Top
logo

తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినట్టేనా?

తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినట్టేనా?
X
Highlights

తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చుట్టుముట్టిన సమస్యలతో సతమతమవుతున్న అధినేత పట్టించుకోవడం...

తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చుట్టుముట్టిన సమస్యలతో సతమతమవుతున్న అధినేత పట్టించుకోవడం మానేశారు. చెప్పుకుందామన్న వినిపించుకునే పరిస్థితిలో లేరు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఊపు ఊపిన టీడీపీ ఇప్పుడు తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణ టీడీపీకి ఇప్పుడు పెద్ద దిక్కుంటూ ఎవరు లేకుండా పోయారు. ఏపీలో అధికారం చేపట్టాక జాతీయాధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం చుట్టంచూపుగా అయినా హైదరాబాద్‌ రాకపోవడంతో తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ఎన్నికలకు ఏడాది సమయమే ఉండగా పార్టీ నేతల్లో ఉలుకూ పలుకూ లేకపోవడంతో కేడర్ డీలా పడుతోంది.

తెలంగాణ ఏర్పడిన తరువాత టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపింది. వారిలో 12 మంది కారెక్కేశారు. కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. ఆరు నెలల క్రితం పార్టీలో గ్రూప్ తగాదాలతో విసిగిపోయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పంచన చేరారు. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య మాత్రమే. ఆర్. కృష్ణయ్య పార్టీలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ట్రస్ట్ భవన్‌కి ఆయన వచ్చిందే లేదు. టీటీడీపీని ఇంత మంది నేతలు వీడుతున్నా ఎవరిని ఆపేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. పార్టీ సీనియర్ నేతల్లో కొందరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్నికలకు ఏడాదే సమయం ఉండగా ఇప్పటి వరకు అధినేత ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం.. మిగతా పార్టీలేమో ప్రజల్లోకి దూసుకెళ్తుండటం చూస్తున్న నేతలు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు.

అడపాదడపా పార్టీ అధ్యక్షుడు, కొందరు సీనియర్లు చేసిన జిల్లాల పర్యటనలకు అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో అంతా ట్రస్ట్ భవన్ గడప దాటడం లేదు. ఇక్కడే ఉంటే వచ్చే ఎన్నికల్లో నెట్టుకురావడం కష్టమేననే భావనలో కొందరు సీనియర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నేతలు పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉంటే మరికొందరు కాంగ్రెస్‌తో మంతనాలు సాగిస్తున్నారు. పార్టీలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఓ పెద్ద దిక్కు లేకపోవడమేనని అంటున్నారు కొందరు సీనియర్లు. పేరుకి జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నప్పటికి ఆయన తెలంగాణలో పార్టీని గాలికొదిలేశారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడం.. టీటీడీపీ నేతలకు సమయం కూడా ఇవ్వకపోడం తెలంగాణలో నెలకో సారి సమావేశం పెట్టుకుందామని చెప్పి ఆర్నెల్లవుతున్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడంతో నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పడుతున్నారు. ఇక్కడే కొనసాగితే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు భావిస్తున్నారట. చంద్రబాబు తీరు చూస్తుంటే తెలంగాణలో చాప చుట్టేసినట్టే ఉందని కొందరు నేతలు వాపోతున్నారు. ఇవాళ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వస్తున్న బాబు.. తెలంగాణ నేతలకు అరగంట అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మరి ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారు? ఇక్కడి నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారో చూడాలి మరి.

Next Story