Top
logo

కదిరిలో ఎవరి ఓట్లు ఫలితాన్ని శాసించబోతున్నాయి?

కదిరిలో ఎవరి ఓట్లు ఫలితాన్ని శాసించబోతున్నాయి?
Highlights

పులివెందులకు ఆనుకుని ఉన్ని నియోకవర్గం. ఖాద్రీ నరశింహుడు కొలువుతీరిన ప్రాంతం. ఆకలి చావులు, వలసలు, కరవుకు...

పులివెందులకు ఆనుకుని ఉన్ని నియోకవర్గం. ఖాద్రీ నరశింహుడు కొలువుతీరిన ప్రాంతం. ఆకలి చావులు, వలసలు, కరవుకు మారుపేరుగా నిలిచిన నేల. అదే కదిరి నియోజకవర్గం. మరి వలసల సెగ్మెంట్‌గా మారిన కదిరిలో జనం ఎవరికి ఓటేసి వెళ్లిపోయారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలువబోతున్నారు.అభ్యర్థుల తలరాతలను శాసించే మైనార్టీ ఓటర్లు, ఈసారి ఎటువైపు మొగ్గారు.

అనంతపురం జిల్లాలో మిగతా నియోజకవర్గాలు ఒకెత్తయితే, కదిరిది మరో పరిస్థితి. కరవుకు మారుపేరైన కదిరి నియోకవర్గంలో ఇప్పటికీ లక్షలమంది ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని ముంబై, బెంగళూరు, కేరళ వంటి మహానగరాలకు వెళుతుంటారు. గతంలో మహిళలను ఇక్కడి నుంచి వ్యభిచార గృహాలకు తరలించిన చరిత్ర ఉంది. ఇప్పటికీ తిండి కోసం పోరాటం సాగించే ప్రజలు గ్రామాల్లో కనిపిస్తారు. అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్న కదిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన చర్యలు కొంత మేరకు ఫలితాలిచ్చాయి. అక్కడి జనం జీవితాల్లో కొంత వరకూ మార్పు తీసుకురాగలిగాయి. ఇలాంటి నియోజకవర్గంలో ఓటర్ల మాత్రం ఎంతో చైతన్య వంతులు.

పనిచేసే వారికే ఇక్కడి జనం పట్టం కడతారు. ఈసారి ఎన్నికల్లో కదిరి జనం ఎవరికి ఓటు వేశారన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బరిలో నిలిచారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున డా. సిద్దారెడ్డి పోటీలో ఉన్నారు. ఇతర పార్టీల నేతలు బరిలో ఉన్నా, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే వైసీపీ అభ్యర్థి సిద్దారెడ్డి ప్రచారంలో మునిగిపోయారు. టీడీపీ తరఫున టికెట్టు దక్కించుకున్న కందికుంట వెంకటప్రసాద్ తాజా ఎమ్మెల్యే చాంద్ బాషాతో పాటు అసమ్మతి నేతలను కలుపుకొని ఎన్నికల్లో ముందుకు సాగారు. చివరివరకూ ఎవరికి వారు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నించారు.

కదిరి నియోకవర్గంలో మొత్తం 2,39,867 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,19,615 మంది, స్త్రీలు 1,20,243 మంది ఇతరులు 9 మంది. నియోజకవర్గంలో ఈసారి 79.95 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 74.9 శాతం రికార్డయితే, ఈసారి 5.05 శాతం పోలింగ్ పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం తమకు లాభిస్తూందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కందికుంట వెంకటప్రసాద్, వైఎస్ ఆర్ సీపీ తరఫున అత్తార్ చాంద్ బాషా పోటీ చేశారు. కందికుంటపై చాంద్ బాషా కేవలం 968 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తర్వాత చాంద్ బాషా టీడీపీలోకి రావడంతో ఇరువురి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. టికెట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగించినా, చివరికి అధిష్టానం కందికుంట కే టికెట్ ఖరారు చేసింది. అధిష్టానం ఆదేశాలలో ఎన్నికల్లో ఇద్దరు కలిసి ప్రాచారం సాగించారు.

వైఎస్ ఆర్ సీపీ నుంచి ముందుగానే సిద్దారెడ్డి పేరు ఖరారు కావడంతో క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. పులివెందుల పక్క నియోజకవర్గం కావడం, ఆ ప్రభావం ఇక్కడ ఉంటుందని వైఎస్ ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమంటున్నారు. టీడీపీ నేతలు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కదిరి పట్టణంతో పాటు గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ముస్లిం మైనార్టీ ఓట్లు. నియోకవర్గంలో వీరి ఓట్లు దాదాపు 40 శాతం. దీంతో ఎవరికి వారు మైనార్టీ ఓట్లు తమకే పడ్డాయని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి హోరాహోరీగా సాగిన పోరులో ఎవరు గెలిచినా అతి తక్కువ ఓట్లతో విజయం సాధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కదిరిలో ఈ సారి గెలువబోయే అభ్యర్థి ఎవరన్నది ఈ నెల 23న తేలుతుంది.

Next Story


లైవ్ టీవి