Top
logo

Congress Crisis: సమర్థుడైన సారథి విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి సంక్షోభం!

Congress Crisis: సమర్థుడైన సారథి విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి సంక్షోభం!
X

Congress leaders (file image)

Highlights

Congress crisis: ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వ సమస్య పీడిస్తోంది. అయితే ఇది ఆ పార్టీకి మొదటిసారి కాదు.

(హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం)

సమర్థుడైన సారథి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ తన మనసును మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడం, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీ కుటుంబం నుంచి మరొకరిని ప్రతిపాదించేందుకు కూడా రాహుల్‌ సుముఖంగా లేక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ గాంధీ పార్టీకి 16వ అధ్యక్షుడు, నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఆరవ అధ్యక్షుడు. రాహుల్‌ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలను కూల్చేసి తాను అధికారపగ్గాలను స్వీకరించగలిగింది. అదే ఒరవడితో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పార్టీ ఆశించింది. అది జరగ్గపోగా నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ గతంలోకన్నా 21 సీట్లను అదనంగా గెలుచుకోవడంతో అందుకు నైతిన బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో ఇలా సారథ్య సంక్షోభం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు.

నాడు సుభాస్‌ చంద్రబోస్‌ ఎన్నిక, రాజీనామా

1938లో గుజరాత్‌లోని హరిపురలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ వార్షిక సమావేశంలో సుభాస్‌ చంద్రబోస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌ లాంటి పార్టీ సీనియర్‌ నాయకులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఏడాది తిరక్కముందే మహాత్మా గాంధీ, బోస్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్‌ పాలకులకు సహకరించి తద్వారా దేశ పాలనలో సానుకూల సంస్కరణలు తీసుకరావాలని గాంధీ భావిస్తే, అదే ప్రపంచ యుద్ధ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబాటుచేసి దేశ స్వాతంత్య్రానికి మార్గం సుగుమం చేసుకోవాలన్నది బోస్‌ ఎత్తుగడ. 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్‌ సమేశంలో మహాత్మా గాంధీ వారించినా వినకుండా బోస్‌ మరోసారి అధ్యక్ష పదవిని నామినేషన్‌ వేశారు. ఆయనకు పోటీగా పట్టాభి సీతారామయ్య పేరును గాంధీ ప్రతిపాదించారు. 205 ఓట్ల మెజారిటీతో మళ్లీ బోసే గెలిచారు.

'ఇందులో పట్టాభి ఓటమికన్నా నా ఓటమే ఎక్కువ' అని తర్వాత ఆయనకు రాసిన లేఖలో గాంధీ పేర్కొన్నారు. బోస్‌ కాదన్న వినకుండా గాంధీ, కొత్త తరహా ప్రభుత్వ పాలనకోసం బ్రిటీష్‌ పాలకులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బహిరంగ ప్రకటన చేశారు. అందుకు విరుద్ధంగా బ్రిటీష్‌ పాలకులతో సహాయ నిరాకరణ ఉద్యమానికి బోస్‌ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎవరి పక్షం వహిస్తారంటూ గాంధీ, పార్టీ నాయకులను నిలదీయడంతో బోస్, ఆయన సోదరుడు శరత్‌ చంద్ర బోస్‌ మినహా అందరు పార్టీకి రాజీనామా చేశారు. ఇక చేసేదేమీలేక బోస్‌ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాజేంద్ర ప్రసాద్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

1949లో మరోసారి

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీ. రాజగోపాలచారి (అప్పటికి గవర్నర్‌ జనరల్‌ అంటే భారత తొలి రాష్ట్రపతి) పేరును పండిట్‌ నెహ్రూ ప్రతిపాదించగా, ఆయన డిప్యూటి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వ్యతిరేకించారు. పటేల్, రాజేంద్ర ప్రసాద్‌ పేరును ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో అప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్యనే పార్టీ సభ్యులు తిరిగి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకు పురుషోత్తమ దాస్‌ టాండన్‌ పేరును పటేల్‌ ప్రతిపాదించారు. పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకుంటున్న ఛాందస హిందువంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. అయినప్పటికీ నాసిక్‌లో జరిగిన పార్టీ సమావేశంలో టాండన్‌ ఎన్నికయ్యారు. దాంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ రాజగోపాలచారికి రాసిన లేఖలో నెహ్రూ హెచ్చరించారు. నెహ్రూతో విభేదాల కారణంగా తొమ్మిది నెలల అనంతరం టాండన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈలోగా గుండెపోటుతో పటేల్‌ మరణించారు. నెహ్రూను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ 1951, సెప్టెంబర్‌ 8వ తేదీన పార్టీ ఏకగ్రీవగా తీర్మానించింది. అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు (నాలుగేళ్లు) నెహ్రూయే అధ్యక్షుడిగా ఉన్నారు.

1969లో తీవ్ర సంక్షోభం

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డిని పార్టీ సీనియర్‌ నాయకులు ప్రతిపాదించగా, స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వీవీ గిరీకి అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మద్దతిచ్చారు. దాంతో ఇందిరాగాంధీని అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎస్‌. నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చీలిక వచ్చింది. పర్యవసానంగా మైనారిటీలో పడిన తన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ, సీపీఐ మద్దతుతో గట్టెక్కించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిర ప్రభుత్వం పడిపోవడం, మళ్లీ అధికారంలోకి రావడం తెల్సిందే. అప్పటి నుంచి ప్రధానిగా ఉన్న వ్యక్తికే పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆనవాయితీ మళ్లీ వచ్చింది.

ఆమె తర్వాత ప్రధాని అయిన రాజీవ్‌ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహారాలు అలాగే ఎన్నికయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో తప్పించారు. ఆయన తర్వాత సీతారామ్‌ కేసరి కొద్దికాలం ఉన్నారు. సోనియా గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం కోసం ఆయన్ని తప్పించి ఆమెను ఎన్నుకున్నారు. అందరికన్నా ఎక్కువగా 19 ఏళ్లపాటు సోనియానే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వారసులుగా రాహుల్‌ వచ్చారు. ఒకప్పుడు సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీలో సారథ్య సంక్షోభం ఏర్పడితే ఆ తర్వాత పదవుల కోసం సంక్షోభాలు వచ్చాయి. సంక్షోభాలను నివారించడం కోసం వారసత్వ రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వారసత్వాన్ని రాహుల్‌ వద్దంటున్నారు.

Web TitleCongress crisis for leadership is not first time the history of the crisis in congress for leadership
Next Story