అక్కడ మొగుడ్స్..పెళ్లామ్స్! ఫేస్ బుక్ లో లవర్స్!!

అక్కడ మొగుడ్స్..పెళ్లామ్స్! ఫేస్ బుక్ లో లవర్స్!!
x
Highlights

సోషల్ మీడియా మానవ సంబంధాలను ఎలా మట్టిగలిపెస్తోందో తెలిపే కథ ఇది. మనసులకు ముసుగులేసుకుని.. ముఖానికి రంగులేసుకున్న భార్యాభర్తలు.. ముసుగులు తొలగి.. రంగులు కరగడంతో అవాక్కయిన సంఘటన ఇది..

ఇదో ఫేసుబుక్కు కథ. వినటానికి సినిమా కామెడీలా అనిపిస్తుంది. కానీ.. ఇది ప్రస్తుతం సమాజంలో వస్తున్న పెనుపోకడలకు అద్దం పడుతుంది. మనవ సంబంధాలపై అదీ వైవాహిక బంధాలపై సామాజిక మాధ్యమాలు చేస్తున్న దాడిని కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ఇక విషయంలోకి వెళితే..

ఒక అందగాడు.. ఫేస్ బుక్ లో తన ఫోటో బదులు ఒక సినిమా హీరో ఫోటో పెట్టుకుని ఎకౌంట్ ఓపెన్ చేశాడు. దానితో తనకు నచ్చిన అమ్మాయిలతో మాటామంతీ కలుపుతున్నాడు. అదే ధోరణిలో ఓ అందాల భరిణె మనోడికి ఫేస్ బుక్ లో తగిలింది. ఇంకేముంది అయ్యగారు ఆమెకు మాటల లైన్ వేశాడు. అటు నుంచి కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇక వారి మధ్య మూడు షేరింగులు.. ఆరు చాటింగ్ లుగా వ్యవహారం నడిచింది. ఇలా కొన్నాళ్లు గడిచింది. ప్రేమ చిగురించి.. పక్వానికి వచ్చింది. ఇద్దరిలోనూ ఒకరినొకరు కలవాలన్న కోరికా పెరిగిపోయింది.

ఓ శుభముహూర్తాన ఇద్దరూ కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఎలా కలుసుకోవాలో చెప్పుకున్నారు. ఎక్కడ కలుసుకోవాలో లొకేషన్ షేర్ చేసుకున్నారు. చక్కగా ముస్తాబయి ఆ స్పాట్ కి చేరుకున్నారు. ఒకరిని ఒకరు చూసుకున్నారు. అప్పుడు తగిలింది ఇద్దరికీ అసలు షాక్. కెవ్వుమని ఇద్దరూ ఒకేసారి కేక పెట్టారు. ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఇదంతా చూసిన పబ్లిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇద్దర్నీ విడదీసి విషయం అడిగారు. అంతే వారికీ మతిపోయింది. ఇంతకీ విషయం ఏమిటో అర్థం అవలేదా.. అక్కడికే వస్తున్నాం.. వారిద్దరూ వాస్తవానికి భార్యాభర్తలు.

ఇద్దరూ పాపం వేరే వాళ్ళ ఫొటోలతో ఫేసు బుక్ లో కలుసుకుని.. ప్రేమించేసుకుని.. అసలు సంగతి తెల్సుకుని ఒకరిని ఒకరు కొట్టుకునే పరిస్థితికి వెళ్లారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ.. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగిందిది. అందుకే.. ఫేస్ బుక్ చూసి లవ్ లో పడ్డారా ఇక మీ గతీ ఇలాగే కావచ్చు.. జర భద్రం!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories