వృద్ధతరానికి గుడ్ బై అంటున్న కమలం..

వృద్ధతరానికి గుడ్ బై అంటున్న కమలం..
x
Highlights

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపి గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. యువకులు, సమర్ధులకు సీట్లిచ్చే నెపంతో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయాలని...

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపి గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. యువకులు, సమర్ధులకు సీట్లిచ్చే నెపంతో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. వీరిలో కొందరు అనారోగ్య కారణాలతో తమంత తామే పోటీ నుంచి వైదలగుతుండగా, మరికొందరిని మోడీ, షా జోడీ ఏరికోరి పక్కన పెడుతోంది. తమకు తలనొప్పులు తెస్తారనుకున్న వారందరినీ ఓల్డేజ్ పేరుతో తప్పిస్తోందా?

2019 ఎన్నికలకోసం బీజేపి మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. పార్టీలో మోడీ, షా పెత్తనం ఎక్కువైపోతోందని ఆరెస్సెస్ పెద్దలు భావిస్తున్న వేళ ఈ జంట పార్టీపై తమ పట్టు కోల్పోకుండా పకడ్బందీ ప్రణాళిక రచిస్తోంది.చావో రేవో తేల్చుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే పార్టీలో సీనియర్లందరినీ పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. వీరిలో కొందరు అనారోగ్య కారణాలతో తమంత తామే పోటీకి దూరమై పోతుండగా మరికొందరిని పార్టీయే పక్కన పెడుతోంది. దాదాపు 250 మందిని ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పించాలని బిజెపీ కోర్ టీమ్ భావిస్తోంది. అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీలాంటి సీనియర్లకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చేస్తోంది.

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు బీ. ఎస్. కోషియారీ, బీ. సీ. ఖండూరీ జూనియర్లకు అవకాశం ఇవ్వాలంటూ వారంతట వారే తప్పుకున్నారు. 2014లో ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి కల్ రాజ్ మిశ్రా, లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కైరా ముండా కూడా తప్పుకోడానికి రెడీగా ఉన్నారు. సీనియర్లందరూ ఇలా తప్పుకోవడంతో అద్వానీ, జోషీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ లాంటి వారూ తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.75 ఏళ్లు పై బడిన వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వరాదన్న సంఘ్ పరివార్ నిర్ణయం మేరకు అద్వానీకి మార్గదర్శక మండల్ లో స్థానం కల్పించారు. అయితే వయసు మీద పడినా ఇంకా ఉత్సాహంగా, క్రియాశీలకంగా ఉన్న అద్వానీకి ఈ నిర్ణయం రుచించినట్లు లేదు.. పైకీ ఏం మాట్లాడకపోయినా పార్టీ నిర్ణయంపై ఆయన కొంత అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం.

మరోవైపు మరికొందరు సీనియర్లు అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నారు. వారిలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇద్దరికీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగడంతో ఇక రిస్క్ తీసుకోరాదని భావిస్తున్నారు. సుష‌్మ ఈ సారి పోటీకి నో అని బాహాటంగా చెప్పేశారు కూడా. ఇక అరుణ్ జైట్లీకి కిడ్నీ సమస్యకు తోడు పాంక్రియాటిక్ కేన్సర్ కు చికిత్స జరుగుతోంది. ఆయన పోటీకి నో అని చెప్పనప్పటికీ పోటీ చేయలేరని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.

వీరిద్దరే కాదు మోడీ మంత్రివర్గంలో మరికొందరు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారుకూ డా పోటీ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా దేశ భక్తి నినాదంపై ఎన్నికలకు వెడుతున్న బీజేపీ రామ మందిర నినాదాన్ని కూడా వాడనున్నట్లు సమాచారం. అంతా బానే ఉంది కానీ రామ మందిర ఉద్యమ మూల కర్త అద్వానీనీ పక్కన పెట్టి ప్రచారం చేయడమే బాగోలేదంటున్నాయి బీజేపీలో కొన్ని వర్గాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories