పోలవరంపై సుప్రీం కీలక ఆదేశాలు

పోలవరంపై సుప్రీం కీలక ఆదేశాలు
x
Highlights

గతేడాది డిసెంబర్‌ మాసంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం...

గతేడాది డిసెంబర్‌ మాసంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన విషయం అందరికీ విదితమే. ఈ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, స్టాఫ్‌వర్క్‌ ఆర్డర్‌ను పదేపదే నిలుపుతున్నారని ఒడిశా పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ తరఫు న్యాయవాది జీఎన్‌ రెడ్డి వాదనలు వినిపించడానికి ఆరు వారాల గడువు కావాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ఆయన అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.

దీంతో పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. స్టాఫ్‌ వర్క్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఏమిటో చెప్పాలంటూ ఒడిశాకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో స్పందించిన ఒడిషా ప్రభుత్వం ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. బచావత్‌ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని ఒడిశా వాదించింది.

మరోవైపు, ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న తెలంగాణ ప్రభుత్వం మణుగూరు ప్లాంట్‌, గిరిజనులకు ముంపు నష్టంలేకుండా చూడాలని కోరింది. అనంతరం స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ప్రాజెక్టు ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతుందో అదే విధంగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులూ లేవని న్యాయస్థానానికి స్పష్టంచేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, నిర్మాణ చిత్రాలతో పూర్తి సమాచారం అందించడంతో పాటు ఒడిశా, తెలంగాణ అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పోలవరం ప్రభావిత రాష్ట్రాల సందేహాలను, అభ్యంతరాలు నివృత్తి చేయాల్సింది ఏపీయేనని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తాజాగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏపీ న్యాయవాది రెండు వారాల్లోగా పోలవరానికి సంబంధించిన సమాచారం ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. విచారణ అంతా ముగిసిన తరువాత సుప్రీంకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories