ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీమంతులే అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీమంతులే అభ్యర్థులు
x
Highlights

ధనం మూలం ఇదం జగత్ అన్న పెద్దలమాట. భారత రాజకీయాలకు సైతం వర్తిస్తుంది. నీతి,నిజాయితీ, అంకితభావాలే గుణగణాలుగా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎన్నుకొనే రోజులు...

ధనం మూలం ఇదం జగత్ అన్న పెద్దలమాట. భారత రాజకీయాలకు సైతం వర్తిస్తుంది. నీతి,నిజాయితీ, అంకితభావాలే గుణగణాలుగా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎన్నుకొనే రోజులు పోయి. ధనవంతులు, కుబేరుల చుట్టూనే ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయి. భారత్ లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వివిధ రాజకీయపార్టీల అధినేతలు, అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను చూస్తే ఔనా మన ప్రజాసేవకులు ఇంత ధనవంతులా అనుకోక తప్పదు. ఇంతకూ ఎవరి ఆస్తులు ఎంతో ఆ చిట్టా ఏంటో ఓసారిచూద్దాం.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రజల చేత ప్రజల యెుక్క ప్రజల కొరకు అన్న ప్రజాస్వామ్య నిర్వచనం మార్చుకోవాల్సిన రోజులు వచ్చాయి. భారత్ లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది వారాల్లో జరిగే ఎన్నికలను చూస్తే ప్రజాస్వామ్యం కాస్త ధనికులస్వామ్యంగా మారినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి వివిధ పార్టీల తరపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లు చూస్తే ధనం చేత ధనం యెక్క ధనం కొరకు అన్న విధంగా మన ప్రజాస్వామ్యం మారిపోయిందేమోనని భయపడాల్సిన సమయం వచ్చింది.

డబ్బున్న వారి చేతిలోనే రాజకీయ అధికారం ఉంటూ వస్తోంది. సామాన్యులు మాత్రం ఓట్లు వేసే నిమిత్తమాత్రులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల బరిలో నిలిచేవారిలో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ వస్తోంది. కోట్లున్న బడాబాబులకు సీట్లు ఓట్లున్న సగటు మనుషులకు నోట్లు, రకరకాల తాయిలాలు అన్నట్లుగా భారత రాజకీయాలు మారిపోయాయి.

ఏపీ ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు కోటీశ్వరులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలకు మాత్రమే సీట్లు ఇవ్వటానికి ప్రాధాన్యమిచ్చాయి. నెల్లూరు అర్బన్ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న మంత్రి నారాయణ తన ఎన్నికల అఫిడవిట్ ద్వారా 650 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

ఏపీ శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యధిక ఆస్తులున్న వ్యక్తి నారాయణ మాత్రమే కావడం విశేషం. అంతేకాదు నర్సాపురం లోక్ సభ వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఆస్తులు 324 కోట్లుగా ఉన్నాయి. విశాఖ లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన శ్రీభరత్ 200 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన శ్రీమంతుడు. అంతేకాదు ఏపీ మంత్రి లోకేశ్ కు తోడల్లుడు, బాలయ్యకు చిన్నల్లుడు కూడా కావడం విశేషం.

గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ తన ఆస్తులు 141 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులు 20 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే ఆయన భార్య నారా భువనేశ్వరి ఆస్తులు మాత్రం 648 కోట్లుగా ఉన్నాయి. నారా లోకేశ్ సైతం తన ఆస్తుల చిట్టాను అఫిడవిట్ ద్వారా బయటపెట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను 339 కోట్ల 89 లక్షలుగా ప్రకటించారు. ఇందులో జగన్ భార్య వైఎస్ భారతి, కుమార్తెల పేరుతో ఉన్న ఆస్తులు సైతం ఉన్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తులు, అప్పులు కలసి 50 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలిపారు. ఇందులో పవన్ కల్యాణ్ నలుగురు పిల్లలు, భార్య పేరుతో ఉన్న ఆస్తులు సైతం ఉన్నాయి. పార్టీ అధినేతల ఆస్తుల చిట్టా అలా ఉంటే విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థుల ఆస్తులు చూస్తే వావ్ అనుకోక తప్పదు.

విజయవాడ లోక్ సభ వైసీపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన పొట్లూరి ప్రసాద్ ఆస్తులు 347 కోట్ల రూపాయలు కాగా విజయవాడ లోక్ సభ టీడీపీ అభ్యర్థి కేశినేని నానీ ఆస్తులు 80 కోట్లుగా ఉన్నాయి. విశాఖ లోక్ సభ జనసేన అభ్యర్థి గా పోటీకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆస్తులు కేవలం 8 కోట్ల 60 లక్షల రూపాయలుగా మాత్రమే ఉండటం ఈ అభ్యర్థుల ఆస్తుల చిట్టాకే కొసమెరుపుగా మిగిలిపోతుంది. ఇదంతా చూస్తుంటే భారత దేశంలో ఎన్నికలంటే ధనికవర్గాలకే పరిమితమైన రాజకీయం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories