పొత్తులపై క్లారిటీ ఉంది... ప్రచారంపై ఎందుకీ కన్ఫ్యూజన్‌

పొత్తులపై క్లారిటీ ఉంది... ప్రచారంపై ఎందుకీ కన్ఫ్యూజన్‌
x
Highlights

తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో గెలిచి, అదే ఉత్సాహంతో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు...

తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో గెలిచి, అదే ఉత్సాహంతో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు పోరుకు సమరోత్సాహంతో వెళ్లాలని కృతనిశ్చయంతో ఉంది. ఇదే నేపథ్యంలో దాదాపు 50 మంది కీలక నాయకులు, సీనియర్లను ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. పార్టీ వార్‌ రూమ్‌లో తెలంగాణ నేతలతో దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు రాహుల్. పొత్తులు, సీట్ల సర్దుబాటు, పొటెన్షియల్ క్యాండిడేట్స్, కమిటీలు, ప్రచారంపై నేతలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహాకూటమితో ముందుకు వెళ్తామని నేతలు, రాహుల్‌కు వివరించారు. దీనికి స్పందించిన రాహుల్.. పరిస్థితులను బట్టి మహాకూటమి నేతలతో చర్చించి.. పార్టీకి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మొత్తం 119 స్థానాల్లో మహాకూటమి పార్టీలకు, 29 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. మిగతా 90 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టాలని రాహుల్‌ భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఎన్నికల కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు రాహుల్. పార్టీ సీనియర్ నేత భక్తచరణ్‌ దాస్ ఛైర్మన్‌గా జ్యోతిమణి సెంథిమలై, శర్మిష్ట ముఖర్జీతో కమిటీని నియమించారు. వీరు సీట్ల సర్థుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడతారు. ఈ కమిటీలో ఉన్న శర్మిష్ట ముఖర్జీ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె. కూటమిలో భాగంగా కొన్ని సీట్లు పోతాయని, అయితే ఎవరూ నిరాశపడవద్దని నేతలకు చెప్పారు రాహుల్. పార్టీలో మంచి పేరు ఉన్న ఎమ్మెల్యేలకు అదే నియోజకవర్గంలో టికెట్లు ఇస్తామని, హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎక్కడ బలహీనంగా ఉందో, ఆ స్థానాలను గుర్తించి మహాకూటమి సభ్యులకు కేటాయించాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలపై బహిరంగ విమర్శల దిగకూడదని హెచ్చరించారు కాంగ్రెస్ చీఫ్.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో 10 బహిరంగ సభల్లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీని టి.కాంగ్రెస్ నేతలు కోరినట్టు తెలిసింది. అంతేకాదు.. సోనియా గాంధీ కూడా ప్రచారానికి హాజరయితే బాగుంటుందని కూడా రాహుల్‌కు సూచించినట్టు సమాచారం. సోనియా వస్తేనే, తెలంగాణ ఇచ్చారనే సెంటిమెంట్ ప్రజల్లో కలుగుతుందని, తద్వారా పార్టీకి మేలు జరుగుతుందని వివరించారు. నేతల అభ్యర్థనకు రాహుల్ సరేనన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పోరులో గెలిచేది తామేనని, నేతలంతా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్, రాహుల్‌తో 15 నిమిషాల పాటూ ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలిసింది. ఎన్నికల వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడితో చర్చించారట. పార్టీ కోసం పనిచేసిన నేతలు, యువతకు టిక్కెట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ భేటీ ముగిశాక మాట్లాడిన కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని అధినేత సూచించారని తెలిపారు. మొత్తానికి రాహుల్‌ సమావేశంతో, పొత్తులు, ప్రచార వ్యూహంపై ఫుల్ క్లారిటీ వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు. రాహుల్‌, సోనియా సభలకు ప్లాన్‌ చేస్తామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories