సూపర్‌ సైక్లోన్‌గా‌ మారిన ఫోని

సూపర్‌ సైక్లోన్‌గా‌ మారిన ఫోని
x
Highlights

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఫొని పెను తుపాను కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే సూపర్‌ సైక్లోన్‌గా మారింది. ప్రస్తుతం 21 కిలోమీటర్ల వేగంతో తుపాను...

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఫొని పెను తుపాను కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే సూపర్‌ సైక్లోన్‌గా మారింది. ప్రస్తుతం 21 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. విశాఖపట్నంకు 175 కిలోమీటర్ల దూరంలో పూరీకి 360 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ఈశాన్య దిశగా వెళ్తున్న సూపర్‌ సైక్లోన్‌ శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో పూరీకి సమీపంలోని బలుకుండో వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు గోపాల్‌పూర్‌ డాప్లర్‌ రాడార్‌ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో 185 నుంచి 205 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటికే తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపిస్తోంది. తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే సముద్రం చొచ్చుకొచ్చింది. భారీ ఈదురుగాలులతో అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. ఆంధ్రయూనివర్సిటీతో అనేక ప్రాంతాల్లో స్తంభాలు చెట్లు పడిపోయాయి. తుపాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది. గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సొంపేట, మందస, సంతబొమ్మాలి, పలాస, నందిగాం, వజ్రపు కొత్తూరు మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

విజయనగరం జిల్లా భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగమండలాల్లోనూ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ పాక్షికంగా తుపాను ప్రభావం కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. ఉప్పాడలో సముద్రం ముందుకొచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బీచ్‌లోకి మూడు రోజులపాటు పర్యాటకులకు అనుమతిపై నిషేధం విధించారు. తుపాను తీరం దాటేంతవరకు ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. వాహనాలపై సంచరించకూడదని అధికారులు సూచించారు.

తుపాను ప్రభావంతో తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఉత్తరాంధ్ర మీదుగా తిరిగే వందకు పైగా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విశాఖకు నుంచి ఒడిశాకు వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తూ మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను అప్రమత్తం చేశారు. ఇక సూపర్‌ సైక్లోన్‌ కారణంగా రైళ్లతో పాటు విమాన సం‌స్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. విశాఖ నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది. ఫోని తుపాన్ కారణంగా ఉత్తరకోస్తా జిల్లాల తీరప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలు, మంచినీరు అధికారులు సరఫరా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories