ఇండోనేషియాలో భారత్ పంచ్!

ఇండోనేషియాలో భారత్ పంచ్!
x
Highlights

భారత బాక్సర్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడికి వెళ్ళినా.. ఏ వేదిక మీదైనా తమ పవర్ పంచ్ లతో విరుచుకుపడుతున్నారు. భారత్ బాక్సర్ల పంచ్ లకు ఈ సారి...

భారత బాక్సర్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడికి వెళ్ళినా.. ఏ వేదిక మీదైనా తమ పవర్ పంచ్ లతో విరుచుకుపడుతున్నారు. భారత్ బాక్సర్ల పంచ్ లకు ఈ సారి ఇండోనేషియా వేదికైంది. ఆదివారం ప్రెసిడెంట్స్ కప్ ఇంటర్నేషనల్ టోర్నీలో మన బాక్సర్లు ఏడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు గెల్చుకుని విజయభేరి మోగించారు. స్వర్ణ పతకాల్లో నాలుగు పతకాలు మహిళా బాక్సర్లు సాధించడం విశేషం.

మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు)తోపాటు జమున బోరో (54 కేజీలు), మోనిక (48 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు) విజేతలుగా నిలిచారు. టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ లక్ష్యంగా సాధన చేస్తున్న మేరీకోమ్‌కు ఈ టోర్నీలో ఎదురులేకుండా పోయింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ మణిపూర్‌ మెరిక పసిడి కాంతులు విరజిమ్మింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 36 ఏళ్ల మేరీకోమ్‌ 5–0తో ఏప్రిల్‌ ఫ్రాంక్స్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించింది. రెండు నెలల క్రితం ఇండియా ఓపెన్‌లో స్వర్ణం నెగ్గిన మేరీకోమ్‌ ఆ తర్వాత విరామం తీసుకొని ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఇతర ఫైనల్స్‌లో అస్సాంకు చెందిన జమున బోరో 5–0తో గియులియా లమాగ్న (ఇటలీ)పై, పంజాబ్‌ అమ్మాయి సిమ్రన్‌జిత్‌ 5–0తో హసానా హుస్‌వతున్‌ (ఇండోనేసియా)పై, హరియాణా అమ్మాయి మోనిక 5–0తో ఎన్‌డాంగ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించి బంగారు పతకాలను దక్కించుకున్నారు.

ఉత్తమ జట్టు భారత్..

పురుషుల విభాగంలో ఐదుగురు బాక్సర్లు పసిడి కోసం బరిలోకి దిగారు. అంకుశ్‌ దహియా (64 కేజీలు), అనంత ప్రహ్లాద్‌ (52 కేజీలు), నీరజ్‌ స్వామి (49 కేజీలు) స్వర్ణాలు నెగ్గగా... గౌరవ్‌ బిధురి (56 కేజీలు), దినేశ్‌ డాగర్‌ (69 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అంకుశ్‌ 5–0తో లెయుంగ్‌ కిన్‌ ఫాంగ్‌ (మకావు)పై, అనంత ప్రహ్లాద్‌ 5–0తో రహమాని రామిష్‌ (అఫ్గానిస్తాన్‌)పై, నీరజ్‌ స్వామి 4–1తో మకాడో జూనియర్‌ రామెల్‌ (ఫిలిప్పీన్స్‌)పై గెలిచారు. గౌరవ్‌ బిధురి 2–3తో మాన్‌డాగి జిల్‌ (ఇండోనేసియా) చేతిలో, దినేశ్‌ 0–5తో సమాద సపుత్ర (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. ఓవరాల్‌గా తొమ్మి ది పతకాలు నెగ్గిన భారత్‌కు ఈ టోర్నీలో ఉత్తమ జట్టు అవార్డు లభించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories