సుస్వరాల గాయక 'బాలు' నికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

సుస్వరాల గాయక  బాలు నికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
x
Highlights

ఆయన మాట్లాడితే తేటతెలుగు తీయదనం మనసును హత్తుకుపోతుంది. ఇక ఆయన పాడితే సప్త స్వరాలూ ఆయన గాత్రంలో పంచామృతాల్లా మారిపోయి మరోలోకంలోకి తీసుకుపోతాయి. అది...

ఆయన మాట్లాడితే తేటతెలుగు తీయదనం మనసును హత్తుకుపోతుంది. ఇక ఆయన పాడితే సప్త స్వరాలూ ఆయన గాత్రంలో పంచామృతాల్లా మారిపోయి మరోలోకంలోకి తీసుకుపోతాయి. అది చిరంజీవి కోసం పాడిన బ్రేక్ డాన్స్ పాట కావచ్చు..శంకరశాస్త్రి కోసం ఆలపించిన శంకరా పాట కావచ్చు.. కమల్ కోసం పాడిన సీతమ్మ అందాలూ అయినా సరే.. అల్లు రామలింగయ్య కోసం పాడిన ముత్యాలూ వస్తావా అయినా సరే.. ఒకే గొంతు వేలాది గీతాలు.. ఒకే స్వరం వందలాది గాత్రాలు.. అనితర సాధ్యమైన సంగీత ప్రయాణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వంతం.

గమకాలూ..నమకాలూ వంటి సంగీత లెక్కలు తెలీని ప్రజలకు బాలూ గానమే అమృతం. పరమ శివుడ్ని మెప్పించే శివస్తుతి చేసినా.. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ పక్కా స్థానిక గానంతో అలరించినా అది అయన ప్రతిభే. ప్రేమ గీతం.. విరహ గీతం.. భక్తి పాట.. రక్తి గానం ఇలా వీటి అర్థాలు వెతికే పని బాలసుబ్రహ్మణ్యం పాటకు ఉండదు. ఆయన పాడిన పాట వినపడిందా సాధారణ ప్రజల మనసుల్లో గిలిగింత మొదలయినట్టే. సంగీత దర్శకులు ఎంత గొప్పవారైనా.. కొత్తవారైనా సరే బాలూ గానం తోడైతే ఆ పాటకు మరింత విలువ జతకూరినట్టే.

సినిమా పాటకు సరిగ్గా ఏమి కావాలో.. ఎంత కావాలో ఎస్పీ కి తెలిసినట్టు మరేవరికే తెలీదు. ఏ నటుడికి ఎలా పాడాలో.. ఆయనకు ఉన్నంత స్పష్టత అయన ముందు ఎవరికీ లేదు. ఇప్పుడు ఎవరికీ తెలీదు. ఇకముందు ఎవరూ చేయలేరు. బాలసుబ్రహ్మణ్యం సినిమా పాటకి కొత్త పరుగులు నేర్పారు. ఇప్పుడు అదే పరుగు నడుస్తోంది. తెలుగు పదాలని అతి స్పష్టంగా రణగొణ సంగీత వాయిద్యాల మధ్యలో కూడా పలికించండంలో బాలూ ని మించిన వారు లేరు. ఒక్క అక్షరం కూడా అయన పాడిన వేలాది పాటల్లో తప్పు పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

భాష ఏదైనా బాలూ పడితే అది అద్భుత గీతమే. ఎన్నో భాషలు.. మరెన్నో సినిమాలు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ''పాడుతా తీయగా'' అంటూ అయన చేస్తున్న స్వరసేవ మరో ఎత్తు. ఎందరో ఔత్సాహిక గాయకుల్ని వెలుగులోకి తెచ్చి..వారి గానానికి చిత్రీ పట్టి..వారిని ఒక స్థాయిలో పాడేలా తీర్చిదిద్ది తనకు అన్నీ ఇచ్చిన అమ్మ లాంటి కళకు నిత్య స్వర నీరాజనం అందిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు ఈరోజు (జూన్ 4). ఈ సందర్భంగా ఆయనకు జేజేలు చెబుతోంది హెచ్ఎంటీవీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories