ఒవైసీ సభలో రచ్చ చేసిన అమ్మాయి అమూల్యపై దేశద్రోహం కేసు...

ఒవైసీ సభలో రచ్చ చేసిన అమ్మాయి అమూల్యపై దేశద్రోహం కేసు...
x
Highlights

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరు సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య వ్యవహారం ముదురుతోంది.

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరు సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య వ్యవహారం ముదురుతోంది. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద అమూల్యపై దేశద్రోహం కేసు పెట్టడంతో పాటు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా చర్యలు తీసుకునే దిశగా కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది.

బెంగళూరులో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో అమూల్య అనే యువతి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. సభలో ఆమె చేస్తోన్న వ్యాఖ్యలకు షాక్‌ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆమె నుంచి మైక్‌ లాక్కుందామని ప్రయత్నించినా, ఆమె వదలకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో ఆమె బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. 14 రోజుల పాటు ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె చిక్కుల్లో పడింది.

పాకిస్తాన్ జిందాబాద్ అంటూ బెంగళూరు సభలో నినాదాలు చేసిన యువతికి గతంలో నక్సల్స్‌తో సన్నిహిత సంబంధాలుండేవని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోపించారు. అమూల్య వెనుక కొన్ని శక్తులు పనిచేస్తూ అమూల్య లాంటి వారిని పెంచి పోషిస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోకపోతే అలాంటి సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె వెనుక నక్సల్స్ ఉన్నారేమోనన్న కోణంలో విచారించాలని, అప్పుడు అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు.

MIM చీఫ్ అసదుద్దీన్‌పై బీజేపీ నేత సంబిత్‌ పాత్రా మండిపడ్డారు. బెంగళూర్‌ సభలో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన అమూల్య నుంచి మైక్‌ లాక్కున్న ఒవైసీ....కర్ణాటక సభలో మాజీ ఎమ్మెల్యే వారిస్‌ పఠాన్‌ నుంచి ఎందుకు మైక్‌ లాక్కోలేదని ప్రశ్నించారు.

ఎంఐఎం పార్టీ ఒక మత ఛాందసవాద పార్టీ అని మరోసారి నిరూపితమయిందని బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు అన్నారు. అవకాశవాద పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన అమూల్య విషయాన్ని ప్రస్తావించిన కృష్ణసాగర్‌రావు...ఒవైసీ తీరును ఎండగట్టారు. ఒవైసీ దిగజారుడు రాజకీయాల కారణంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

అమూల్య వ్యాఖ్యలను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాము భారతీయులుగా గర్విస్తున్నామన్న ఒవైసీ.. అమూల్య వ్యాఖ్యల వెనుక నేను ఉన్నానని బీజేపీ ఆరోపించే అవకాశం ఉందన్నారు. కానీ ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అమూల్య నినాదాలు చేయడం దేశంలో చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఆగ్రహంతో ఉన్న కొందరు ఆమె ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 20 రాత్రి చిక్కమగళూరులోని ఆమె నివాసంపై దుండగులు రాళ్లు రువ్వినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఆమె ఇంటి పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories