తెలంగాణలో కారు స్పీడ్‌కు బ్రేకులు.. 17 స్థానాల్లో తగ్గిన టీఆర్ఎస్ బలం

తెలంగాణలో కారు స్పీడ్‌కు బ్రేకులు.. 17 స్థానాల్లో తగ్గిన టీఆర్ఎస్ బలం
x
Highlights

తెలంగాణలో కారు స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. కమలం వికసించింది. హస్తం పార్టీ సత్తా చాటుకుంది. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ...

తెలంగాణలో కారు స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. కమలం వికసించింది. హస్తం పార్టీ సత్తా చాటుకుంది. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ గుభాళించినా పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. బిజెపి, కాంగ్రెస్‌ పుంజుకుని టీఆర్‌ఎస్‌‌కు షాక్ ఇచ్చాయి. సారు కారు పదహారు నినాదంతో జోరుగా ప్రచారం చేసిన టీఆర్ఎస్ పదహారు గోల‌్‌ను కొట్టలేకపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయింది. కేవలం 9స్థానాలతో సరిపెట్టుకుంది గులాబీ పార్టీ.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గిన కొన్ని చోట్ల ఈసారి ఇతర పార్టీలు ఆధిక్యం ప్రదర్శించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలుపొందిన స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గిన స్థానాల్లో ఈసారి టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. టీఆర్ఎస్‌కు మంచి ఫలితాలందించిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బిజెపి గెలిచింది. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే టీఆర్‌ఎస్‌ కన్నా బిజెపి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

శాసన సభ ఎన్నికలతో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో శాసన సభ ఎన్నికల నాటి బలాబలాలతో పోలిస్తే 17 స్థానాల్లో టీఆర్ఎస్ బలం తగ్గగా బిజెపి 20స్థానాల్లో , కాంగ్రెస్ రెండు చోట్ల పుంజుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 46.87శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 41.29శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28.43శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 29.48శాతం ఓట్లు సాధించింది. ఇక బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో 6.98శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 19.45శాతం ఓట్లు సాధించింది.

టీఆర్ఎస్‌కు అప్పటి కంటే ఓట్ల శాతం తగ్గగా బిజెపికి గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ శాతంలోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. గత నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 62.25శాతం పోలింగ్ నమోదైంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 62.69 శాతం పోలింగ్ నమోదైంది. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీలకు గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories