అలోక్ వర్మపై మోడీ కసి ఏంటి?

అలోక్ వర్మపై మోడీ కసి ఏంటి?
x
Highlights

ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్‌ అస్థానపై సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కేసు దాఖలు చేసి...

ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్‌ అస్థానపై సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కేసు దాఖలు చేసి సీబీఐలోని ఆయన కార్యాలయంపై స్వయంగా దాడులకు ఆదేశించడం సంచలనం సృష్టించింది. అదేరోజు రాత్రి కేంద్రం ఆదేశాల మేరకు కేంద్ర విజిలెన్స్‌ అధికారులు సీబీఐ కార్యాలయంలోని ఆలోక్‌ వర్మ కార్యాలయంపై దాడులు జరిపారు. పరస్పర ఆరోపలు చేసుకుంటున్న అస్థాన, వర్మలను అదే రోజు బలవంతపు సెలవులపై పంపించింది కేంద్రం. ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండా తనను ఎలా తొలగిస్తారంటూ అలోక్‌ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు.

అలోక్‌ వర్మ ఆరోపణలతో షాక్‌ అయిన అస్థానా, రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టారు. సీబీఐ డైరెక్టర్‌పైనా అనేక ఆరోపణలు చేశారు. మొయిన్‌ ఖురేషీ కేసులో రెండు కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపించారు. అయితే అంతకుముందేమీ అస్థానా, వర్మపై ఇలాంటి ఆరోపణలు చేయలేదు. అంటే ఎప్పుడైతే రాకేష్ ఆస్థానాపై విచారణ మొదలైందో, ఆ విచారణను న్యూట్రలైజ్ చేయడానికి, అంటే నీవు దొంగ అంటే నీవు దొంగా అనే వాదన పెట్టడానికి, అలోక్‌ వర్మపై ఆరోపణలు మొదలుపెట్టారు ఆస్థానా. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో కంప్లైంట్ చేశారు. దాని మీద స్పందించిన సీవీసీ...IRCTC కేసునూ కోడ్‌ చేస్తూ, వర్మను తొలగించాలని సిఫారసు చేసింది. అంటే నిందితుడు ఆస్థానా ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలివి. అయినా వర్మ వాదనేమీ వినకుండానే, సీవీసీ రిపోర్ట్ కారణంగా, పదవి నుంచి తొలగించడం, సరైంది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఆస్థానా ఆరోపించినట్టు అలోక్ వర్మ నిజంగా అవినీతి పరుడైతే, సుప్రీం కోర్టు ఎందుకు చెబుతుంది మళ్లీ నియమించమని....అవినీతి ఆరోపణలున్నాయి, సీవీసీ నివేదిక చెబుతోంది కదా అని సుప్రీం చెప్పాలి. ఒకవేళ వర్మ తీవ్రమైన అవినీతి పనులే చేశాడనుకుందాం...మరి ఆ‍యనను ఫైర్‌ సేఫ్టీ విభాగానికి ఎందుకు బదిలీ చేశారు...అవినీతిపరుడు ఎక్కడా బాధ్యతల్లో ఉండకూడదు కదా...వంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్థానాపైనే కాదు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈమధ్య వ్యవహరిస్తున్న తీరుపైనా అనేక ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అలోక్‌ వర్మపై, పనిగట్టుకుని మోడీ వేటు వేశారని సామాన్యులకైనా ఇట్టే అర్థమవుతుంది. మరి ఇంతగా అలోక్ వర్మపై మోడీ కసి ఏంటి? మోడీ ఎందుకింత హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు?

వీటిపై కాంగ్రెస్ సహా విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రతిపక్షాలు, ఇప్పటికే మోడీ మీద అనేక ప్రశ్నలు సంధించాయి. అంతేకాదు, సొంత పార్టీ సీనియర్లయినా, యశ్వంత్‌ సిన్హా, అరుణ్ శౌరి, అలాగే న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు, రాఫెల్‌ కొనుగోలుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్‌‌ను సేకరించి, సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మకు అందజేశారు. అనిల్ అంబాని కంపెనీకి ఆఫ్‌సెట్‌ ఒప్పందం ఎలా దక్కిందన్నదానిపై వివరించారు. అదే మోడీలో ఆందోళనకు కారణమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాఫెల్‌పై విచారణకు ఆదేశిస్తాడని...ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని, ఒకవేళ విచారణ చేస్తే, ఎన్నికల టైంలో తమ పార్టీకి ఇబ్బంది అవుతుందన్న అనుమానాలు మోడీని వెంటాడాయని వాదిస్తున్నారు. అందుకే ఆఘమేఘాల మీద అలోక్‌ వర్మను తొలగించారని చెబుతున్నారు.

రాఫెల్‌పై మోడీ భయపడుతున్నాడో లేదో కానీ, అలోక్‌ వర్మపై ఆయన దూకుడు మాత్రం అనేక అనమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఎందుకంటే సీబీఐ డైరెక్టర్‌‌గా అలోక్‌ వర్మ పదవీకాలం జనవరి 31తో ముగుస్తుంది. అంతేకాదు, వారంరోజులదాకా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని వర్మకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. మహా అయితే వర్మ క్రియాశీలకంగా ఉంటే, రెండువారాలే. తర్వాత ఎలాగూ పదవీకాలం ముగుస్తుంది. కానీ మోడీ అంతవరకూ కూడా ఆగలేదు. సుప్రీం కోర్టు తిరిగి నియమించిన 24 గంటల్లోపే వేటేశారు. అదే అనేక సందేహాలకు కారణమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories