జీడిపాకం సీరియల్స్‌... మిస్సవుతున్న ఫీలింగ్‌ ఏంటి?

జీడిపాకం సీరియల్స్‌... మిస్సవుతున్న ఫీలింగ్‌ ఏంటి?
x
Highlights

తెలుగు సీరియల్స్‌, వాటిలోని మహిళల పాత్ర, అభినయాల గురించి ఇప్పుడు నన్నపనేని రాజకుమారి మాట్లాడారు గానీ, ఎప్పటి నుంచో ఈ జీడిపాకం సీరియళ్లపై చర్చ...

తెలుగు సీరియల్స్‌, వాటిలోని మహిళల పాత్ర, అభినయాల గురించి ఇప్పుడు నన్నపనేని రాజకుమారి మాట్లాడారు గానీ, ఎప్పటి నుంచో ఈ జీడిపాకం సీరియళ్లపై చర్చ జరుగుతూనే ఉంది. ముద్దమందారం, కార్తీకదీపం, వరూధినీ పరిణయం, కోడలా కోడలా కొడుకు పెళ్లామా...ఈ సీరియల్స్ పేరు చెబితే, వాటి మ్యూజిక్ వినపడితే చాలు వంటింట్లో ఉన్నా, పెరట్లో ఉన్నా, చెంగున హాల్లోకి పరుగెత్తుకొచ్చేస్తారు మహిళలు. ఈ సీరియల్స్‌ ఒక్కరోజు మిస్సయినా, జీవితంలో ఏదో మిస్సయినట్టుగా ఫీలయ్యే లేడీస్‌ కూడా ఉన్నారంటే, ఆశ్చర్యంలేదు. ఒకరకంగా సీరియల్స్‌కు చాలామంది మహిళలు బానిసలయ్యారని అనేక సర్వేలే కాదు, ఇంటింటి రామాయణం కూడా.

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌లో వస్తున్న సీరియల్స్‌లో, మహిళల పాత్రలను మరిచిన తీరు, చాలా విచిత్రంగా, జుగుప్సాకరంగా ఉంటుందని మహిళా సంఘాలు కూడా మండిపడతాయి. అత్తను సాధించాలని కోడలు కుతంత్రాలు చేస్తే, కోడలిని అదుపాజ్నల్లో ఉంచుకోవాలని అత్త కుట్రలు చేస్తున్నట్టుగా తీర్చిదిద్దుతారు. అంతేకాదు, ఫ్యాక్షన్‌ సినిమాల్లో మాదిరి, తనకు పడనివారిని ఎలా మట్టుబెట్టాలో ప్రణాళికలు రచించే క్యారెక్టర్స్‌‌లో స్త్రీలను చూపిస్తున్నారు. ఇద్దరు మహిళల్లో ఒకరిని విలన్‌గా మరొకరిని హీరోగా తీర్చిదిద్దుతున్నారు.

ఇలాంటి సీరియల్స్ మహిళలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయని, చాలా సర్వేలు కూడా స్పష్టం చేశాయి. కొందరు స్త్రీలల్లో హింసాత్మక ప్రవృత్తి పెరగడానికీ కారణమవుతున్నాయని సామాజికవేత్తలు, అనేక కాపురాలు కూడా కూలిపోయాయి అనడానికి కోర్డుల చుట్టూ తిరుగుతున్న దంపతులే నిదర్శనమంటున్నారు. అందుకే సినిమాల తరహాలోనే, సీరియళ్లపై సెన్సార్‌ ఉండాలని, సామాజికవేత్తలు, మహిళా సంఘాల నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ నన్నపనేని కూడా డిమాండ్ చేశారు. మరి నన్నపనేని తాజా డిమాండ్లయిన పురుషుల కమిషన్, సీరియళ్లపై సెన్సార్‌‌ అంశాలు, ప్రభుత్వాల దృష్టికి వెళతాయో, మధ్యలోనే ఆగిపోతాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories