ఫేసియల్ ఫెమినైజేషన్ సర్జరీ... ట్రాన్స్‌జెండర్లు చేయించుకునే ఈ చికిత్స ఏంటి?

Facial Feminization Surgery What Is This Treatment Done By Transgenders
x

ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టు, నటి, డాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు

Highlights

ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టు, నటి, డాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ఇటీవల ఫేసియల్ ఫెమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్) చేయించుకున్నారు.

ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టు, నటి, డాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ఇటీవల ఫేసియల్ ఫెమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్) చేయించుకున్నారు.

‘‘నా రూపం ఇప్పుడు పూర్తిగా మారింది. ఇది ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. నా కోసం నేను చేయించుకున్న చికిత్స ఇదీ. అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

అయితే, ఈ సర్జరీ చేయించుకున్నందుకు ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా వస్తోంది.

ఇంతకీ ఫేసియల్ ఫెమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్) అంటే ఏమిటి, దీన్ని ట్రాన్స్‌జెండర్లు ఎందుకు చేయించుకుంటారు?

ఫేసియల్ ఫెమినైజేషన్ అంటే ఏంటి?

నిజానికి ఫేసియల్ ఫెనిమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్) అంటే ఒక శస్త్రచికిత్స కాదు. దీనిలో భాగంగా ముఖం అమ్మాయిలా కనిపించేందుకు కొన్ని చికిత్సలు చేస్తారు.

దవడ ఎముకలు, కనుబొమ్మలు, పెదవులు, గడ్డం ఇలా ముఖంలోని చాలా భాగాలను ఎఫ్ఎఫ్ఎస్‌లో మారుస్తారు.

కొన్నిసార్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు కూడా చేస్తారు. మరికొన్నిసార్లు నుదురు కాస్త చిన్నదిగా కనిపించేందుకు జుట్టును కాస్త ముఖం ముందువరకూ వచ్చేలా చూస్తారు.

చర్మం కాస్త బిగుతుగా ఉండేలా చూసేందుకు స్కిన్‌ టైటెనింగ్ సర్జరీ కూడా కొన్నిసార్లు చేస్తారు.ఈ ఫేసియల్ సర్జరీ ఎవరికి చేస్తారు?

పుట్టినప్పుడు వచ్చే జెండర్‌కు భిన్నంగా తమను తాము చూసుకునేవారికి ఎక్కువగా ఈ శస్త్రచికిత్స చేస్తుంటారు. అంటే మగ పిల్లాడిగా జన్మించి, పెద్దయ్యాక ఆడవారిగా తమను తాము చూసుకునేవారికి ఎక్కువగా ఈ చికిత్స చేస్తారు.

అంతేకాదు, తమ జెండర్‌ను పోలిన ముఖ కవళికలు తమకు లేవని భావించేవారూ ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ సమస్యను జెండర్ డిస్ఫోరియా అని కూడా పిలుస్తుంటారు.

మొత్తంగా తామ కోరుకునే జెండర్‌ వ్యక్తిగా మారేందుకు ఇది తోడ్పడుతుందని దీన్ని ఆశ్రయించే వ్యక్తులు చెబుతుంటారు.

ఫేసియల్ సర్జరీ ప్రమాదకరమా?

దాదాపు అన్ని మేజర్ సర్జరీల సమయంలో కొన్ని ముప్పులు వెంటాడుతుంటాయి. ఎఫ్ఎఫ్ఎస్‌ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

బ్లీడింగ్

ఇన్ఫెక్షన్లు

సర్జరీ జరిగిన చోటుకు సమీపంలోని భాగాల్లో గాయాలు కావడం

మత్తుమందు వల్ల దుష్ప్రభావాలు..

లాంటి ముప్పులు ఈ సర్జరీ చేయించుకువారిని వెంటాడతాయి.

మరికొన్ని ఇతర సమస్యలు కూడా ఎఫ్ఎఫ్ఎస్ చేయించుకునేవారిని ఇబ్బంది పెడుతుంటాయి. అవేమిటంటే..

ముఖంపై మచ్చలు రావడం,

ముఖంపై నరాలకు గాయాలు కావడం,

ముఖంపై కోత పెట్టిన ప్రాంతాలు సరిగా కూడకపోవడం,

చర్మం కింద ద్రవాలు పేరుకోవడం, ఈ సమస్యనే సెరోమా అంటారు,

కండరాల్లో రక్తం గడ్డ కట్టడం.. లాంటి సమస్యలు వెంటాడుతుంటాయి.

ఈ సర్జరీకి ఎలా సిద్ధం చేస్తారు?

ప్రతి మనిషికీ ప్రత్యేకమైన ముఖ కవళికలు ఉంటాయి. కాబట్టి సర్జరీ అయినతర్వాత తమ ముఖం ఎలా మారాలి అనుకుంటున్నారో ముందుగానే సదరు వ్యక్తులు వైద్యులతో మాట్లాడాలి.

శస్త్రచికిత్సకు ముందుగా చేయాల్సిన, చేయకూడని పనుల జాబితాను కూడా సదరు వ్యక్తులకు సర్జన్లు అందిస్తుంటారు. పొగ తాగడం మానుకోవడం లాంటివి దీనిలో ఉంటాయి.

సర్జరీని ప్లాన్ చేసేందుకు ముందుగా సీటీ స్కాన్ కూడా నిర్వహిస్తుంటారు. దీని ద్వారా ముఖ కవళికలపై సదరు వైద్యుడికి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.

మళ్లీ పాత రూపం కావాలంటే వస్తుందా?

వాస్తవానికి ఒకసారి ఫేసియల్ ఫేమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్) సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్లీ పూర్వస్థితికి ముఖం వచ్చేలా చేయడం కొంచెం కష్టం.

అందుకే సర్జరీకి ముందుగానే దీనికి సంబంధించిన ఫామ్‌పై వైద్యులు సంతకం పెట్టించుకుంటారు.

సర్జరీ తర్వాత ముఖంపై నొప్పి, ఎర్రగా మారడం, వాపు లాంటివి కనిపించొచ్చు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, దవడ, గడ్డంపై ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సర్జరీ చేయించుకునేవారు దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. మరోవైపు శస్త్రచికిత్స అనంతరం ఆహారం తీసుకోవడం, నమలడం కూడా కొన్ని రోజుల వరకూ కష్టంగా ఉంటుంది.

ఫలితాలను పూర్తిగా చూసేందుకు దాదాపు ఏడాది వరకూ సమయం పట్టొచ్చు.ఈ సర్జరీకి ఎంత ఖర్చవుతుంది?

ఫేసియల్ ఫెమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్)కు ఎంత ఖర్చవుతుందనేది సదరు వ్యక్తి ఎంచుకున్న మార్పుల బట్టీ ఉంటుంది.

సాధాణంగా రూ.80,000 నుంచి రూ.1,50,000 వరకూ ఖర్చు ఉంటుందని తమిళనాడు నాగరకోయిల్‌లోని రిచర్డ్సన్ డెంటల్ అండ్ క్రానియోఫేసియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సునిల్ రిచర్డ్సన్ తన బ్లాగులో రాసుకొచ్చారు.

అయితే, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఈ సర్జరీ కోసం రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తుంటాయని ముంబయిలోని బాడీ స్కల్ప్ట్ ఏస్తిటిక్స్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ అరుణ్ పండా తన వెబ్‌సైట్‌లో వివరించారు.

దీనిపై ట్రోలింగ్ ఎందుకు?

ఈ శస్త్రచికిత్స చేయించుకునేవారిలో కొందరు ట్రోలింగ్‌కు బాధితులిగా మారుతుంటారు. ముఖ్యంగా ఈ చికిత్సను ప్లాస్టిక్ సర్జరీగా చూడటడమే ప్రధాన కారణమని త్రినేత్ర తన పోస్టులో చెప్పారు.

‘‘చుట్టుపక్కల ఉండేవారు ఏమనుకుంటారు? సోషల్ మీడియాలో ఎలాంటి కమెంట్లు వస్తాయి? లాంటి భయాల వల్లే నేను ఇప్పటివరకూ దీనిపై మాట్లాడలేదు. కానీ, నన్ను నేను ఒక పూర్తి వ్యక్తిగా మార్చేందుకు, నా ప్రయాణాన్ని పరిపూర్ణం చేసేందుకు తోడ్పడే చికిత్స గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు’’ అని ఆమె అన్నారు.

‘‘ఇటీవల ఒక నటి చిన్ ఫిల్లర్ చేయించుకుందని తెలిసి ట్రోల్ చేశారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్‌లో టాపర్‌గా నిలిచిన ఒక అమ్మాయిని మీసాలు ఉన్నాయని హేళన చేశారు. మీరు ఏం చేసినా, చేయకున్నా అనేవి అంటారు’’ అని ఆమె చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories