Top
logo

తిట్లతో ఓట్లు రాలుతాయా! ఎందుకీ పరస్పర తిట్ల దండకం?

తిట్లతో ఓట్లు రాలుతాయా! ఎందుకీ పరస్పర తిట్ల దండకం?
X
Highlights

తెలంగాణలో ఎన్నికల ప్రచారపర్వం జోరందుకుంది. ఒకరు బంగారు తెలంగాణ అందిస్తామంటే...మరొకరు తెలంగాణను...

తెలంగాణలో ఎన్నికల ప్రచారపర్వం జోరందుకుంది. ఒకరు బంగారు తెలంగాణ అందిస్తామంటే...మరొకరు తెలంగాణను పరిరక్షిస్తామంటున్నారు. ఎవరు ఎలా అన్నా వారెవరితోనూ ప్రజలకు పేచీ లేదు.అయితే ప్రజలకు తమ వాదనలను వినిపించుకునేందుకు నాయకులు ఎంచుకుంటున్న పదాల విషయంలోనే ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో అలాంటి పదాలు ఉద్యమానికి ఊపునిచ్చాయి. ఇప్పటికీ ఆ తరహా పదాలను ఉపయోగించడంపై ఇప్పడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీమాంధ్రులపై రకరకాలుగా విమర్శలు చేశారు. వాటిల్లో దూషణలూ ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యమం వేడిలో వాటినెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. స్వరాష్ట్రం వచ్చిన తరువాత సీమాంధ్రులపై ఆగ్రహం చాలా వరకు తగ్గిపోయింది. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. మరో వైపున ఇక్కడ పోటీపడుతున్న వారిలో అత్యధికులు తెలంగాణ బిడ్డలే. బరిలో ఉన్న వాటిలో అధిక శాతం తెలంగాణకు చెందినవే...లేదా జాతీయ స్థాయిలో ఉన్నవే. ఈ ఎన్నికలపై సీమాంధ్ర ప్రభావం తక్కువే. కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమిలో తెలుగుదేశం భాగస్వామి కావడంపై టీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నించగలదన్న అనుమానం ఆ పార్టీలో ఉంది. అదే విషయాన్ని నాయకులు దూషణలు లేకుండానే వ్యక్తీకరించే అవకాశం ఉంది. ఇలాంటి అంశాల్లో దూషణలు అధికమైపోయి తెలంగాణ భావజాలంలో ఎదుటివారి నిజాయితీని శంకించే స్థాయికి పరిస్థితి వచ్చింది.

వాగ్ధాటిలో కేసీఆర్ కు దీటైన నాయకులు విపక్షంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తమపై దూషణలతో విరుచుకుపడుతున్న కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కొంతమంది విపక్ష నాయకులు కూడా అదే బాట పడుతున్నారు. నిజానికి ఈ తరహా తిట్లు తెలంగాణ అసలైన సంస్కృతి కాదు. ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఆవశ్యకత మాత్రమే. అసలైన తెలంగాణ సంస్కృతి తెలుసుకోవాలంటే నిజాం పాలనకు ముందు కాలానికి వెళ్ళాలి. కారణాలు ఏవైతేనేం ....తెలంగాణ భాషా సంస్కృతులపై వచ్చిన సాహిత్యం, సినిమాలు తక్కువే. ఆధునిక తెలంగాణ విషయానికి వస్తే మా భూమి, చిల్లర దేవుళ్లు లాంటి సినిమాలు కొంత వరకు తెలంగాణ భాష, సంస్కృతిని చాటిచెప్పాయి. తాట తీస్తా కొడుకా....అని ఒక సినిమాలో హీరోయిన్ అంటే అంతా ఫిదా అయిపోతారు. రాజకీయాల్లో అదే మాట ఉపయోగిస్తే మాత్రం కొంత ఎబ్బెట్టుగానే ఉంటుంది. తెలంగాణ భాషలో ఉన్న ప్రత్యేకతనే అది. పదాలను ఉపయోగించే సందర్భం, పదాలను విరవడంలో ఉండే ఒడుపు విభిన్న అర్థాలను ఇస్తుంటాయి. ఒకే పదం ప్రేమను చాటుతుంది. శత్రుత్వాన్నీ ప్రకటిస్తుంది. ఆ ప్రత్యేకతను పోగొట్టేలా ఆయా పదాలను దూషణలకే పరిమితం చేయడం సబబు కాదు.

ఎన్నికల్లో ఓట్లు తిట్లతోనే రావు. అధికార పక్షంలో ఉన్న వారైతే తాము చేసిన పనులను గొప్పగా చెప్పుకోవాలి. విపక్షంలో ఉన్నవారైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎలుగెత్తి చాటాలి. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక కావాల్సిందల్లా అలా ప్రజలకు వివరించడంలో కాస్తంత సంయమనం పాటించడం, భాషా మర్యాదలను అనుసరించడం మాత్రమే. లేని పక్షంలో తెలంగాణ భాష గురించి తెలియని నేటి తరం పిల్లలు ఈ భాషలో ఉన్నదంతా తిట్లు మాత్రమే అనుకుంటారు. తెలంగాణ భాష సొగసు ఇంతేనా అని ఇతర ప్రాంతీయులు అనుకుంటారు. అలాంటి అపోహలకు తావీయని రీతిలో తెలంగాణ భాషా సొగసులను కాపాడుకుందాం.

Next Story