో వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చాయి. ఆస్ట్రేలియా,ఇండియాల మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా విజేత అయింది. రికి పాంటింగ్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచినా ఈ టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 673 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.

2007 లో వెస్టిండీస్ లో తొమ్మిదో టోర్నీ జరిగింది. ఆస్ట్రేలియా, శ్రీలంక ల మధ్య తుది పోరు జరిగింది. దీనిలో ఆస్ట్రేలియా గెలిచింది. ఆడం గిల్ క్రిస్ట్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.


పదో వరల్డ్ కప్ నెంబర్ 2011 లో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి. ఇండియా, శ్రీలంక ఫైనల్స్ ఆడాయి. ధోనీ మెరుపు వేగం తో చేసిన 91 పరుగులతో భారత్ కప్ గెలిచింది. ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇక పదకొండోసారి నిర్వహించిన గత వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిధ్యమిచ్చాయి. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లు ఫైనల్ కు చేరాయి. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా జేమ్స్ ఫాల్కనర్ ఎంపికయ్యాడు.

ఇదీ మన క్రికెట్ ప్రపంచ కప్ ప్రస్తానం. ఇప్పటి వరకూ జరిగిన టోర్నీల్లో 5 సార్లు కప్ గెలిచి ఆస్ట్రేలియా విశ్వ జట్టుగా నిలిచింది. ఇప్పటికీ సెమీస్ చేరే మొదటి జట్టు ఆస్ట్రేలియా అనే క్రికెట్ ప్రేమికులు చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories