ఇండియా గెలవాలి.. పాక్ తో సెమీఫైనల్ ఆడాలి!

ఇండియా గెలవాలి.. పాక్ తో సెమీఫైనల్ ఆడాలి!
x
Highlights

ఇదేంటి ఇంత అత్యాశ అనుకుంటున్నారా? పాకిస్తాన్ దేశంలో ఇపుడు అందరి కోరికా ఇదే. వరల్డ్ కప్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కచ్చితంగా సెమీస్ కు...

ఇదేంటి ఇంత అత్యాశ అనుకుంటున్నారా? పాకిస్తాన్ దేశంలో ఇపుడు అందరి కోరికా ఇదే. వరల్డ్ కప్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కచ్చితంగా సెమీస్ కు చేరుకుంటాయి అనుకున్న జట్లు వెనకబడిపోయాయి. వాటిలో ఇంగ్లాండ్ ఒకటి. టోర్నీ ఫేవరేట్ గా దిగిన ఇంగ్లాండ్ మొదట్లో చక్కగా కనిపించినా.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదే సమయంలో పాకిస్థాన్ పరిస్థతి కూడా దాదాపు అదే. ఇపుడు పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ప్రధాన అద్దంకి ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఓడిపోతే పాకిస్థాన్ సెమీస్ ఆశలు నిలుస్తాయి. అందుకే ఆ దేశ క్రికెట్ అభిమానులు అన్ని కోపాలు మర్చిపోయి ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు.

ఈ పోరులో కోహ్లీసేనకు మద్దతుగా నిలవాలని పాక్‌ అభిమానులకు ఆ దేశ మాజీ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ విజ్ఞప్తి చేశాడు. టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓడిపోయి నాకౌట్‌ నుంచి తప్పుకుంటే పాకిస్థాన్‌ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాను ఓడించి సెమీస్‌ చేరుకుంటుందని అక్తర్‌ ఆశాభావం వ్యక్తంచేశాడు.

'ఒక పాకిస్థానీయుడిగా ఇది చెప్పుకోవడం బాగోలేకున్నా.. దేశ ప్రజలని భారత జట్టుకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా. విదేశాల్లో ఉన్న పాకిస్థానీయులు సైతం ఎవరు సరైన జట్టో వారికి మద్దతు తెలపండి. ఇంగ్లాండ్‌లో నివసించేవారు ఆ జట్టుకే అండగా నిలవండి. పాకిస్థానీయులకు సర్ఫరాజ్‌ సేన సెమీస్‌ చేరాలని ఉంది. ఇవాళ ఇంగ్లాండ్‌ ఓడి.. పాక్‌ జట్టు బంగ్లాదేశ్‌పై గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరే అవకాశం ఉంది' అని పేర్కొన్నాడు.

లీగ్‌ దశలో టీమిండియా అగ్రస్థానం సాధించి పాక్‌ నాలుగో స్థానంతో నాకౌట్‌కు చేరుకుంటే ఇరు జట్లూ మళ్లీ సెమీస్‌లో తలపడతాయని, అలా చూడాలని ఉందన్నాడు. అలా జరిగితే సెమీస్‌లో భారత్‌ను ఓడించి పాక్ ఫైనల్‌ చేరుతుందనే విషయం తనకు తెలుసని అక్తర్‌ వివరించాడు.

ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితుల్లోనే 1992 లో పాకిస్థాన్ ఫైనల్స్ కి వెళ్ళింది.. కప్పూ గెలిచింది. అందుకే పాకిస్థాన్ లో ఈరోజు ఒక్క రోజు అందరూ టీమిండియా అభిమానులైపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories