కాశ్మీర్ టెన్షన్.. కేంద్రం ఏం చేయబోతోంది?

కాశ్మీర్ టెన్షన్.. కేంద్రం ఏం చేయబోతోంది?
x
Highlights

నిన్నటి వరకూ కాశ్మీర్ టెన్షన్ కొంతవరకే ఉండేది. ఇప్పుడు కేంద్రం నిన్న అర్థరాత్రి నుంచి చేస్తున్న హడావుడికి దేశవ్యాప్తంగా టెన్షన్ ప్రారంభమైంది. అసలు ఏం...

నిన్నటి వరకూ కాశ్మీర్ టెన్షన్ కొంతవరకే ఉండేది. ఇప్పుడు కేంద్రం నిన్న అర్థరాత్రి నుంచి చేస్తున్న హడావుడికి దేశవ్యాప్తంగా టెన్షన్ ప్రారంభమైంది. అసలు ఏం చేయబోతున్నారు? అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. కేంద్రం కాశ్మీర్ లో ఏం చేస్తే ఏం జరుగుతుందన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. దేశం మొత్తం ప్రస్తుతం ఇదే టెన్షన్ లో ఉంది.

కేంద్రం కాశ్మీర్ లో ఏం చేయడానికి అవకాశం ఉంది?

కొంతమంది అంచనా ప్రకారం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. కాశ్మీర్ కు మన రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తిని కలిగిస్తున్న నిబంధనలు ఇవి. 370 ప్రకారం పార్లమెంట్ లో చేసే చట్టలేవీ కాశ్మీర్ లో అమలు చేసే అవకాశం ఉండదు. ఇక 35ఏ.. ఇది కాష్మీరీల శాశ్వత హక్కుల నిబంధన. ఇప్పుడు ఇవి రద్దు చేస్తే కనుక దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లానే అక్కడ ఇతర రాష్ట్రాల వారు ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం దొరుకుతుంది. అలాగే పార్లమెంట్ చేసే చట్టాలన్నీ ఇక్కడ అమలు చేసే అవకాశం ఉంటుంది.

మరోకోణంలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రపతి పాలన ఉంది. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీ లక్ష్యంగా భావిస్తున్నారు. కానీ, ఎన్నికల కోసం ఇంత హడావుడి చేసే అవసరం లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రుల్ని గృహ నిర్బంధమూ చేయక్కర్లేదు.

పంద్రాగస్టు పండగ చేయాలని భావిస్తున్నారన్నదీ ఒక వాదన. కాశ్మీర్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ లో ప్రతి పల్లె లోనూ జాతీయ జెండా ఎగిరేలా చేయాలనీ, దాని ద్వారా భారత జాతీయతా భావాన్ని కాశ్మీర్ లోయలో పెరిగేలా చేయాలనీ కేంద్రం భావిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ, ఇంత సైన్యాన్ని మొహరించి మరీ జాతీయతా భావాన్ని పెంపొందించాల్సిన పరస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. భారత్ జెండాలు ఎగుర వేయడానికి కొన్ని పల్లెల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దాని కోసం ప్రపంచం దృష్టి మొత్తం మన దేశంపై పడేలా చేసి.. కాశ్మీర్ లో భారత వ్యతిరేకత ఉందని పించేలా చేసే అవకాశం కనిపించడం లేదు.

జమ్మూ, కాశ్మీర్ ను మూడు భాగాలుగా విభజన చేయాలన్న భావంలో కేంద్రం ఉందని తెలుస్తోంది. దీనివలన ఒకే దెబ్బకు మూడు ప్రయోజనాలు కలుగుతాయని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే.. తీవ్రవాదం.. పాకిస్తాన్ అనుకూలంగా ఉండే ప్రాంతాలు కాశ్మీర్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇటు జమ్మూ, అటు లడఖ్ ప్రాంతాల్లో భారత భావజాలానికే మద్దతు. తీవ్రవాద కదలికలకూ అవకాశాలు తక్కువ. అందువల్ల ఈ రెండు ప్రాంతాల్లో ఎన్నికలు జరిపి అధికారం సాధించవచ్చు. ఇక కాశ్మీర్ లో కేంద్ర పాలన కొనసాగించి తీవ్రవాదాన్ని అక్కడికే కట్టడి చేయొచ్చు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే దీనికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అందుకే అత్యధికంగా సైనికుల్ని మోహరించారని అనుకోవచ్చు.

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. పీవోకే పై దాడి. దీని ద్వారా పాక్ అధీనంలోని మనం ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనే వ్యూహం కూడా ఉందనేది ఒక అంచనా. కానీ, ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్, ఇండియా ల మధ్య అది యుద్దానికి దారితీస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో కావాలని భారత్ కయ్యానికి కాలు దువ్వుతుందా అనేది ప్రశ్న.

ఇన్ని అంచనాలు.. ఇంకెన్నో విశ్లేషణలు కాశ్మీర్ చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో ఏది సరైనదో ఈరోజు తేలవచ్చు. లేదా మరి కొన్నాళ్ళు ఇదే పరిస్థితీ కొనసాగవచ్చు. అయితే, ఇప్పటివరకూ జరుగుతున్న ఏర్పాట్ల వెనుక రహస్యాన్ని ఇప్పుడు ప్రభుత్వం విప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే, పార్లమెంట్ సమావేశాలు ఈరోజు జరగనున్నాయి. పార్లమెంట్ లో కచ్చితంగా ప్రభుత్వం ఈ పరిణామాలపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories