పొత్తు పొత్తుకో లెక్క... పక్కాగా నడుస్తుందా మరి!!

పొత్తు పొత్తుకో లెక్క... పక్కాగా నడుస్తుందా మరి!!
x
Highlights

ఒకప్పుడు కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. మొన్నటి వరకు ప్రధాన రాజకీయ పక్షంగా ఉంది. ఇప్పుడు కూడా లీడర్లు పోయినా క్యాడరుందన్న దీమాతో ఎదురీదుతోంది. కానీ...

ఒకప్పుడు కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. మొన్నటి వరకు ప్రధాన రాజకీయ పక్షంగా ఉంది. ఇప్పుడు కూడా లీడర్లు పోయినా క్యాడరుందన్న దీమాతో ఎదురీదుతోంది. కానీ నేటి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా రంగంలోకి దిగితే, తన ఉనికికే ప్రమాదమని జంకుతోంది. అందుకే పొత్తు కోసం సిద్దాంతాలను సైతం పక్కనపెట్టి, జీవన్మరణంగా పోరాడుతోంది. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. జన సమితి, సీపీఐలు... కాంగ్రెస్‌ పార్టీ... వైఖరితో విసుగెత్తిపోతున్నాయి. టీడీపీ మాత్రం ఏదిఏమైనా కాంగ్రెస్‌తోనే జట్టుకట్టాలని నిర్ణయించింది. ఒంటరి పోరుతో తన ఉనికికే ప్రమాదమని భావిస్తున్న తెలుగుదేశం..... కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

మహా కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు ముగింపు దశకు రావడం లేదు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ మధ్య చర్చలు సాగుతున్నా... సీట్ల సర్దుబాటుపై మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. కూటమి సారధ్య బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న అంశం కూడా తేలడంలేదు. దాంతో సీట్ల పంపకాలు ఎప్పటికి ముగుస్తాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టీజేఎస్‌ 30 సీట్లు, సీపీఐ 10 సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. ఇక హుస్నాబాద్‌ను కచ్చితంగా తమకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తోన్న సీపీఐ.... అక్కడ్నుంచి చాడ వెంటకరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే హుస్నాబాద్‌‌లో ఇప్పటికే కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ప్రచారం మొదలుపెట్టడంపై చాడ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. తమ గౌరవాన్ని కించపరిస్తే కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామంటూ హెచ్చరించారు. ఇక కోదండరాం సైతం మహా కూటమిపై పునారాలోచనలో పడ్డారు. కోరినన్ని సీట్లు ఇవ్వడం లేదన్న కారణంతో అటు బీజేపీతో చర్చలు జరుపుతున్నారు. అయితే టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తోనే జట్టు కట్టాలని నిర్ణయించింది. ఎలాంటి డిమాండ్లు, షరతులు పెట్టకుండా... టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తోంది.

2014లో 15 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకున్నా ....టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ బలహీనపడింది. మరోవైపు గత ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీతో.... టీడీపీ తెగదెంపులు చేసుకుంది. దాంతో ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే పార్టీకి బతికించుకునేందుకు... సీట్లపై మొండిపట్టు పట్టకుండా... టీఆర్ఎస్ ఓటమే లక్షంగా కాంగ్రెస్ తో జట్టుకట్టాలని నిర్ణయించింది. సీపీఐ, టీజేఎస్‌లు చేరినా... చేరకపోయినా... కాంగ్రెస్‌తోనే కలిసి వెళ్లాలని డిసైడైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories