మేడ్చల్‌ సభ సక్సెస్.. తెలంగాణ నా బిడ్డ..! తల్లిగా తల్లడిల్లుతున్నా..: సోనియా భావోద్వేగం

మేడ్చల్‌ సభ సక్సెస్.. తెలంగాణ నా బిడ్డ..! తల్లిగా తల్లడిల్లుతున్నా..: సోనియా భావోద్వేగం
x
Highlights

మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు కుంపట్లతో రగిలిన ప్రజాకూటమికి, సోనియా సభ, సరికొత్త ఉత్సాహం నింపిందా.? సోనియా భావోద్వేగ ప్రసంగం గాంధీభవన్‌కు నూతన బాట...


మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు కుంపట్లతో రగిలిన ప్రజాకూటమికి, సోనియా సభ, సరికొత్త ఉత్సాహం నింపిందా.? సోనియా భావోద్వేగ ప్రసంగం గాంధీభవన్‌కు నూతన బాట చూపిందా.? రాహుల్ అటాకింగ్‌ స్పీచ్, కాంగ్రెస్‌ శ్రేణులకు కర్తవ్యబోధ నూరిపోసిందా.? మొదటిసారి ఒకే వేదికపై ప్రజాకూటమి నాయకులు ఆసీనులు కావడం, కూటమి పార్టీల కార్యకర్తలకు కొత్త దిశ చూపిందా.? ఇంతవరకూ ఒక్క పెద్ద సభతోనూ ఉర్రూతలూగని కాంగ్రెస్‌ శ్రేణులు, ఇక వాడవాడలో ర్యాలీలు, సభలతో చెలరేగిపోవాలని భావిస్తున్నాయా.? సోనియా, రాహుల్‌ గాంధీ రాకతో ప్రజాకూటమి మదిలో మెదులుతున్నవేంటి?

యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ సభ కోసం, కాంగ్రెస్‌ శ్రేణులు నిజంగా కళ్లుకాయలు కాసేలా ఎదురుచూశాయి. కూటమి పార్టీల మధ్య ఎప్పడు సీట్లు సర్దుబాటవుతాయి మేడమ్‌ సభ ఎప్పుడుటుందని నిరీక్షించాయి. తమ ఎదురుచూపులకు ఫలితం దక్కిందని, సభ గ్రాండ్‌ సక్సెస్‌తో సరికొత్త జోష్‌ వచ్చిందని సంబరపడిపోతోంది కాంగ్రెస్.

మేడ్చల్‌ సభా వేదికగా ప్రజాకూటమి పార్టీలు తొలిసారి ఆసీనులయ్యాయి. అటు కాంగ్రెస్‌ హేమాహేమీ నాయకులు, ఇటు తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ముఖ్య నాయకులు స్టేజ్‌ మీద ఉండటం, కూటమి పార్టీల కార్యకర్తలకు కొత్త జోష్‌ నింపిందని భావిస్తున్నారు. సీట్ల గొడవలను పక్కనపెట్టి, అందరూ ఏకం కావడంతో, క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణుల ఐక్యతకు ఊపునిస్తుందని, పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుకు ఊతమిస్తుందని, కూటమి పక్షాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ పాత్ర ఎంత కీలకమైందో, ఎన్ని ఒత్తిళ్ల మధ్య రాష్ట్రం సాకారమైందో భావోద్వేగంగా మాట్లాడారు సోనియా. క్లిష్టమని తెలిసినా, ఆంధ్రాలో పార్టీకి నష్టమని అర్థమైనా, ఆఖరికి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు. ఈ మాటలతో తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసేనన్న మాటలను, ప్రజలకు గట్టిగా వివరించాలని భావిస్తున్నారు కార్యకర్తలు. రాహుల్‌ అటాకింగ్ స్పీచ్‌ కూడా, శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని భావిస్తున్నారు.

మరోవైపు సభా నిర్వహణ బాధ్యతలను రేవంత్‌ రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్‌ అధిష్టానం. దీంతో భారీ ఎత్తున జనసమీకరణ చేసి, రేవంత్‌ మార్కులు కొట్టేశారని, రేవంత్‌ వర్గం నేతలు సంబరపడుతున్నారు. మొత్తానికి ఆలస్యమైనా సోనియా, రాహుల్ సభలతో ఒక్కసారిగా ప్రజాకూటమి ప్రచారాన్ని వేడెక్కించామని, పార్టీల నాయకులందరూ సంతోషిస్తున్నారు. ఈ సభ ఇచ్చిన స్ఫూర్తితో, ఇక క్షేత్రస్థాయిలో చెలరేగిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి చూడాలి కాంగ్రెస్, ప్రజాకూటమి శ్రేణులు ఇదే వేడిని పోలింగ్‌ వరకూ కంటిన్యూ చేస్తాయా. ఆరోగ్యం బాగాలేకపోయినా, తెలంగాణలో అడుగుపెట్టి, భావోద్వేగంగా ప్రసంగించిన సోనియా స్ఫూర్తిని కొనసాగిస్తాయా?

Show Full Article
Print Article
Next Story
More Stories