ప్రజలకు దూరంగా కాంగ్రెస్ ను నెట్టేసిన మోదీ, షా

ప్రజలకు దూరంగా కాంగ్రెస్ ను నెట్టేసిన మోదీ, షా
x
Highlights

''మోదీషా ద్వయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టింది. కశ్మీర్ విభజన బిల్లుతో ఇటు కాంగ్రెస్ ను ప్రజలకు దూరంగా నెట్టేయడమే కాకుండా అటు కాంగ్రెస్ నాయకుల్ని చీల్చగలిగింది. అత్యంత జాగ్రత్తగా.. రహస్యంగా.. లక్ష్యాన్ని చేరడానికి పావులు కదిపి రాజకీయంగా ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు చేరింది బీజేపీ."

ఒకే బిల్లు.. ప్రయోజనాలు అనేకం. రాజకీయంగా కాంగ్రెస్ కు దాదాపు ఇది చావుడదెబ్బలాంటిదే. ఇప్పటికే, ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎవరనేది తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు కశ్మీర్ విషయంలో ఎలా స్పందిచాలో కూడా తెలీని పరస్థితి ఏర్పడింది. దాదాపుగా కాంగ్రెస్ ను ఒక మూలకు నెట్టేసిన పరిణామం ఇదని పరిశీలకులు భావిస్తున్నారు.

కాశ్మీర్ అంశం కాంగ్రెస్ కు చాలా కీలకమైంది. కశ్మీర్ లో ఆర్టికల్ 370తో ఎంతో రాజకీయాన్ని నడిపింది. ఇప్పటివరకూ కాశ్మీర్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆటలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా చేజారిపోయింది. ఒక విశ్లేషణ ప్రకారం. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు పూర్తిగా దూరం అయిపొయింది. దేశవ్యాప్తంగా ఆర్టికల్ 370 రద్దు పై ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా నాయకులందరూ (ఏ కొద్దిమందో తప్పించి) ఈ బిల్లును స్వాగతించారు. మెజార్టీ ప్రజాభిప్రాయం దీనిని సమర్థిస్తుంటే పార్లమెంట్ లో తను ఎలా వ్యవహరించాలో తెలీని డైలమాలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎంపీలకు దశానిర్దేశం చేసే వారే కరువయ్యారు. కేవలం బీజేపీ ని వ్యతిరేకించడం అనే ఒక్క కారణం తోనే గుడ్డిగా బిల్లును వ్యతిరేకించి ప్రజల్లో ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజానికి, ఇది మోడీ, షా ద్వయం విపక్షాల మీద చేసిన సర్జికల్ దాడిలా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 కి సంబంధించి ఎదో చేయబోతున్నారనే సూచనలు కనిపించినా, ఏం చేస్తున్నారనే విషయాన్ని ఇతమిత్థంగా ఆలోచించే అవకాశం కూడా కాంగ్రెస్ కు దక్కలేదు. చివరి నిమిషాల్లో అనుమానం వచ్చి దానిపై ఎలా రియాక్ట్ కావాలనే విషయాన్ని అంచనా వేసుకునే లోపు మొదట రాజ్యసభలో బిల్లు వచ్చేసింది. తనకు బలం లేకపోయినా.. విపక్షాల మధ్య అనైక్యత మీద కచ్చితమైన అంచనా మోడీషా లకు ఉంది. అదే నిజమైంది కూడానూ. ఇంత హడావుడిగా బిల్లును పరుగులు తీయిస్తారని కాంగ్రెస్ ఊహించలేదు.

ఇక రాజ్యసభలో దీనిపై మాట్లాడేందుకు కాశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ ను ఎంచుకోవడం మరింత పొరపాటని విశ్లేషకులు భావిస్తున్నారు. కాశ్మీర్ సంప్రదాయ రాజకీయాల నుంచి వచ్చిన ఆజాద్ పై అక్కడి రాజకీయ పార్టీల ప్రభావం చాలా ఎక్కువ. అందుకే, వారి బాటలోనే పూర్తి వ్యతిరేకతతో మాట్లాడారు. దీంతో కనీసం ఏదో చెప్పి తప్పించుకునే అవకాశం కూడా కాంగ్రెస్ కు ఈవిషయంలో లేకుండా పోయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

విప్ జారీచేయాల్సిన స్థానంలో ఉన్నవారే కాంగ్రెస్ స్టాండ్ ను వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్ లో ఈ బిల్లు విషయంలో నాయకులకీ. అధిష్టానానికి మధ్య ఉన్న అంతరాన్ని సూచించింది. ఎంపీలు కూడా ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో పడిపోయారని చెబుతున్నారు. కీలక విషయాల్లో మెజార్టీ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం జాతీయ పార్టీలకు ఉంటుంది. సరిగ్గా కాంగ్రెస్ అక్కడే విఫలం అయింది. అధికారపక్షం చేస్తున్న పనిలో లోపాల్ని వెతకడం మాని.. ముందు దానిని గుడ్డిగా వ్యతిరేకించడం అనే పాయింట్ మీద నిలబడిపోవడం కాంగ్రెస్ కొంప ముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. కాశ్మీర్ లో తమ పట్టు ఎలా నిలబెట్టుకోవాలనే ధ్యాసలో మిగిలిన దేశంలో ప్రజల మనోభావాలు ఏమిటనే విషయాన్ని పట్టించుకోకుకండా కాంగ్రెస్ తప్పు చేసిందని వారంటున్నారు. వాస్తవానికి బిల్లుని సమర్థించి.. సవరణలు ప్రతిపాదిస్తే.. కాశ్మీర్ లోనూ కొంత అనుకూలత దక్కేదనీ, ఇటు మిగిలిన ప్రాంతాల్లోని ప్రజల్లోనూ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఏర్పడేది కాదనీ విశ్లేషకులు చెబుతున్న మాట.

ఎదిఏమైనా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ను కశ్మీర్ లోకి బీజేపీ నెట్టేసిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సింధియా వంటి నాయకులు బిల్లుకు మద్దతు పలకడం కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపుతుందనే అభిప్రాయాన్ని రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories