పలాస పీఠం దక్కేదెవరికి?

పలాస పీఠం దక్కేదెవరికి?
x
Highlights

శ్రీకాకుళం జిల్లా పలాస పీఠం ఎవరిని వరించబోతోంది? వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయకురాలిని ప్రజలు ఆదరించబోతున్నారా? మార్పు కోసం అనే నినాదంతో...

శ్రీకాకుళం జిల్లా పలాస పీఠం ఎవరిని వరించబోతోంది? వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయకురాలిని ప్రజలు ఆదరించబోతున్నారా? మార్పు కోసం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన ఆ నాయకుడిని అంగీకరిస్తారా? తొమ్మిది మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలిచినా ముఖ్యంగా ఆ ఇద్దరి చుట్టే రాజకీయం తిరగడానికి కారణాలేంటి.? ఎన్నికల సమరంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిన ఆ నియోజకవర్గంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?

సిక్కోలు ఆర్ధిక రాజధానిగా పేరొందిన పలాసలో ఎన్నికల పోలింగ్ సమరం ముగిసినా పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితాలపై రోజురోజుకి పెరుగుతున్న ఉత్కంఠ ఇప్పుడు రాజకీయవర్గాల్లో అగ్గిరాజేస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇద్దరూ తొలిసారి బరిలో దిగినా పోటా పోటీగా ఎన్నికల పోరులో దూసుకెళ్ళారు. పోటెత్తిన ఓటర్లు, అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ నేపధ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది నియోజకవర్గంతో పాటు జిల్లాలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

పలాస నియోజకవర్గంలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు మూడు మండలాలు ఉన్నాయి. జనాభాపరంగా మత్సకార సామాజిక వర్గం మొదటిస్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో కాళింగ, యాదవ సామాజికవర్గాలు ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత సోంపేట కాస్త పలాస నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఈసారి పెరిగిన మహిళా ఓటింగ్ సరళిని చూస్తే జిల్లాలోనే రెండో స్థానంలో నిలుస్తూ పురుషుల కంటే 11,823 మంది మహిళలు అధికంగా ఓటేశారు. దీంతో తమ ఖాతాలో పడే ఓట్లపై పార్టీలు లెక్కలు వేసుకుంటున్నారు.

ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే వారసత్వ నాయకురాలిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన గౌతు శిరీష టీడీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తాత స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న, తండ్రి గౌతు శ్యాం సుందర్ శివాజీ చరిష్మాతో పాటు రెండుసార్లు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో రాజకీయాలపై ఉన్న అవగాహన శిరీషకు ప్లస్‌గా కనిపిస్తున్న అంశాలు. ప్రత్యక్ష ఎన్నికలను తొలిసారి ఎదుర్కుంటున్న శిరీష ఇటీవల జరిగిన ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. తిత్లీ తుఫాను సమయంలో ప్రభుత్వం చూపిన చొరవ, బాదితులకు పరిహారం అందించే విషయంలో తాము చేసిన పోరాటం, ఉద్దానం పునః నిర్మాణంపై ప్రజల నుంచి లభించిన స్పందన్నది కలసి వస్తుందని టీడీపీ ఆలోచిస్తుంది. తమ కుటుంబంపై ప్రజల్లో ఉన్న ఆదరణ, తాము చేసిన అభివృద్ధి, ఆఫ్ షోర్ రిజర్వాయర్‌పై ప్రభుత్వంతో తన తండ్రి పోరాడి మరీ సాధించిన విజయం చూసి ప్రజలు మళ్ళీ తమకే పట్టం కడతారని శిరీష నమ్ముతున్నారు.

ఇక వైసీపీ విషయానికి వస్తే నియోజకవర్గంలో డాక్టర్‌గా ఫేమస్ అయిన సీదిరి అప్పలరాజుకి కూడా ఇది రాజకీయ ఆరంగేట్రమే. సామాజికవర్గాల పరంగా నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గమైన మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన ఈయనను వైసీపీ వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది.. రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన అప్పలరాజు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను అధిగమించడంతో పాటు పార్టీను బలోపేతం చేయడమే కాకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టగలిగామనే భావనలో ఉన్నారు. పాదయత్ర సమయంలో నియోజకవర్గంలోని ప్రజలపై జగన్ కురిపించిన వరాలు కలిసి వస్తాయన్నది నమ్ముతున్నారు. ముఖ్యంగా జీడి పరిశ్రమ కార్మికులకు అధికారంలోకి వస్తూనే అందిస్తామన్న సంక్షేమ పధకాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు జగన్ ఇచ్చిన భరోసా ఓట్ల రూపంలో రావచ్చని చెబుతున్నారు. పోలింగ్ నాడు నమోదైన ఓట్లలో అధిక శాతం ఓట్లన్నీ తమ ఖాతాలోకే పడ్డాయని ఇక గెలుపు తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వారసత్వం, సామాజికవర్గ బలంతో బరిలో నిలిచినా ఇరు పార్టీల అభ్యర్ధులలో గెలుపు ఎవరిని వరిస్తుందో పలాస పీఠం ఎవరికీ దక్కుతుందో అన్న చర్చ మాత్రం జిల్లాలో ఆసక్తికరంగా సాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories