పాపం వలస కూలీలు: కరోనా కష్టాల మధ్య ఇదో విషాద కథ!

పాపం వలస కూలీలు: కరోనా కష్టాల మధ్య ఇదో విషాద కథ!
x
lorry killed 3 migrant laborers in Madhya Pradesh (Image courtesy : naidunai)
Highlights

కంటికి కనిపించని కరోనా ప్రజలకు తెస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడికక్కడ అందరూ స్తంభించిపోయిన పరిస్థితి. ఇక పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను,...

కంటికి కనిపించని కరోనా ప్రజలకు తెస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడికక్కడ అందరూ స్తంభించిపోయిన పరిస్థితి. ఇక పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలనూ వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న కూలీల వ్యధలు కథలు కథలుగా వస్తూనే ఉన్నాయి.

బస్సులు..రైళ్ళు ఇలా ఏ వాహనమూ తిరగడం లేదు. ఉన్న చోట పనిలేదు. తినడానికి తిండి లేదు. పోనీ కొద్దిరోజులు ఓపికగా ఎదురు చూద్దామా అంటే ఈ లాక్ డౌన్ పరిస్థితులు ఎప్పటికి మారెనో ఎవరికీ తెలీదు. ఈ నేపధ్యంలో వలస కూలీలు తమ తమ స్వస్థలాలకు చేరుకోవడానికి వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు రహదారులపై కనిపిస్తూనే ఉన్నాయి.

ఇంత కష్టపడి స్వంత ఊరికి చేరిన వారిని తమ ఊరి వారే పొలిమేరల్లో ఆపేస్తున్నారు. స్వంత గడ్డకు కూడా వారు పరాయి వారయిపోతున్నారు ఈ పాడు కరోనా వైరస్ వల్ల. ఇక చావు అనేది ఎలా వస్తుందో ఎవరమూ చెప్పలేము. రాసి పెట్టి ఉంటే జరిగి తీరుతుందనే వైరాగ్యపు మాటలు చెప్పుకోవడం తప్ప చావును తప్పించుకోవడం అసాధ్యమే. సరిగ్గా ఇదే జరిగింది ఆ ముగ్గురి విషయంలో.

వారిది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన మోహన్‌పుర గ్రామం. రాజస్థాన్ పనుల కోసం వెళ్లారు. లాక్ డౌన్ లో చిక్కుకున్నారు. కొన్నాళ్ళు వేచి చూశారు. రోజు రోజుకూ అక్కడ పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. దీంతో వారు తమ స్వగ్రామానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. వీరు కాలినడకన రాజస్థాన్ నుంచి తమ గ్రామానికి బయలుదేరారు.

అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాజస్థాన్ లో చిక్కుకుపోయిన వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేసింది. దీంతో కొంత దూరం కాలినడకన వచ్చిన వారు తమతో పాటు ఉన్న తమ ప్రాంతానికి చెందిన 11 మందితో కలిసి బస్సులో మంగళవారం ఉజ్జయిని చేరుకున్నారు. అటు తరువాత వారు తమ గ్రామం మోహన్ పుర వెళ్లారు. అయితే, ఇంత కష్టపడి అక్కడకు వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురైంది.

వారిని గ్రామంలోకి రావడానికి గ్రామస్థులు అంగీకరించలేదు. కరోనా పరీక్షలు చేయించుకుంటే కానీ, గ్రామంలోకి అడుగు పెట్టనీయమని చెప్పారు. దీంతో విక్రం, భూలీ, బద్రీలాల్ అనే ఈ ముగ్గురు అక్కడ నుంచి కాలినడకన ఉజ్జయిని లోని ఆర్డీ గార్డీ మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడ పరీక్షలు చేయించుకుని తమ గ్రామానికి మళ్ళీ కాలి నడకన చేరారు. అయితే అప్పటికే రాత్రి బాగా పొద్దు పోవడంతో గ్రామానికి దగ్గరలోని భైరవ్ గడ్ వద్ద ఉన్న సాడూ మాటా మందిరం దగ్గరలోని ఓ చెట్టుకింద నిద్రపోయారు.

బుధవారం తెల్లవారు జాము మూడు గంటల తరువాత ఆ పక్కనే ఉన్న రోడ్డు మీద వెళ్ళుతున్న ఎంపీ 9 హెచ్ హెచ్ 2669 ట్రక్కు అదుపు తప్పి నిద్ర పోతున్న వీరి మీదుగా చెట్టును గుద్దుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, పాపం ఈ ప్రమాదంలో ఇంత కష్టపడి స్వగ్రామానికి చేరుకున్న ఆ ముగ్గురు వలస కూలీలు అక్కడికక్కడే మరణించారు.

రెండు కిలోమీటర్ల దూరంలో తమ ఇల్లు.. దాదాపు 820 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన వారు విధి చేతిలో ఓడిపోయారు. దీంతో గ్రామం అంతా విషాదం అలుముకుంది. ఇక్కడ అత్యంత విషాదం ఏమిటంటే..వీరు బస్సు ఎక్కే ముందే కరోనా స్క్రీనింగ్ చేసి కరోనా అనుమానం లేని వారినే అధికారులు బస్సు ఎక్కించారని ఆ ప్రాంత ఏఎస్పీ రూపేష్ కుమార్ ద్వివేదీ చెప్పినట్టు స్థానిక వార్తా సంస్థ నయీ దునియా తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories