టీఆర్ఎస్‌ను వెంటాడుతున్న ఆ ముగ్గురెవరు?

టీఆర్ఎస్‌ను వెంటాడుతున్న ఆ ముగ్గురెవరు?
x
Highlights

అధికార పార్టీకి ఆ ముగ్గురి నేతల భయం పట్టుకుంది. మొన్నటి వరకు కారు పార్టీలో షికారు చేసిన ఆ నేతలు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యే...

అధికార పార్టీకి ఆ ముగ్గురి నేతల భయం పట్టుకుంది. మొన్నటి వరకు కారు పార్టీలో షికారు చేసిన ఆ నేతలు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యే సీటుపై కన్నేసి.. సిట్టింగ్ అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు నేతలెవరు? అధికార పార్టీ భయమేంటి? వాళ్ల ప్రభావం ఎంత? నిజామాబాద్ జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఆ నేతలెవరు? నిజామాబాద్ జిల్లాలో సిట్టింగ్ అభ్యర్ధులందరికి టీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్లు ఖరారు చేసింది. ప్రచార సామగ్రిని పంపిణీ చేసింది. సిట్టింగ్‌లకు టికెట్ల ఖరారుతో.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి ముగ్గురు అభ్యర్ధులు పార్టీని వీడారు. ఒకరు కాంగ్రెస్ గూటికి చేరగా..మరొకరు కాషాయజెండా కప్పుకున్నారు. ఇంకొకరు స్వతంత్ర్య అభ్యర్ధిగా ఉన్నా.. రేపో మాపో ఓ జాతీయ పార్టీలో చేరనున్నారు.

నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, నియోజవర్గాల్లో ఆ ముగ్గురు నేతలు పోటీకి సై అంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు పార్టీ టికెట్టు ఖరారు చేసింది. పార్టీ బహిష్కృత నేతగా ఉన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా భూపతిరెడ్డి పోటీకి సై అంటున్నారు. బాజిరెడ్డి ఓటమే తన లక్ష్యమంటూ ప్రచారం ప్రారంభించారు. మరోవైపు భూపతిరెడ్డిని కట్టడి చేసేందుకు బాజిరెడ్డి వ్యూహాత్మకంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు.

ఆర్మూర్ నియోజకవర్గం. టీఆర్ఎస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత వినయ్‌రెడ్డి ఇటీవలే ఈ పార్టీని వీడి బీజేపీలో చేరారు. జీవన్‌రెడ్డిపై పోటీకి వినయ్‌రెడ్డి ఆసక్తిగా చూపుతున్నారు. ఒకప్పుడు జీవన్ విజయం కోసం పనిచేసిన వినయ్ పార్టీని వీడి ప్రత్యర్ధిగా బరిలో నిలవడం అధికార పార్టీ అభ్యర్ధికి మింగుడు పడటం లేదు. వినయ్ బరిలో ఉంటే టీఆర్ఎస్ ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు బెంగ పడుతున్నారు. వినయ్ కార్యకలాపాలపై అధికార పార్టీ నేతలు ఓ కన్నేసి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతున్నారు. బాల్కొండ నియోజకవర్గం. అధికార పార్టీ అభ్యర్ధికి ప్రత్యర్ధి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి రూపంలో గండం పొంచి ఉంది. జాగృతి రాష్ట్ర నేతగా గుర్తింపు పొందిన సునీల్... టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డిపై పోటీకి సై అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీల్ ఇంకా ఏ పార్టీలో చేరలేదు. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి అధికార పార్టీ అభ్యర్ధికి కంటిలో నలుసులా తయారయ్యారు.

ఆ మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు నేతలు.. అధికార పార్టీ అభ్యర్ధికి ప్రత్యర్ధులుగా బరిలో దిగేందుకు సై అంటున్నారు. అదే జరిగితే ఆ ముగ్గురు చీల్చే ఓట్లపై టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఆ ముగ్గురు నేతలు అధికార పార్టీ అభ్యర్ధులకు ఏ మేరకు పోటీనిస్తారన్నది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories