Top
logo

గులాబీ సిగలో మహిళల మకుటం ఈసారైనా ఉంటుందా?

గులాబీ సిగలో మహిళల మకుటం ఈసారైనా ఉంటుందా?
X
Highlights

ముంద‌స్తు ఎన్నిక‌ల గోదాలో దిగిన టీఆర్ఎస్ అధినేత, 105 మంది అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. ఒక‌రిద్దరు సిట్టింగ్‌ల‌ను ...

ముంద‌స్తు ఎన్నిక‌ల గోదాలో దిగిన టీఆర్ఎస్ అధినేత, 105 మంది అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. ఒక‌రిద్దరు సిట్టింగ్‌ల‌ను ప‌క్కన‌పెట్టినకేసీఆర్....న‌లుగురు మ‌హిళ‌ల‌కు మాత్రమే అవ‌కాశం క‌ల్పించారు. మిగిలిన ప‌ద్నాలుగు స్థానాల్లో ఇంకా అభ్యర్థుల‌ను ప్రక‌టించ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి, మ‌రో ఇద్దరు మ‌హిళ‌ల‌కైనా చాన్స్ ఇస్తారా... ఇప్పటికే ఆ దిశ‌గా పోటీకి ఉవ్విళూరుతున్న మ‌హిళా నేత‌ల‌కు అవ‌కాశం ద‌క్కుతుందా...సీట్లు సాధించి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆ మహిళా నేతల కల ఫలించేనా?

ముందస్తు ఎన్నికల కోసం అనూహ్యంగా అసెంబ్లీని ర‌ద్దుచేసి, ఎన్నిక‌ల బాట ప‌ట్టిన కేసీఆర్.. అంతే వేగంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్యర్ధుల‌ను ప్రక‌టించారు. వెనువెంట‌నే హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద స‌భ నిర్వహించి, పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు. ఇదిలావుంటే, పార్టీలో ఒక‌రిద్దరికి మిన‌హా సిట్టింగ్‌ల‌కే మొజారిటి సీట్లు కేటాయించారు. మ‌రో ప‌ద్నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలకు ఇంకా అభ్యర్ధులు ప్రక‌టించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప‌ద్నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి సీట్లు ద‌క్కుతాయ‌న్నది ఆస‌క్తిగా మారింది. సీట్లు కేటాయించాల్సి ఉన్న ఈ ప‌ద్నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో, ఆశావ‌హుల సంఖ్య తక్కువేమీ లేదు. అయితే ఈ ప‌ద్నాలుగులో, నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే మ‌హిళా నేత‌లు త‌మ‌కు టిక్కెట్ కేటాయించాల‌ని పార్టీ అధిష్ణానాన్ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇప్పటికే కెేసీఆర్ ప్రక‌టించిన జాబితాలో ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రేఖానాయ‌క్, ఆసిఫాబాద్ నుంచి కోవాల‌క్ష్మి, మెద‌క్ నుంచి ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునితా రెడ్లకే టిక్కెట్లు ఇచ్చారు. అయితే సామాజిక‌వ‌ర్గాల వారీగా చూస్తే ఇద్దరు ఎస్టీలు, మ‌రో ఇద్దరు రెడ్డి సామాజిక వ‌ర్గాలకు టికెట్లు కేటాయించారు.

ఇదిలావుంటే చొప్పదండి తాజామాజీ ఎమ్మెల్యే దలిత నాయకురాలు బొడిగే శోభ సీటును పెండింగ్‌లో పెట్టారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక‌త రావ‌టంతో, ఆమెకు ఈసారి మొండి చేయేనన్న ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వ‌రంగ‌ల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన కొండాసురేఖ పార్టీ మారారు. దీంతో పద్నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం మ‌హిళ‌ల‌కు రెండుసీట్లన్నా ద‌క్కుతాయ‌న్న భావ‌న‌లో ఆశావ‌హులున్నారు. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డంతో అక్కడ అభ్యర్ధిని ఇంకా ప్రక‌టించ‌లేదు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావ‌హులు ఎక్కువే ఉన్నారు. వరంగల్ మేయ‌ర్ న‌న్నప‌నేని న‌రేంద‌ర్, మాజీ ఎంపీ, టిఆర్ఎస్ మ‌హిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, మాజీ మంత్రి బ‌స్వరాజు సార‌య్య‌, ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిక్కెట్ కోసం పోటీప‌డుతున్నారు. ఇక ఇప్పటికే ఆ సీటు త‌న‌కే వ‌స్తుందంటూ న‌న్నప‌నేని న‌రేంద‌ర్ త‌న అనుచ‌రుల‌తో చెప్పుకుంటున్నారు. అయితే ఆ సీటును గ‌తంలో మ‌హిళకే ఇచ్చారు కాబ‌ట్టి....ఈసారి త‌న‌కే కేటాయించాలంటూ గుండు సుధారాణి అధిష్టానాన్ని కోరుతున్నారు. టిఆర్ఎస్ మ‌హిళా అధ్యక్షురాలుగా ఉన్న తాను, పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె కోరుతున్నారు. అంతేకాదు ఇప్పటివ‌ర‌కు రెండు సామాజిక వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు టికెట్ కేటాయించినందును బిసి మ‌హిళ‌గా త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నట్లు స‌మాచారం.

ఖైర‌తాబాద్ నియోజకవర్గంలోనూ పిజెఆర్ కుమార్తె, కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డి సైతం టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజ‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేంద‌ర్, మ‌న్నె గోవ‌ర్ధన్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే మ‌హిళ‌గా తన‌కే అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. హుజూర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి శంక‌ర‌మ్మ కూడా త‌న‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. తనకు కాకుంటే తన మనుషులకు ఇవ్వాలని కోరుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిన శంకరమ్మ....పార్టీ ప‌టిష్టత కోసం తాను నాలుగేళ్లుగా పోరాడుతున్నాన‌ని ఆమె త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొస్తున్నార‌ట‌.

వేములవాడ నియోజ‌క‌ర్గం టిక్కెట్‌ను క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ చైర్మన్ తుల ఉమ ఆశించారు. కాని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమ‌నేని ర‌మేష్‌కే కేటాయించ‌డంతో తుల ఉమ వ‌ర్గీయులు ఆందోళ‌న చేస్తున్నారు. నామినేష‌న్ల వ‌ర‌కైనా టిక్కెట్ వ‌స్తుంద‌ని ఆమె అనుచ‌రులు భావిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్లుగా కేసీఆర్ క్యాబినెట్‌లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం లేద‌ని, విపక్షాలు విమర్శలు చేస్తున్న నేప‌థ్యంలో, క‌నీసం ఎమ్మెల్యే స్థానాల్లోనైనా ఎక్కువ మందికి అవ‌కాశం క‌ల్పించాల‌ని మ‌హిళా నేత‌లు కోరుతున్నారు. చూడాలి మరి, కేసీఆర్ ఏమేర‌కు సీట్లు స‌ర్దుబాటు చేస్తారో.

Next Story