స్మరామి ఆంగ్లేయ కాటనుం తం భగీరధం!

స్మరామి ఆంగ్లేయ కాటనుం తం భగీరధం!
x
Highlights

మట్టిలో మాణిక్యాలున్నట్టే చేడులోనూ మంచి వారుంటారు. అటువంటి వారికి తామేం చేసినా ప్రజాప్రయోజనాలే తప్ప.. తమ అవసరాలు.. స్వంత లక్ష్యాలు.. ఇటువంటి స్వార్ధ...

మట్టిలో మాణిక్యాలున్నట్టే చేడులోనూ మంచి వారుంటారు. అటువంటి వారికి తామేం చేసినా ప్రజాప్రయోజనాలే తప్ప.. తమ అవసరాలు.. స్వంత లక్ష్యాలు.. ఇటువంటి స్వార్ధ చింతనలు ఉండవు. తాము చేస్తున్న పని పదిమందికి మంచి జరుగుతుందా లేదా అన్న చింతన తప్ప.. తాము చేస్తున్నపని తమ ప్రాంతం వారికి లాభమా.. ఎవరికో చేస్తే ఏం వస్తుంది.. అనే ఆలోచన ఉండదు. దేశమంతా బ్రిటిష్ వారిని వ్యతిరేకించినా.. కొన్ని చోట్ల కొంత మంది పుణ్యమా అని వారికి కాస్తంత మంచి పేరు మిగిలింది. అటువంటి పుణ్యాన్నిమూటగట్టుకున్న వారిలో ప్రధముడు సర్ ఆర్థర్ కాటన్. తాను చేసిన పనితో తన దేశానికి చిరంజీవత్వాన్ని ప్రసాదించిన మహనీయుడు.

నదులను అనుసంధానిస్తే.. నదుల నీటిని ఎక్కడిక్కడ నిలుపు చేసి కాలువల ద్వారా నీరు లేని చోటికి మళ్లిస్తే దేశమంతా సస్యశ్యామలమవుతుందని నమ్మిన వ్యక్తి. దాని కోసం తన జీవితాన్ని ధారబోసిన మహానుభావుడు. ఈ రోజు గోదావరి జిల్లాలు సుభిక్షంగా, సంపన్నంగా ఉన్నాయంటే దానికి కారణం కాటన్ మహాశయుడే. ఈరోజు(15 మే, 1803) కాటన్ జయంతి.. ఈ సందర్భంగా ఆయన గురించిన కొన్ని విశేషాలు..

కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 15 -05 -1803 న, Oxford లో జన్మించారు.

బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరుగా పనిచేసేవారు. కాటన్ తన జీవితాన్ని భారతదేశంలో నీటిపారుదల,కాలువలు కట్టించడానికి ధారపోసాడు.

1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు.

1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడయ్యాడు.

15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు.

1836- 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. - కాటన్ ఆ తర్వాత 1847- 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేసాడు.

దీంతో క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది.

ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది.ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తిచేసాడు.

కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దొరదే. ఇంతేకాక ఆయన బెంగాల్,ఒరిస్సా,బీహార్,మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగ పడటానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసాడు.

ఆ మనీయుడు, 25-07-1899న, డోర్కింగ్ లో (బ్రిటన్) మరణించారు.

ఇవీ అయన జీవిత విశేషాలు. దేశవ్యాప్తంగా ఆయన నదుల అనుసంధానం గురించి విస్తృత ప్రచారం చేశారు. ఆయన చేసిన సేవలను ఎవరు గుర్తుంచుకున్నా లేకపోయినా.. గోదావరి జిల్లా వాసులు మాత్రం తమ గుండెల్లో దాచుకున్నారు. ఇన్నేళ్ళయినా ఆయనను నిత్యం

స్మరించుకుంటూనే ఉంటారు. ఆయన్ను దేవునిగా భావిస్తారు. కాటన్ పేరుపై ఒక శ్లోకాన్ని చదివి గోదావరి నదిలో పుష్కరాలకు ఆర్ఘ్యం వదులుతారు. పుష్కరాలకు వచ్చిన వారితో ఆర్ఘ్యం వదిలేలా చేయిస్తారు. ఆ శ్లోకం..

"నిత్య గోదావరీ స్నాన పుణ్యదో

యో మహామతిహి:

స్మరా మ్యాంగ్లేయ దేశీయం

స్మరామి ఆంగ్లేయ

కాటనుం తం భగీరధం!

(మాకు గోదావరీ స్నాన పుణ్యాన్ని ప్రసాదించిన,అపర

భగీరధుడు,ఆంగ్ల దేశానికి చెందిన కాటన్ గారికి నిత్యం

స్మరించి తరిస్తున్నాము.)

అప్పట్లో బ్రాహ్మణులు గోదావరీ స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు,"కాటన్ దొర స్నాన మహం కరిష్యే" అని చెప్పుకునేవారట. కొన్నేళ్ల క్రితం కాటన్ దొర మునిమనవడు అయిన రాబర్ట్ కాటన్, ఆంధ్రదేశానికి వచ్చి,గోదావరీ తీరాన్నిమొత్తం తనివితీరా పరిశీలించి,ఆంద్రదేశ ప్రజలు,కాటన్ దొరగారిని స్మరించుకుంటున్నతీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు. ఆ మధ్య లండన్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో, తెలుగువారు రాబర్ట్ కాటన్ దంపతులను ఘనంగా సత్కరించారు. తెలుగువారి కృతజ్ఞతా భావానికి వారి కళ్ళు చెమ్మగిల్లాయి.‌ కాటన్ మహాశయుడి జీవితం ఆదర్శప్రాయం. ఈనాటి పిల్లలకు తెలియాల్సిన పాఠం.. కాటన్ జయంతి సందర్భంగా అందరూ ఆయనను స్మరించుకోవడమే కాదు, తమ తరువాతి తరానికి ఆయన గోప్పతన్నాన్ని వివరించి చెబితే ఆయనకు మనం ఘన నివాళి అందించినట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories