Top
logo

రామ్ జెఠ్మలాని.. ఓ ఖరీదైన లాయరు.. సంచలన రాజకీయ నాయకుడు!

రామ్ జెఠ్మలాని.. ఓ ఖరీదైన లాయరు.. సంచలన రాజకీయ నాయకుడు!
X
Highlights

రామ్ జెఠ్మలాని.. దాదాపుగా ఈ పేరు తెలీనివారు మన దేశంలో ఉండరనే చెప్పొచ్చు. అత్యంత ఖరీదైన లాయరుగా ఆయనకు విపరీతమైన ప్రఖ్యాతి ఉంది.

రామ్ జెఠ్మలాని.. దాదాపుగా ఈ పేరు తెలీనివారు మన దేశంలో ఉండరనే చెప్పొచ్చు. అత్యంత ఖరీదైన లాయరుగా ఆయనకు విపరీతమైన ప్రఖ్యాతి ఉంది. ఒక కేసు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వద్ద కోటిన్నర వసూలు చేశారంటే ఆయన ఎంత ఖరీదైన ప్లీడరో అర్థం అవుతుంది. అంతేకాదు.. ఒక కేసును ఒప్పుకుంటే.. తన బృందంతో సహా ఆ కోర్టు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ వారి ఖర్చులన్నీ క్లయింట్ భరించాల్సిందే. ఆయన లాయరుగానే కాదు రాజకీయ నాయకుడిగానూ సంచలనం సృష్టించారు. ఈరోజు ఆయన అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అయన గురించి కొన్ని విశేషాలు..

ఈ నెల 14న తన పుట్టినరోజును జరుపుకోవాల్సిఉన్న జెఠ్మలాని మరణంతో అయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా అయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయన వయసు 95 సంవత్సరాలు. ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్సులో ఉన్న శిఖాపూర్ లో 1923, సెప్టెంబర్ 14న జెఠ్మలాని జన్మించారు. దేశవిభజన జరిగేవరకూ కరాచీలో లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. విభజన అనంతరం అయన భారత్ కు వచ్చేశారు. ఇంకో విశేషం ఏమిటంటే అయన తన 17వ ఏటనే లా డిగ్రీ పొందారు. అది అప్పట్లో దేశ రికార్డు. 2010లో అయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆరుసార్లు రాజ్యసభకు ఎన్నికైన జెఠ్మలాని యూపీఏ, ఎన్డీయే రెండు ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు అయన 2004 లో బీజేపీ అగ్రనేత వాజ్ పెయీ పైనే పోటీ చేసి సంచలనం సృష్టించారు.

ఇక లాయరుగా అయన సంచలనాలకు పెట్టింది పేరు. అత్యంత కఠినమైన.. ఎవ్వరూ టేకప్ చేయడానికి సాహసం చేయలేని కేసుల్ని అయన వాదించారు. 1959లో నానావతి కేసు ఆయనకు విపరీతంగా పేరు తెచ్చిపెట్టింది. ఈ కేసు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని నేవీ అధికారి నానావతి కాల్చి చంపిన కేసు. (ఇదే కథ తరువాత అక్షయకుమార్ హిందీ లో రుస్తుం పేరుతొ సినిమాగా తీశారు). అక్కడ నుంచి అయన లాయరుగా విపరీతమైన పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఇక అయన స్మగ్లర్ల లాయరుగా ఓ దశలో ఓ వెలుగు వెలిగారు. 1960ల్లో జెఠ్మలానీ స్మగ్లర్ల తరఫున వాదించారు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ తరఫున అయన వాదించడంతో ఆయనకు స్మగ్లర్ల లాయర్ గా పేరుపడిపోయింది. అయన ఖాతాలో చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఇందిరాగాంధీ హత్య కేసు, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం, ఎల్ కే అద్వాణీ హవాలా కేసు, జయలలిత, కనిమొళి, లలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేసుల వంటి అత్యధిక సంచలనాత్మకమూ, వివాదాస్పదమూ అయిన కేసుల్ని అయన వాదించారు. అనారోగ్య కారణాలతో జెఠ్మలానీ 2017 లో న్యాయవాద వృత్తిని వదిలేశారు. అంటే ఆయనకు 93 ఏళ్ళు వచ్చేవరకూ లాయరుగా కొనసాగారు.


Next Story