డీకే. అరుణ తర్వాత ఎవరు..?

డీకే. అరుణ తర్వాత ఎవరు..?
x
Highlights

కాంగ్రెస్ సీనియర్‌ నేత డీకే. అరుణ బీజేపీ గూటికి చేరడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆమెనే కాదు...మరకొందరు కాంగ్రెస్ కీలక నేతలు , అధికార పార్టీ...

కాంగ్రెస్ సీనియర్‌ నేత డీకే. అరుణ బీజేపీ గూటికి చేరడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆమెనే కాదు...మరకొందరు కాంగ్రెస్ కీలక నేతలు , అధికార పార్టీ నేతలు కూడా కమలం పంచన చేరుతారని ప్రచారం జరుగుతోంది. త్వరలో కమలం కండువా కప్పుకునే నేతలెవరనే సస్పెప్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్‌కు పోటీగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన తెలంగాణ బీజేపీ ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు వల పన్నుతోంది. టీ.కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌ మొదలు పెట్టింది. కాంగ్రెస్‌‌లో తీవ్ర అసంతృప్తితో ఉండి టీఆర్ఎస్‌‌లో చేరలేని నేతల కోసం బీజేపీ ఆహ్వానాలు పంపిస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణను తాజాగా పార్టీలో చేర్చుకున్న కమలం నేతలు ఈసారి ఏకంగా ఆరుగురిపై గురి పెట్టినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో పాటు మాజీ పీసీసీ చీఫ్‌తో బీజేపీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక మాజీ మంత్రితో చర్చలు జరిగాయని చెబుతున్నారు. అలాగే మాజీ సీఎల్పీ నేత కుమారుడితో పాటు హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడితోనూ బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎల్పీ నేత కుమారుడిని నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఆఫర్ కూడా ఇచ్చారట.

అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోటీ చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఎర్రశేఖర్ , నారాయణపేట నేత శివకుమార్ రెడ్డి కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్‌లో టికెట్ వచ్చే అవకాశం లేని సిట్టింగ్ ఎంపీలతో కూడా బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అధికార పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకుంటాయని చెబుతున్నారు. త్వరలోనే మరింత మంది పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. తాజాగా ఇంటి పార్టీ ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస రెడ్డి కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉండిఇంటి పార్టీలో చేరిన యెన్నం శ్రీనివాస రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories