Top
logo

సంచార తెగ బుడబుక్కల 

సంచార తెగ బుడబుక్కల 
X
Highlights

బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారుజాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు,...

బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారుజాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు, అని పాడుతూ ఢమరుకం వాయించుకొంటూ నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.

చల్లని నిద్దురవేళ . చలిపొద్దున ఢమరుక శబ్దం. ఆ వీధి నుంచి ఈ వీధికి నిరంతరాయంగా మోగుతూ ఉన్న బుడబుక్కల వాని కంఠస్వరం. అదో రకమైన యాసతో, చల్లపొద్దును పక్కలో చేయి దూర్చిలేపినంత జలదరింపుగా అతని గొంతు . ఢమరుక శబ్దం ఇంకా మోగుతూనే ఉంది. వీధుల్ని నిద్ర లేపుతూనే ఉంది. నిద్రా భంగమైనందుకు విసుక్కొంటోన్న వాళ్ళు వద్దన్నా మరికొంత సేపు మోగుతోంది. ఆ కళలన్నీ అంతరించి పోకుండా ఇంకా జీవించి ఉండటం ఆశ్చర్యమే! అయితే - అప్పటికి ఇప్పటికి కొంత తేడా కన్పిస్తోంది. ఏ ఇంటి వద్దా ఎక్కువసేపు నిల్చున్నట్టు లేదు అతను. లోగడ అయితే ఒక్కో ఇంటివద్ద ఒక ఉదయమంతా గడిచిపోయేది. పాత వస్త్రాలిమ్మనీ, చేరెడు గింజలు పెట్టమనీ, మరేవేవో కోరికలతో గృహస్తుల్ని పీడించే వారు. ఇంటి ముందునించి లేచేవారు కాదు. ఢక్కి మోత ఆపేవారు కాదు. పాడటం చాలించేవారు కాదు. ఇంట్లో వాళ్ళచ్చి కాళ్ళా వేళ్ళాపడి బతిమాలి చేటెడు గింజల వద్ద సగం చేటెడయినా పెట్టి పంపేవారు. ఇప్పుడు బుడబుక్కల వాడి ఆలోచనా ధోరణిలో తేడా వచ్చిందో మరి రైతుల్లో మార్పొచ్చిందో అర్థం కాలేదు. పూర్తిగా తెల్లారేసరికి అతని యాచన విరమించబడుతుంది. ఇంతకు మునుపటి కాలంలా ఎవరినీ వేధించటం లేదు. మొండికి పడి పాత వస్త్రాన్నో, చేటెడు గింజెల్నో గుంజుకోవటం తన హక్కుగా భావించటం లేదు.

పొద్దు పొడిస్తే వీధుల మొహం చూడకూడదనే సాంప్రదాయిక కట్టుబాట్లను పాటించటం లేదు. వేషం అదే ఉన్నా, భాష మారకున్నా, ఢమరుకం వీడకున్నా తన వృత్తి లక్షణాల్ని వేటినో వదలుకున్నాడు. సాధారణ యాచకుల్లా పది రూపాయలిచ్చినా చేయిపడుతున్నా డు. ఐదు రూపాయలు విసిరినా కొంగు పడుతున్నాడు. చివరకు రెండు రూపా యల బిళ్ళతో సైతం తృప్తిపడి మరో ఇంటికి వెళుతు న్నాడు. జానపద సంగీతం సామాజిక స్పృహతో వెలువడుతుంది. జానపదులు సంతోషాన్నో, దు:ఖాన్నో వ్యక్తం చేయడానికి తీసిన కూనిరాగాలే సంగీతం. తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరము ష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల వారు, బవనీలు, జక్కుల వారు, బొమ్మలాటకాండ్రు, జానపద సంగీతాన్ని గాత్ర సంగీత రూపంగా కాపాడుతున్నారు. తమ సంగీత పరికరాలను వారే తయారు చేసుకొంటారు.

ఎలుగుబంటి వేషం, కప్పల కావడి, కరగనృత్యం, కరువ నృత్యం, కలాపం, కురవంజి నృత్యం, చెంచుల కథలు, జట్టిజాము, జేగంట భాగవతులు, జోకుమార సంప్రదాయము, తప్పెట గుళ్ళు, తోలుబొమ్మలాట, దాసర్లు, పగటి వేషము, పాముల వాళ్ళు, పులివేషము, బయలాట, బహురూ పులు, బాలసంతు వారు, బుట్టబొమ్మలు, బుడబుక్కల వారు, బుర్రకథ, భజన కూటాలు, మారెమ్మ ఉత్సవం, మెరవణి,మోడి, యక్ష గానం, గిరిజనుల కళలు, వాలకము, వీధి భాగోతం మొదలైనవి జానపద కళారూపాలు. ౠౠ సుభోజ్జయం కలగాలి-మహా ప్రభువులకు మా పని నయంగండాలి, మీ పని నయంగుండాలి, రాను మా భారం రక్షించుట మీ భారం అంబపల్కు జగదంబ పలుకతవే ఆది పరాశక్తి రావే కంచిలోన కామాక్షి పల్కవే మూలనున్న ముసలమ్మ పల్కవే బెజవాడ దుర్గమ్మ పల్కవే కలకత్తా కాళికమ్మ పల్కవే మహాప్రభువలకు జయం కలగాలి, సుభోజ్జయం కలగాలి. ఈ కులస్తులు అనంతపురం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్, ప్రజ్ఞాపూర్ల లో, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలోని సుల్తానా బాద్, ఖమ్మంజిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఉన్నారు.పూర్వం వీరు ఏ గ్రామం వెళ్ళినా కుమ్మరుల ఇళ్ళ దగ్గరే ఉండేవారు. బుడబుక్కలకు భోజనం కావా లన్నా కుమ్మరులనే అడుక్కునే వారు తప్ప మరో కులస్తుల ఇంటికి వెళ్ళేవారు కాదు.సంచార జీవితం గడుపుతున్నప్పటికీ వీరిని ఎస్టీల్లో కలపకపోవటానికి ఇదే కారణమని తెలుస్తోంది.

వీరు ఒక్కొక్కరూ ఒక్కొక్క వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆరె బుడబుక్కల వాళ్ళు భిక్షాణన వృత్తిగా జీవిస్తారు. వీరి మాతృభాష మరాఠి, ఇళ్ళలో మరాఠి భాషను వాడతా రు. బయటమాత్రం తెలుగు మాట్లాడతారు. ఆరెబుడ బుక్కల వారి పరికరాన్ని డక్కు అంటారు. పరమశివుడు నాట్యం చేసే సందర్భంలో వాయించిన ఢమరకాన్నే వీరు ప్రధాన వస్తువుగా స్వీకరించినట్లు చెప్తారు. వీరి వేషధారణ చేతిలో డక్కు, నల్లని పాత కోటు ధరించి పొడవైన తలపాగచుట్టి, మెడలో రంగురంగుల ధోవ తులు వల్లెవాటుగా వేసి ముంజేతికి కడియం ధరించి, నొసట కుంకుమ బొట్టు పెట్టి దానం కోసం ఇంటింటికి తిరిగి దీవించి దర్పంతో యాచన చేస్తుంటారు. వీరు ఉదయాన్నే లేచి గ్రామదేవతలకు పూజచేసి యాచనకు బయ లుదేరుతారు. గ్రామదేవతలకు సంబంధించిన పాటలను ద్విపదశైలిలో పాడుతూ డక్కునులయ బద్ధం గా వాయిస్తూ చాలాహుందాగా ఇంటింటికి తిరుగు తారు. వీరి యాచనలో బియ్యం, డబ్బుల కంటే పాత గుడ్డల యాచనే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యాచించి న పాతగుడ్డలను బొంతలుగా కుట్టి విక్రయిస్తారు. బొం తలు కుట్టడాన్ని ఒక కుటీర పరిశ్రమగా సాగిస్తారు.

వీరిది మాతృస్వామ్య వ్వవస్థ.వీరు గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామట్టు, గౌరికట్టు కడతారు. దాని వలన ఆ గ్రామానికి ఎటువంటి అశుభాలు జరగవని చీడలు రావని వారి నమ్మకం, వారిచేత చిన్న పిల్లలకు తాయత్తులు కూడా కట్టిస్తారు. దానివల్ల చిన్న పిల్లలకు చెడు గ్రహణ దోషాలు రావని గ్రామీణుల నమ్మకం. గతంలో మిరాశి వ్యవస్థ ఉండేది. బుడబుక్కల వాళ్లకు రైతులు ధాన్యం కొలిచి ఇచ్చేవారు. క్రమంగా ఆ సంప్రదాయాలు కనుమరుగైపోవడంతో కళా అనే అంశం వెనక్కి పోయి కేవలం దయనమైన యాచకుల గానే మిగిలిపోయారు.బుడబుక్కల వారు ప్రాచీనం నుంచీ వున్నవారే. వీరి గురించి అనేక మంది కవులు వారి గ్రంథాలలో వర్ణిచారు. కర్నూలు జిల్లాలో 18 వ శతాబ్దానికి చెందిన అయ్యల రాజు నారాయణా మాత్యుడు హంస వింశతిలో వారి వేషధారణ గురించి వివరించాడు. అలాగే పైడి మర్రి వెంకట కవి చిత్రాంగద చరిత్రలో ఇలా వివరించాడు:

డాకదలిర్చు మబ్బు డుబుడుక్క
మెఱంగు మెఱంగు పట్టనన్
జోక బలాకికా సమితి
చుక్కల ల్నామపురేక, నమ్మబల్
కేక సరోజ భేకకముల
కీడును మేలును దెల్ప కూకగా
జోక భనాగమంబు రహిజొచ్చె మహిన్
డుబుడక్క వాడనన్.

అలాగే ఆధునిక కవులలో కాటూరి, పింగళి తుమ్మల సీతా రామ మూర్తి మొదలైన వారు బుడ బుక్కల వారిని గురించి ప్రస్తావించారు. ఉత్తర భారతంలో బుడబుడక్కల వారు వున్నారో లేదో తెలియదు గానీ, మన పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ రాష్ట్రాలలో ఉన్నారు. వీరంతా ఒకనాడు ఒక రాష్ట్రంలో కలిసి వున్న వారే. కర్ణాటకలో వీరిని బుడుబుడికె యివరు అని పిలుస్తారు.బుడబుక్కల పేరు చెపితేనే సమాజంలో గౌరవం సన్నగిల్లింది. పైగా వీరిని కించపరిచే విధంగా సినిమాలలో కూడా డైలాగు లు వస్తున్నాయి. వీరి విజ్ఞప్తి మేరకు కొందరు సినీ నిర్మాత లు అటువంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించినా ఇప్పటికీ అటువంటి డైలాగులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో వీరు ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరు మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీరిని కొన్ని చోట్ల ఆరెకటిక, ఆరెబొందిలి, ఆరెబుడబుక్కల, ఆరెమరాటి వాళ్ళు అనికూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రాంతం లోనివారు ౠరాజక్షత్రియ’గా, అనంతపురం ప్రాంత వాసులు ౠజ్ఞానేశ్వర్’ క్షత్రియజోషిగా పేరుమార్చాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో రామ్ జోషి పేరున ఈ కులస్తులు ఉన్నారు.

ఆధునిక కాలంలో ప్రజానాట్య మండలి కళాకార్లు 1943 నుంచి 1950 వరకూ సాగించిన ప్రజానాట్య మండలి సాంస్కృతిక మహోద్యమంలో ఆనాటి రెండవ ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని గురించి, నాటి కరువు కాటకాలను గురించీ, హిందూ ముస్లిం కలహాల గురించి, బ్లాకు మార్కెట్, లంచగొండి వుద్యోగుల గురించీ, సంఘ విద్రోహుల గురించీ సవివరంగా ప్రజలకు వివరించారు. ఈనాడు రాజమండ్రి విభూతి భవాని లింగం గారు వారి ఇతర పగటి వేషాలతో పాటు బుడబుక్కల వేషాన్ని వేస్తున్నారు. దొర కుడిభుజాన వెంకటేశ్వరుడు సాయమైతడు. దొరపట్టిందల్లా బంగార మైతది. చెయ్య దలచిన పని చేకూర్తది. అయ్య గారి కుడి కంట్లో పుట్టు మచ్చున్నది. దాని ఇసేస మేమంటే? అయ్య కొద్ది లోపల నాల్గు కాళ్ళ తెల్పు, నడి నెత్తిన సుక్క గల పంచ కళ్యాణి గుర్రాన్ని ఎక్కే పోతుండండి. అయ్యకు నొసట లక్ష్మీ రేఖుండాది. ఈపున ఇంజామర, అరికాలున తామర పద్మం వుండె. అయ్యగారు తెల్ల ఏనుగు ఎక్కి భూ పరిపాలన చేసే వంతుండది. దొరా, ఓ దొరా..మాదొరా.. మా దొడ్డ దొరా.... త్యాగాల దొరా, భోగాల దొరా అంటూ అయ్యగారిని ఈ విధంగా ఊదర గొడతాడు. అద్గదిగో దొరా, మీమీద కీడు తలపెట్టిన వారిని వెను వెంట పసిగట్టి వాడిపళ్ళన్నీ పీకించి ఒక్కం త మండించి, భస్మంబు చేసేసి అయ్యగారి కిచ్చే భారం ఈ రామజోగిదే దొరా...తమ కీర్తి ఇంద్రునికన్న గొప్ప ది.చంద్రునికన్న గొప్పది.మీకు మీరే సాటి అంటూ.. డబ్బులు దండుకుంటారు.

బుడబుక్కల కుటుంబాలు..
బుడబుక్కల వారు ఆంధ్ర దేశంలో సుమారు మూడు వేల కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం లోని, డాంపురం దగ్గర ఒకప్పుడు మూడు వందల కుటుం బాలు వుండేవట. క్రమేపి ఉపాధి కోసం నాలుగు పక్కలు చెదిరి పోయారు. ఈ వృత్తి వారికి పరిధులు లేవు. ఏ గ్రామంలోనైనా యాచన చేయవచ్చు. అయితే ఒకరు వెళ్ళిన గ్రామానికి మరొకరు యాచనకు వెళ్ళరు. వారి ఆచార వ్యవహారా లు వేరుగా వుంటూ వారిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు అయి దు రోజులు జరుగుతాయి. ఆ సమయంలో అందరూ మద్యాన్ని సేవిస్తారు. అలాగే వారి కులాచారం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే కుల పెద్దలు విచారించి వారికి జరిమానా విధిస్తారు. ఆ వచ్చిన డబ్బుతో అందరూ విందు ఏర్పాటు చేసు కుంటారు. పురుషులు ఇలా యాచిస్తే స్త్రీలు చాపలు అల్లుతారు.

గడబిడ జరగబోతది..
ఈ గ్రామంలో కొద్ది లోపల గొప్ప గడబిడ పుట్ట బోతుండాది. అది ఎటువంటి గడబిడ అని అడగ బోతరు. ఊరికి ఉత్తరంగ పెద్ద వూడల మఱ్ఱి వుండాది. దాని మీద కూర్చున్న జోడు పచ్చులు ఏమని పల్కు తున్న వంటే, ఒక తాటి కమ్మల గుడిసెలో తొంబై తొమ్మిదేళ్ళ కన్నె పడుచు గడగడా వణికి తెల్లారే సరికి తొలి సంర్తాడేవంతుండది దేవరో, అందు మీద ఈ గ్రామంలో ఇకల్పములు పుడతై. రాచ విడ్డూరములు పుడతై. అన్యోన్య కలహంబులు పుడతై. కీడుని ఎల్లగొట్టి, మేలును తెచ్చే ఈ రామ జోగి పేరు సెబితే? అంత లోనే అణగి పోతై దేవరో.... అంటూ ఇలా తన పాండిత్యాన్నంతా చెప్పి, అయ్యగారిలో ఆలోచనలు రేకెత్తించి నమ్మకం కలిగిస్తారు.

వీరి ఆచార వ్యవహారాలు..
వీరి కులంలో కుల పెద్దల మాటే శిరోధార్యం. పెద్దల మాట తప్పిన వానిని కుల బహిష్కరణ చేస్తారు. తప్పు చేసిన వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక కాగులో నూనె పోసి పొయ్యి మీద పెట్టి సలసలా కాగబెడతారు. కాగిన నూనెలో తప్పు చేసిన వ్యక్తి చేయి పెట్టాలి. కాలితే తప్పు చేసినట్లుగా, కాలకపోతే తప్పు చేయనట్లుగా భావించి తీర్పుఇస్తారు. భార్య తప్పుచేసి నా, భర్త తప్పు చేసినా భర్తే మూల్యం చెల్లించాలి. ఇందుకు పరిష్కారంగా పెద్దలం దరినీ పిలిపించి పావుశేరు పద్ధతి ప్రకారం పెద్దల సమక్షంలో తప్పు నిర్ణయిస్తారు. వచ్చిన వారందరికీ ముందుగా మాంసం తో విందు భోజనం ఏర్పాటుచేయాలి. ఆరె బుడబుక్క ల వారికి ముఖ్యమై నది పావుశేరు పద్ధతి. పెళ్ళి విషయాలలో కానీ, తప్పులు నిర్ణయించేటప్పుడు గానీ, అప్పుల ఒప్పందంలోగానీ, ప్రతికార్యానికి పావుశేరు పద్ధతి ముఖ్యం. పావుశేరు పద్ధతి అంటే ఇరువైపులా పెద్దలు ఒకచోట చేరినపుడు ఆ ఇంటి యజమాని ఒక గ్లాసులో సారాయిపోసి వారి ముందు పెడతారు. వచ్చిన పెద్దలలో ముఖ్యై మెన వ్వక్తి తన చిటికిన వేలు అందులో ముంచిన తరువాత అందరూ తాగుతారు. దీనినే పావుశేరు పద్ధతి అంటారు. అప్పుపుచ్చుకున్నా ఎటు వంటి ఒప్పందా నికి గానీ పెద్దల సమక్షంలో పావుశేరు పుచ్చుకుంటే రాతకోతలతో పనిలేదు. అదే వారికి సాక్ష్యం. పెళ్ళిళ్ళ విషయంలో అబ్బాయి తరుపువారే ఖర్చు అంతా పెట్టుకోవాలి. ఓలి ఇస్తారు. అమ్మాయిని కొనుక్కోవాలి. పెళ్ళిఖర్చు అంతా అబ్బాయి భరించాలి.

పెళ్ళి అయిన తరువాత అబ్బాయి, అమ్మా యి వారింట ఒక సంవత్సరం ఉండి ఇంటి చాకిరి మొత్తం చేయాలి.ఆతరువాతనే వేరే కాపురం పెడతారు. కుటుంబంలో ఎటువంటి గొడవలు జరిగినా భర్తే అన్ని ఖర్చులు భరించి పెద్దలను పిలిపించుకొని తీర్పులు చేయించు కోవాలి. ఈ కులంలో ఆడవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మగవాడు ఏడు పెండ్లిండ్లు చేసుకోవచ్చు. తీర్పు విషయంలో ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇస్తే ఖర్చు అంతా వాడి నెత్తినే వేస్తారు. అప్పు తీసుకొన్న వ్యక్తి రూపాయి వడ్డీతో అప్పు తీర్చాలి. అతను చనిపోతే అతని కొడుకు, అతనుకూడా చనిపోతే అతని కొడుకు తీర్చాలి. కుల పెద్దలే ఇందుకు సాక్ష్యం. వీరికి భిక్ష వృత్తిలో ఒకరి గ్రామాలకు ఒకరు వెళ్ళకూడదు.అలా వెళితే వారికి తప్పువేస్తారు. పెళ్ళిళ్ళలో అల్లుడికి బహుమానంగా మామ తమ గ్రామాలను ఇస్తుంటారు. ఆ గ్రామాలపై అతనికే పూర్తి హక్కు ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లో సరైన ఆదరణ లేక ఇళ్ళకు తిరిగి పాత గుడ్డలు తెచ్చి బొంతలు కుట్టి జీవనం సాగిస్తున్నారు. వీరు సంచార జాతులలోని వారే. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు.

Next Story