ఐటీ గ్రిడ్‌పై విచారణ వేగవంతం

ఐటీ గ్రిడ్‌పై విచారణ వేగవంతం
x
Highlights

తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలందిస్తున్న మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని 'ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థపై నమోదైన కేసు దర్యాప్తులో...

తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలందిస్తున్న మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని 'ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థపై నమోదైన కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంస్థ వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితా, ఆధార్‌, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు అక్రమంగా ఉన్నాయంటూ కేపీహెచ్‌బీ ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌లో ఉండే డేటా అనలిస్ట్‌ తుమ్మ లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కేసు దర్యాప్తునకు సహకరించే సమాచారం కోసం ఆరా తీశారు. ఇప్పటికే పోలీసులు అక్కడ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని కీలక సమాచారాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో భద్రపరిచినట్లు భావిస్తుండటంతో దాన్ని డీకోడ్‌ చేసేందుకు నిపుణుల సహాయంతో ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఆ కీలక సమాచారం ఎలా చేరిందనే అంశంపైనా దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ సమకూర్చిందనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అంశాలపై మాత్రం పోలీస్‌ ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు. మరోవైపు తమ సంస్థ ఉద్యోగులు నలుగురిని సైబరాబాద్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సంచాలకుడు అశోక్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. అయితే ఈ కేసులో అశోక్‌ వద్దే కీలక సమాచారం ఉందనే ప్రచారం జరగడం ప్రాధాన్యం సంతరించుకొంది.

ఫిర్యాదుదారు ఇంటి వద్ద పోలీసుల హడావుడి ఈ కేసులో ఫిర్యాదుదారు లోకేశ్వర్‌రెడ్డి ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. ఏపీ పోలీస్‌ బృందం ఆయన కోసం అక్కడికి వచ్చింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఉద్యోగి భాస్కర్‌ అదృశ్యమైనట్లు గుంటూరులో నమోదైన కేసు దర్యాప్తులో లోకేశ్వర్‌రెడ్డిని విచారించేందుకే తాము వచ్చినట్లు వారు పేర్కొన్నారు. సైబరాబాద్‌ పోలీసులు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సైబరాబాద్‌ పోలీసులు వారిని ఆపి పోలీస్‌ ధ్రువీకరణపత్రాలను ఫొటోలు తీసుకొని పంపించారు.

మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఉద్యోగి ఆర్‌.భాస్కరరావు అదృశ్యంపై ఆయన మామ అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కోసం మాదాపూర్‌లోని సంస్థ కార్యాలయానికి వచ్చిన ఏపీ పోలీసులను రెండోరోజూ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. శనివారం రాత్రి కార్యాలయానికి వచ్చిన ఏపీ పోలీసులను విచారణ చేపట్టకుండా తెలంగాణ పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. భాస్కరరావు కుటుంబీకులు, బంధువులు అతని ఆచూకీపై ఆందోళన చెందుతుండడంతో ఏపీ పోలీసులు ఆదివారం మరోసారి ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయానికి వెళ్లారు. వారిని లోపలికి కూడా ప్రవేశించకుండా తెలంగాణ పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో వెనక్కి వచ్చేసిన ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న భాస్కరరావు తల్లిదండ్రులను కలిశారు. భాస్కర్‌రావు అదృశ్యంపై ఆయన తల్లిదండ్రులు చెప్పిన

భాస్కరరావు ఫిబ్రవరి 28న హైదరాబాద్‌ నుంచి గుంటూరు జిల్లా పెదకాకానికి సమీపంలో రెయిన్‌ట్రీ పార్కులో ఉన్న తన మామ అశోక్‌ వద్దకు వచ్చారు. అదే రోజు తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమైనా ఈ నెల 2 వరకు ఇంటికి గానీ, కార్యాలయానికి గానీ చేరలేదు. భాస్కర్‌రావు అదృశ్యంపై అశోక్‌ శనివారం పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. భాస్కర్‌ పనిచేసే కార్యాలయానికి వెళ్లి ఆరా తీయాలని గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు.. గుంటూరు వెస్ట్‌ డీఎస్పీ కులశేఖర్‌ నేతృత్వంలో ఒక బృందాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌ పంపారు. వారు మాదాపూర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సైబరాబాద్‌ పోలీసులు ఏపీ పోలీసులను అక్కడి నుంచి పంపించేశారు. ఆదివారం మరోసారి ప్రయత్నించినా ఏపీ పోలీసులను కార్యాలయంలోకి వెళ్లకుండా సైబరాబాద్‌ పోలీసులు అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories