Top
logo

కొత్త ఏడాదిలో కాలమనే కాగితంపై కొత్త సిరాతో సంతకం

కొత్త ఏడాదిలో కాలమనే కాగితంపై కొత్త సిరాతో సంతకం
Highlights

న్యూఇయర్‌ అంటనే అదొక సెలబ్రేషన్. ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్ మనకు బంగారు బాటలు వేస్తుందన్న హోప్. ఆ...

న్యూఇయర్‌ అంటనే అదొక సెలబ్రేషన్. ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్ మనకు బంగారు బాటలు వేస్తుందన్న హోప్. ఆ నమ్మకంతోనే, నూతన సంవత్సరానికి వెల్‌కం చెబుతాం. కానీ అందరూ ఒకేలా స్వాగతం పలుకరు. ఒక్కొక్కరూ ఒక్కోలా...ఒక్కో దేశం ఒక్కోలా. వారివారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో, మిగతా ప్రపంచానికి భిన్నంగా కొత్తేడాదికి సాదరంగా ఆహ్వానం పలుకుతారు. కొత్త ఏడాది వేడుకలు థాయిల్యాండ్‌ భలే సంబరంా జరుగుతాయి. న్యూఇయర్‌, సంక్రాన్‌ వేడుకలు ఒకేవారంలో వస్తాయి కాబట్టి, మరింత జోష్‌గా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుని, జోష్‌లో మునిగిపోతారు.

నీళ్లేందుకు చల్లుకుంటారంటే, నీటికి పవిత్ర పరిచే స్వభావముందని. పాపాలు, బాధలన్నీ నీటితో కడిగేసి, కొత్తగా శుభ్రంగా, పవిత్రంగా మారాలన్నదే, వాటర్‌ ఫెస్టివల్ కాన్సెప్ట్. వస్తువులు, విగ్రహాలు, జీవాలు, ఇళ్లు, పరిసరాలు ఇలా అన్నింటినీ నీటితో కడిగేస్తారు. ఫ్రెష్‌గా న్యూఇయర్‌కు వెల్‌కం చెబుతారు థాయ్‌ జనం.

స్పెయిన్, బ్రెజిల్ వాసులు తృణధాన్యాలను, పప్పు దినుసులను సంప్రదాయంగా భావిస్తారు. అందుకే న్యూఇయర్, మొదటి రోజున అన్ని రకాల పప్పు దినుసులను, ధాన్యాలను కలిపి వండిన సూప్‌ను సేవిస్తారు. స్పెయిన్‌, బ్రెజిల్, మెక్సికో ప్రజలు సంవత్సరం ఆఖరి రోజున అర్థరాత్రి ఆకుపచ్చ ద్రాక్ష తింటారు. అర్థరాత్రి 12 అయ్యే వరకు గంటకో ద్రాక్ష తింటే శుభం కలుగుతుంది అన్నది వారి నమ్మకం. 12 నెలలూ, శుభపద్రమవుతుందని భావిస్తారు.

ఫిన్‌ల్యాడ్ ప్రజల, కొత్త సంవత్సరం వాగ్దానాలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఏడాది చివరి రోజున సీసంలో భవిష్యత్ దర్శనం చేసుకుంటారు. సీసాన్ని కరిగించి చల్లటి నీటిలో వేస్తారు. అందులో అది ఏర్పడే ఆకారాన్ని బట్టి, భవిష్యత్‌ అంచనాలు వేసుకుంటారు. హృదయం ఆకారంలో సీసం ఏర్పడితే పెళ్లి అవుతుందట. పంది షేప్‌లో వస్తే ఆహారానికి ఢోకా ఉండదట. పడవాకరంలో వస్తే ట్రావెలింగ్ ఎక్కువట. ఇలా సీసం ఏర్పడే ఆకారాన్ని బట్టి, ఏడాదిలో తమ జీవితం ఎలా ఉంటుందో లెక్కలేసుకునే సంప్రదాయాన్ని ఫాలో అవుతారు ఫిన్నిష్‌ జనం. న్యూఇయర్ వేడుకలు అన్ని చోట్లా ఒకలా ఉండవు. ఐర్లాండ్‌లో బ్రెడ్లను గోడలకేసి కొడతారు. పెద్దశబ్దాలు దురదృష్టాలను తమ ఇంటి నుంచి వెళ్లగొడతాయట. అలాగే 12 నెలల వరకూ, బాధపడే శబ్దాలు వినబోమని కూడా వారు భావిస్తారు.

డెన్మార్క్‌లో కొందరు న్యూఇయర్ రోజున విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇంట్లోని పింగానీ వస్తువులను పగులగొట్టేస్తారు. కసితీరా నేలకేసి కొడతారు. ఆ ముక్కలన్నింటినీ పక్కింటి ముందు పారేస్తారట. ఎందుకలా అంటే సేమ్ రీజన్... ఆ పగుళ్ల చప్పుళ్లకు దుష్ట శక్తులు పారిపోతాయట. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో అయితే ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను అంతా బయటపడేస్తారు. ఇక చిలీలో కొందరు న్యూఇయర్ వేడుకలను, శ్మశాన వాటికల్లో జరుపుకుంటారు. భౌతికంగా లేకపోయినా, మేము మీతోనే సెలబ్రేట్‌ చేసుకుంటాం అన్నట్టుగా గ్రేవ్‌ యార్డుల్లోని, పితరులు, స్నేహితుల సమాధుల దగ్గర వేడుకలు జరుపుకుంటారు. రాత్రంగా అక్కడే ఉండి తమ పితరులను తలచుకుంటారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరడమే కాదు, కొత్త ఏడాది తమకు శుభాలు కలుగుతాయన్నది కూడా వారి నమ్మకం.

ఇక వెనీస్‌లో కొత్తేడాదిని ముద్దులతో ప్రారంభిస్తారు అక్కడి జనం. మిడ్‌నైట్‌ 12 కొట్టగానే, తమ ప్రియమైనవారికి కిస్‌ల‌తో విషెస్ చెప్పుకుంటారు. సిసిలీలో కొత్త సంవత్సరం రోజున న్యూడుల్స్ వంటకం అస్సలు చేయరు. ఎందుకంటే న్యూడుల్స్ దురదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నది వారి విశ్వాసం. ఇక రొమేనియా. న్యూఇయర్ రోజు ఆవులతో ముచ్చటిస్తే ఆ ఏడాదంతా విజయాలే వరిస్తాయన్నది అక్కడి ప్రజల విశ్వాసం. ఇలా ఒక్కో దేశంలో, ఒక్కోలా నూతన సంవత్సరం వేడుకలు జరుగుతాయి. వేటికవే భిన్నం. వారివారి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, విశ్వాసాలను బట్టి, సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరి ఆచారాలు వారివి. ఎవరి సంప్రదాయాలు వారివి. కొన్ని తమాషాగా ఉంటే, మరికొన్ని చిత్రంగా అనిపిస్తాయి. బాధో సంతోషమో, సుఖమో కష్టమో....లాభమో నష్టమో, గతేడాదికి టాటా. కొంగొత్త ఆశలతో కొత్తేడాదికి స్వాగతం.


లైవ్ టీవి


Share it
Top