జేసీ వర్సెస్‌ బీసీ అనంతలో వర్కవట్ అయ్యేది ఏది?

జేసీ వర్సెస్‌ బీసీ అనంతలో వర్కవట్ అయ్యేది ఏది?
x
Highlights

అనంతపురం ఎంపీ ఎవరు? విలక్షణమైన ఎంపీగా ముద్ర వేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి ఐదేళ్లు మాటల తూటాలతో నిత్యం వార్తల్లో నిలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన వారసుడు...

అనంతపురం ఎంపీ ఎవరు? విలక్షణమైన ఎంపీగా ముద్ర వేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి ఐదేళ్లు మాటల తూటాలతో నిత్యం వార్తల్లో నిలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన వారసుడు జేసీ పవన్‌రెడ్డి పార్లమెంట్‌లో అడుగు పెడతారా? జేసీ ఇలాఖాలో జగన్ ప్రయోగించిన బీసీ మంత్రం పనిచేస్తుందా? ప్రభుత్వ అధికారిగా జిల్లా వాసులకు సుపరిచితుడిగా ఉన్న వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యను అనంత ఓటరు ఢిల్లీకి పంపిస్తారా? అనంతపురంలో అసలు రాజకీయం ఏమంటోంది.

సంచలన వాఖ్యలతో వార్తల్లో ఉండే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వారసుడు జేసీ పవన్‌రెడ్డి తొలిసారి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చొరువ తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పి పలు కంపెనీల్లో వందల మందిని చేర్పించారు. ఎన్నికల్లో పవన్‌రెడ్డితో పాటు జేసీ దివాకర్‌రెడ్డి కూడా అనంత ఎంపీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఏడు అసెంబ్లీ నియోకవర్గాల్లో పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు.

చేనేత జౌళి శాఖలో అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన తలారి రంగయ్య 13 ఏళ్లు సర్వీసును వదులుకొని వైసీపీలో చేరారు. అనంతపురం పార్లమెంట్ బాధ్యుడుగా ఉంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బీసీ సామాజికవర్గం అంటే బలమైన బోయవాల్మీకి వర్గానికి చెందిన రంగయ్య జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డీఆర్‌డీఏ పీడీగా, డ్వామాలో ఏపీడీగా, మున్సిపల్ కమిషనర్, సహా పలు కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్టీనేతలు, కార్యకర్తలను కలుపుకొని వెళుతూ పట్టు సాధించారు. నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓట్లతో పాటు పార్టీ బలం తనకు కలిసి వస్తుందని రంగయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం నియోజకవర్గంలో మొత్తం 13లక్షల 34 వేల 150 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6లక్షల 72 వేల 675 మంది, స్త్రీలు 6లక్షల 61 వేల 442 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గంలో 79.02 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2014లో జేసీ దివాకర్‌రెడ్డి సొంత నియోజకవర్గం తాడిపత్రితో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చింది. గతంలో అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి 51 వేల ఓట్ల పైచిలుకుతో విజయం సాధించారు. ఈసారి పోలింగ్ ఏ విధంగా జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో టీడీపీ అభివృధ్ది, సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని జేసీ పవన్ ధీమాగా ఉన్నారు. పసుపు కుంకుమ, పింఛన్ల వంటి పథకాలు తమ విజయానికి బాటలు వేశాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి ఐదేళ్లలో ఏమీ చేయలేదన్న విమర్శలతో పాటు బలమైన బీసీ సామాజిక వర్గం బోయ(వాల్మీకులు) పార్టీలకు అతీతంగా తమకు ఓటేశారంటున్నారు వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య. ఉద్యోగులు, యువత తమ వైపే ఉన్నారని భరోసాతో ఉన్నారు. అనంతపురం నగరంతో పాటు గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో రంగయ్యకు అధికంగా ఓట్లు పడ్డాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మొత్తమ్మీద అనంతలో గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది. 1984, 2004, 2014 మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 1984లో దేవినేని నారాయణస్వామి, 2004 లో కాల్వ శ్రీనివాసులు, 2014 లో జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీలు టీడీపీ నుంచి గెలిచారు. ఎక్కువసార్లు అనంతపురం పార్లమెంటు అభ్యర్థులుగా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఎంతో చైతన్యం ఉన్న అనంతపురం పార్లమెంట్ ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కట్టారన్న విషయం మే 23న తేటతెల్లం కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories