పల్లెకు పోదాం చలో చలో!

పల్లెకు పోదాం చలో చలో!
x
Highlights

సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది వారి వారి ఊర్లకు బయల్దేరి వెళ్లారు.

సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది వారి వారి ఊర్లకు బయల్దేరి వెళ్లారు. స్వగ్రామాల్లో పండుగ జరుపుకునేందుకు తరలివెళ్తుండటంతో హైదరాబాద్ సిటీ సగానికి పైగా ఖాళీ అయ్యింది. అటు ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగను సొంతూర్లో జరుపుకునేందుకు చిన్నాపెద్ద పిల్లా జెల్లా అంతా పట్నం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఏపీ వాసులకు అత్యంత ముఖ్యమైన పండుగ కావడంతో మూడు రోజుల ముందు నుంచే సొంతూరు బాట పట్టారు.

సంక్రాంతి రద్దీతో తెలుగు రాష్ట్రాల్లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ తో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే కూకట్ పల్లి, చందానగర్, అమీర్ పేట, లక్డికాపూల్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో ఎటువైపు చూసినా ప్రయాణికులే కనిపిస్తున్నారు. ప్రయాణికులకు తగ్గట్లుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు సర్దుబాటు చేయకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రైల్వేస్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలు జనంతో నిండిపోయాయి. జనరల్ బోగీలలో కాలుమోపేంత సందు కూడా లేనంతగా అన్నీ కిక్కిరిసి పోతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేయించుకున్నారు.

ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు బస్సులతో పాటు ఆర్టీసీ సుమారు వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది.. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, కాకినాడ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, తదితర ప్రాంతాల వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. అయితే, బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్‌ బస్సులు వేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా ప్రయాణికులకు సమాచారం లేక అవస్థలు పడుతున్నారు. స్పెషల్‌ బస్సుల సమాచారం అందించడానికి ఆర్టీసీ అధికారులెవరూ అందుబాటులో లేరని ప్రయాణికులు వాపోతున్నారు. మరో వైపు సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు అందినకాడికి దోచుకుంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories