Top
logo

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
X
Highlights

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలు రాములు నాయ‌క్, భూప‌తిరెడ్డి, యాద‌వ‌రెడ్డిపై చర్యల వ్యవహారం క్లైమాక్స్‌కు తెరపడింది.

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలో అంతా ఊహించినట్లుగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న అభియోగంపై ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవ రెడ్డి, రాములు నాయక్ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేశారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి, శాసనసభ్యుల కోటాలో యాదవరెడ్డి, గవర్నర్‌ కోటాలో రాములు నాయక్‌ మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ సభ్యులుగా ఎన్నికైన ఈముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ శాసనమండలి పక్షం ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ముగ్గురు అనర్హులుగా ప్రకటించాలని కోరడంతో చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలపై విధించిన అనర్హత వేటు వెంటనే అమల్లోకి రానుంది. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలపై చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ లో చేరిన కొండా మురళి, మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో వైపు టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు పడకుండా సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసినట్లు గతంలోనే ప్రకటించారు.

Next Story