పవన్‌ గురి ఉద్దానంపైనే ఎందుకు?

పవన్‌ గురి ఉద్దానంపైనే ఎందుకు?
x
Highlights

దశాబ్దాలు గడుస్తున్నా.. పరిస్థితిలో మార్పులేదు. కిడ్నీ వ్యాధికి నియంత్రణ లేదు. సమస్య పరిష్కారానికి చొరవ లేదు. మంచినీటి సరఫరా లేదు. మనుషుల ప్రాణాలు...

దశాబ్దాలు గడుస్తున్నా.. పరిస్థితిలో మార్పులేదు. కిడ్నీ వ్యాధికి నియంత్రణ లేదు. సమస్య పరిష్కారానికి చొరవ లేదు. మంచినీటి సరఫరా లేదు. మనుషుల ప్రాణాలు పోతున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ మధ్య కాస్త హడావిడి చేశారు. తర్వాత మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడు ఉద్దానం తెరపైకి వచ్చింది. కానీ ఈసారి స్పందన లేదు. ఉద్దానం సమస్యకు పరిష్కారమే లేదా.? అసలు అక్కడి పరిస్థితులేంటి.?

నల్గొండ పేరు చెబితే గుర్తొచ్చేది ఫ్లోరైడ్ సమస్య. అదే ఉద్దానం పేరు చెప్తే గుర్తొచ్చేది కిడ్నీ సమస్య. దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా వాసులను కబలిస్తూ వస్తోంది కిడ్నీ సమస్య. పేదోళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. ఉద్దానం వాసుల ఉసురు తీస్తోంది ఈ మహమ్మారి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు.. కిడ్నీ వ్యాధి ఊపిరాడనీయడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలు సతమతమవుతున్నాయి. వీటిలో ఉద్దానంలోనే ఈ సమస్య విజృంభిస్తోంది.

ఉద్దానంలోని ప్రతి ఇంట్లో.. ఒక్కరైనా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్లుంటారు. ఒక్కరైనా మంచానికే పరిమితమై ఉంటారు. ఒక్కో ఇంట్లో.. కిడ్నీ వ్యాధి బారిన పడిన వాళ్ల సంఖ్య ఎక్కువే ఉంటుంది. అయినా ప్రభుత్వాలు ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. మీరు ఈ ప్రాంతంలో పుట్టడమే మీరు చేసుకున్న పాపమన్న చందంగా.. వారి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు కూడా మానేసింది ప్రభుత్వం.

ఉద్దానంలో కనీసం తాగడానికి మంచినీరైనా దొరకదు. దొరికినా.. అది కూడా తక్కువ మొత్తంలోనే దొరుకుతుంది. ఒక్కో ఇంటికి చిన్న ఆర్వో ప్లాంటు వాటర్ క్యాన్ ఇస్తారు. అది కూడా సగం రోజులోనే అయిపోతుంది. నాయకులను వేడుకున్నారు. అధికారులకు మొర పెట్టుకున్నారు. వస్తాం.. చేస్తాం.. అన్న మాటలే వినిపించాయి తప్ప.. ఉద్దానంలో వాళ్లు చేసిందేమీ లేదు. డాక్టర్లు వస్తారు.. వస్తారు.. అని ఎదురుచూడడం ఇక్కడి కిడ్నీ బాధితులకు అలవాటైంది. వాళ్లు రారని తెలుసు. తమకు చికిత్స చేయరని కూడా తెలుసు. అయినా.. ఏదో ఒకరోజు రాకపోతారా అని.. చిన్ని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్యతో ఉద్దానం బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories