కనిపించని శక్తులు.. కనిపించే వింతలు.. తిరుమలలో ఏం జరుగుతోంది?

కనిపించని శక్తులు.. కనిపించే వింతలు.. తిరుమలలో ఏం జరుగుతోంది?
x
Highlights

తిరుమల శ్రీవారి నగలకు భద్రత లేకుండా పోతోందా? స్వామి వారి ఆస్తులు పోయాయంటూ ప్రధానార్చకుడు లేవనెత్తిన సందేహం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆలయపోటులో...

తిరుమల శ్రీవారి నగలకు భద్రత లేకుండా పోతోందా? స్వామి వారి ఆస్తులు పోయాయంటూ ప్రధానార్చకుడు లేవనెత్తిన సందేహం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆలయపోటులో నేలమాళిగలు తవ్వారని ఒకరారోపిస్తే, ఆ గుప్త నిధులను కాజేశారంటోంది మరో పార్టీ.. దీక్షితులుపై రిటైర్మెంట్ వేటు కొత్త యుద్ధానికి దారి తీసిందా?తిరుమల వివాదాలు ఇప్పుడు టిడిపి వర్సెస్ బిజెపిగా మారిపోయాయా?

తిరుమల వెంకన్న సాక్షిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. శ్రీవారి ఆస్తులు గుట్టు చప్పుడు కాకుండా మాయమైపోతున్నాయన్న ఆరోపణలు ఆయన భక్తులను కలవరానికి గురి చేస్తున్నాయి. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు కొద్ది రోజుల క్రితం చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ రూపం తీసుకున్నాయి. శ్రీవారికి ఉన్న లెక్కలేనన్ని ఆస్తులు విదేశాలకు తరలి పోయాయని ఆయన ఆరోపించారు.. శ్రీవారి నగల్లో గులాబీరంగు కెంపు మాయమైందని అది జెనీవాలో వేలం పాటలో కనిపించిందని ఆరోపించారు.. రాయల కాలంలో ఎన్నో నాణేలు, నగలు, బంగారం స్వామి వారికి కానుకలుగా సమర్పించారని, ఇప్పుడు ఆ ఆనవాళ్లే లేవని.. ఆనగలన్నీ ఏమయ్యాయో లెక్క చెప్పాలని ఆయన టిటిడి అధికారులను డిమాండ్ చేశారు..అంతేకాదు ఆలయం పోటులో తవ్వకాలు జరిగాయని గుప్త నిధుల కోసం సాగిన వేటే అందుకు కారణమని ఆయన ఆరోపించారు.అయితే దీక్షితులు మాటలను టిటిడి బోర్డు ఖండించింది. స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయని, జగన్నాథన్ కమిటీ స్వామి వారి నగలను పరిశీలించి వాటి జాబితా రూపొందించిందని తెలిపింది.అయితే 1952 నుంచి స్వామి వారి నగలకు లెక్కలున్నాయని, అంతకుముందు నగల సంగతి మాత్రం తమకు తెలియదని ఆ కమిటీ చెప్పింది.

2011 జనవరి 20న రిటైర్డ్ జడ్జీలతో వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయని సీఎంకు వివ‌ర‌ణ ఇచ్చారు . అయితే గులాబీ వజ్రం రికార్డుల్లో లేదని.. రికార్డుల్లో రూబీనే ఉందని.. అది కూడా డామేజ్ అయిందని ఈవో సీఎంకు వివరించారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలను ప్రదర్శించడానికి సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు.అయితే రాయల వారి నగలు ఎలా మాయం అయ్యాయన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది .టిటిడి ఈవోగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు కూడా నగలు మాయమయ్యాయనే అంటున్నారు.. ఇక ఆలయంలో పోటు పరిసర ప్రాంతాలను తవ్వేసారని గుప్త నిధుల కోసం సాగిన వేటే అందుకు కారణమని దీక్షితులు మరో బాంబు పేల్చారు.దీక్షితులు ఇలా ఆరోపించడం రాజకీయ రంగు పులుముకుంది. తిరుమలపై బిజెపి రాజకీయం చేస్తోందని టిడిపి మండిపడుతోంది. తిరుమల ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితుల ఆరోపణల వెనుక బిజెపి హస్తముందని టిడిపి ఆరోపిస్తోంది. దీక్షితులును ఢిల్లీ రప్పించుకుని అమిత్ షా, మోడీ మాట్లాడి ఆతర్వాతే ఈ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు రమణ దీక్షితులుతో పదవీ విరమణ చేయించే అధికారం టిటిడికి లేదంటున్న బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు.. దీక్షితులు రిటైర్మెంట్ పై స్టే ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.టిటిడిపై సమీక్ష జరిపే అధికారం చంద్రబాబుకు లేదని స్వామి అంటున్నారు.

తనను శ్రీవారి సేవకు దూరం చేయడం తగదంటూ దీక్షితులు ఇప్పటికే స్వరం పెంచారు.. మరోవైపు దీక్షితులుపై వేటేయడం హిందూ ధర్మంపైనే దాడి చేయడమంటూ రాష్ట్రంలోని బ్రాహ్మణ ఐక్య వేదిక తిరగబడింది. విజయవాడలో ఈ వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణులు శాంతి యాత్ర చేపట్టారు. బెంజి సర్కిల్ లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకూ పాదయాత్ర చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గంపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు.అర్చక వృత్తిని దెబ్బ తీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వైసిపి కూడా ప్రభుత్వంపై స్వరం పెంచింది. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని.. అది కాదని నిరూపిస్తే రాజీనామాకు సైతం సిద్ధమని వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి సవాల్ విసిరారు.

మొత్తం మీద కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు, నమ్మకంపై కలుగుతున్న ఈ దాడులపై కలవరం పెరుగుతోంది. స్వామి వారి నగలకే భద్రత లేకపోతే.. ఇక ధర్మం ఎలా ఉంటుందని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories