ఫిరాయింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న పక్షాలు విపక్షాలను నామరూపాలు లేకుండా చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించడం...
ఫిరాయింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న పక్షాలు విపక్షాలను నామరూపాలు లేకుండా చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించడం మాత్రం ఓ నాలుగైదేళ్ళుగా ఊపందుకుంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అది తారస్థాయికి చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన విపక్ష నాయకులను పార్టీలోకి చేర్చుకొని వారికి టికెట్లు ఇచ్చి తన వ్యూహంలో విజయం సాధించింది. ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని వైసీపీ ఏపీలో అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా టీడీపీ నాయకులు పలువురు వైసీపీలో చేరుతున్నారు. మరి ఈ వ్యూహం ఏపీలో ఎంత వరకు సత్ఫలితాలను అందిస్తుందో వేచి చూడాల్సిందే.
నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఒక్కసారిగా తమ విధేయతను మార్చుకోవడం సంచలనం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రావడంపై అనుమానాలు, పార్టీలో తమ ప్రాధాన్యం తగ్గిస్తున్నారన్న సందేహాలు, తమకు పోటీగా వేరే వారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆందోళన, తమ కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తపన, ప్రజల పనులు పూర్తి చేయడంలో పార్టీ నుంచి సహకారం తగ్గడం లాంటి అనేక అంశాలు పార్టీ మారేందుకు కారణాలుగా ఉంటున్నాయి. పార్టీ మారిన నాయకులు చేస్తున్న విమర్శలు కూడా ఇలాంటి అంశాలనే వెల్లడిస్తున్నాయి. అవినీతి, బంధుప్రీతి, కులంపై మమకారం లాంటివి వీటిలో ఉన్నాయి. ఆ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.....వైసీపీ అనుసరిస్తున్న వ్యూహమే ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా మరింత పటిష్ఠం కావచ్చని వైసీపీ భావిస్తోంది. పెద్ద నాయకులు పార్టీలో చేరితే....వారితో పాటుగా భారీగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా వస్తారని ఆశిస్తోంది. అందుకే టీడీపీ నుంచి బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రత్యేకించి విజయసాయి రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఇటీవలి కాలంలో వైసీపీ లోకి వలసలు జోరందుకున్నాయి. అదే సమయంలో ఆ నాయకులకు ఇచ్చే హామీలపై కూడా వైసీపీ స్పష్టమైన వైఖరిని అనుసరిస్తోంది. పార్టీలో చేరబోయే నాయకుల డిమాండ్లను పరిశీలించి, తాము ఇవ్వబోయే ఆఫర్లపై స్పష్టతనిస్తోంది. మిగితా వాటిని అవకాశాన్ని బట్టి పరిశీలించేందుకు హామీ ఇస్తోంది.
చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పొత్తుల రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీఆర్ఎస్ తో పొత్తుకు వెనుకంజ వేయలేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నారు. తాజా గా జరుగబోయే ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం ప్రత్యక్ష పొత్తులకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశానికి అండగా ఉండిన వామపక్షాలు ఇప్పుడు పవన్ కల్యాణ్ తో చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో గెలిచింది. తెలుగుదేశం 102 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అధికారపక్షం, విపక్షం మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా కొనసాగింది. అప్పట్లో రుణమాఫీ పై చంద్రబాబు ఇచ్చిన హామీ టీడీపీ విజయానికి బాట వేసింది. తెలుగుదేశం, వైసీపీ మధ్య మొత్తం ఓట్ల తేడా 0.2 శాతమే. అప్పట్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మరో వైపున వపన్ కల్యాణ్ చంద్రబాబుకు అండగా నిలిచారు. ఒక ఏడాది క్రితం బీజేపీ, తెలుగుదేశం మధ్య అనుబంధం పటాపంచలైంది. తెలంగాణలో కాంగ్రెస్ తో కుదుర్చుకున్న పొత్తును తెలుగుదేశం ఏపీలో రిపీట్ చేసే అవకాశం కన్పించడం లేదు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కుదుర్చుకున్న అవగాహనను కూడా ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే వీలు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజీపీ పట్ల ఏపీ ప్రజానీకంలో అత్యధికుల్లో చోటు చేసుకున్న ఆగ్రహావేశాలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నదే ప్రశ్నగా మారింది. 2004 ఎన్నికల తర్వాత.....ఏ పార్టీతోనూ ముందస్తు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళడం చంద్రబాబు కు ఇదే మొదటిసారి.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేందుకు అప్పట్లో వెనుకంజ వేసిన జగన్, ఈ ఎన్నికల్లో మాత్రం హామీలతో దూసుకుపోతున్నారు. ఆయన ఇచ్చే హామీలు తెలుగుదేశాన్ని బెంబేలెత్తించాయి. ఆ పార్టీ కూడా అదే స్థాయిలో హామీలివ్వడంతో పాటుగా అప్పుడే వాటిని అమలు చేయడం కూడా ప్రారంభించింది. మొత్తం మీద జగన్ తెలుగుదేశం మీద తీసుకువస్తున్న ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీని మునిగిపోతున్న ఓడగా భావిస్తున్న కొందరు నాయకులు ఎన్నికల్లో విజయతీరం చేరుకునేందుకు వైసీపీలోకి మారుతున్నారు. దానికి తోడు నాలుగైదు ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న పార్టీపై అంతో ఇంతో వ్యతిరేకత ఉండడం సహజమే. పోటీ బలంగా ఉన్నప్పుడు.......ఆ వ్యతిరేకతను ఎంతగా విపక్షంగా క్యాష్ చేసుకుంటుందనే అంశంపైనే విపక్షం విజయం ఆధారపడి ఉంటుంది. గత నాలుగైదేళ్ళలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలిచ్చారు. వాటిని నెరవేర్చేందుకు కృషి చేసినా....పలు హామీలు మాత్రం ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరో వైపున జగన్ చేసిన పాదయాత్రలు, నిర్వహించిన శంఖారావ సభలు వైసీపీకి కొత్తఊపును అందించాయి. ఇటు తెలుగుదేశం....అటు వైసీపీ ఈ ఎన్నికల్లో జాతీయస్థాయి అవగాహనలను మాత్రమే కలిగి ఉండడం ఓ విశేషంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జాతీయస్థాయిలో అవగాహన కలిగి ఉంది. మరో వైపున వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయ స్థాయిలో అవగాహనకు మొగ్గు చూపుతోంది. పొత్తులకు మాత్రం అవి దూరంగానే ఉంటున్నాయి.
రాజకీయం అంటేనే ఓ నిరంతర ప్రవాహం. అది ఎప్పుడు తన దిశను మార్చుకుంటుందో తెలియదు. మారే దిశ మాత్రం ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా ఉండాలని కోరుకోవడం మాత్రమే మనం చేయగలం. రాజకీయ పార్టీలు, నాయకులు, ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఓ చిన్న భాగం మాత్రమే. అవే సర్వస్వం కాకూడదు. ఎన్నికల్లో విజయం సాధించడం ఓ చిన్న లక్ష్యంగా ఉండాలి తప్పితే....అదే అంతిమ ధ్యేయం కాకూడదు. దురదృష్టవశాత్తూ....రాష్ట్రస్థాయిలో....జాతీయస్థాయిలో అదే జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు తమ సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. అందులో భాగంగానే నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. పార్టీల పట్ల విధేయతను మార్చుకునే సందర్భంలో నైతిక విలువలను పాటిస్తే....అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం మీద ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం మరెన్నో మలుపులు తిరుగుతోంది. ఏ పార్టీ విజయం సాధించినా....ప్రజలకు సాధికారికత అందించడమే పరమార్థం కావాలి. అదే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire