logo
జాతీయం

వానమ్మకి మన మీద కనికరం కలగడం లేదా?

వానమ్మకి మన మీద కనికరం కలగడం లేదా?
X
Highlights

మండే ఎండల నుంచి ఉపశమనం దొరుకుతుందని ముచ్చటపడ్డా. నిన్నామొన్నటి వరకూ మండి పడిన సూరీడు కాస్త నెమ్మదించాడని...

మండే ఎండల నుంచి ఉపశమనం దొరుకుతుందని ముచ్చటపడ్డా. నిన్నామొన్నటి వరకూ మండి పడిన సూరీడు కాస్త నెమ్మదించాడని సంబురపడ్డాం. రుతుపవనాల రాకతో తొలకలరి పలకరింపులు ఇక ఆగవని ఆనందపడ్డాం. కానీ నైరుతి ఇప్పట్ల నైనై అంటోంది. ఈసారి వర్షాలు బాగానే ఉంటాయని వాతావరణవేత్తలు చెబుతున్నా పరిస్థితి చూస్తుంటే వర్షాభావం ఈసారి కూడా తప్పదేమోనన్న బెంగతో రైతన్న దిగులు పడుతున్నాడు. ఏరువాక సన్నాహాలు చేసుకోవాలా వద్దా అని సందేహంతో సంకట స్థితిలో ఉన్నాడు. అసలు మొత్తంగా నైరుతి రుతుపవనాల దోబూచులాట ఎందుకిలా? తొలకరి పలకరింపులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఎన్నాళ్లనుంచో ఎదురు చూపులు చూస్తున్న ప్రజానీకానికి నైరుతి రుతుపవనాలు సేద తీరుస్తాయన్న భ్రమ పటాపంచలైంది. ఎట్టకేలకు దేశంలోకి అడుగుపెట్టిన రుతుపవనాలు.. ఎక్కడికక్కడే ఆగిపోతూ ముందుకు కదిలేందుకు మొరాయిస్తున్నాయి.

మన దేశానికి ఉన్న భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే వున్నాయి. అందుకే మన దేశాన్ని మాన్‌సూన్ లాండ్ అని పిలుస్తారు.. పూర్తిగా వ్యవసాయాధారమైన మన జీవనానికి రుతువులే వర్షాధారం.. కేవలం రుతువుల వల్లే మనకు వర్షాలు కురుస్తాయి. కానీ పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు మన రుతువుల గతిని కూడా మారుస్తున్నాయి. లానినో, ఎల్‌నినోల ప్రభావం రుతుపవనాల కదలికలపై పడుతోంది. అందుకే ఒక్కోసారి ముందే వచ్చేసే రుతువులు, ఒక్కోసారి.. టైమ్ దాటిపోయినా రావు..

రుతుపవనాలు ఇపుడు మొహమాట పడుతున్నా ముందు ముందు మంచి వానలే పడతాయంటున్నారు మన వాతావరణ శాస్త్రవేత్తలు. గత ఏడాది ఇలాంటి అంచనాలే వేసినా లెక్క తప్పింది. మరి ఈసారేమవుతుందోనని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మృగశిర కార్తె తొలకరి జల్లులు రైతులకు పంటలు వేసుకునేందుకు ప్రకృతి ఇచ్చే తొలి సంకేతాలు.. ఈ కళ్లాపి జల్లులే భూమిని వ్యవసాయానికి సిద్ధం చేస్తాయి. రైతులు దుక్కి దున్ని విత్తు వేస్తారు. కానీ ఈ సారి ఈ సంకేతాలే అస్పష్టంగా వుండటంతో అన్నదాతల్లో అయోమయం ఆవరించింది.

ఏమైనా నైరుతి తొలకరి జల్లులు దోబూచులాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనపడి, మరికొన్ని ప్రాంతాల్లో కురవాలా వద్దా అనే సందేహంలో వున్నాయి. వర్షపు చినుకు కోసం భూమాత ఎంత తపించిపోతోందో, అంతకు రెండింతలు అన్నదాత తపించిపోతున్నాడు. తలెత్తి ఆకాశం వైపు బేలగా చూస్తున్నాడు వర్షం పడితేనే పంట పండేది పంట పండితేనే కడుపు నిండేది.. కడుపు నిండితేనే జీవితం గడిచేది.. ప్రకృతితో మమేకమైపోయిన తమ జీవితాలను తొలకరి జల్లులు పలకరించాలని, పచ్చని పంటలు పండించాలని, అందరికీ గుప్పెడు మెతుకులు పంచాలనీ అన్నదాత కల. ఆ కల నిజం కావాలని నెలకి మూడు వానల్లు కురవాలని వరిచేలు పండాలని ఆశిద్దాం.


Next Story