పొత్తు లెక్క పక్కా... సీట్లే తేలక తికమక

పొత్తు లెక్క పక్కా... సీట్లే తేలక తికమక
x
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలయ్యింది. దూకుడు పెంచిన పార్టీలు.. ప్రచారం, మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. 105మంది...

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలయ్యింది. దూకుడు పెంచిన పార్టీలు.. ప్రచారం, మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. 105మంది అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్‌ ప్రచారంలో దూసుకెళుతుంటే.. మహాకూటమి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది.ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించే పనిలో ఉంది మహా కూటమి. తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌లు దీనిపై నిన్న అంతర్గతంగా చర్చించుకున్నాయి. ఇవాళ నాలుగు భాగస్వామ్య పక్షాల ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికకు తుదిరూపు ఇవ్వడంతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ కనీసం 90 స్థానాల్లో పోటీ చేస్తామంటోంది. మిగిలిన స్థానాలను భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే కూటమిలోని తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి 50కి పైగా స్థానాలను కోరుతున్నాయి. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో నెగ్గిన స్థానాలతోపాటు తాము ద్వితీయ స్థానంలో నిలిచిన స్థానాలను కోరుతోంది. గెలిచినవి, రెండో స్థానంలో నిలిచినవి కలిపి టీడీపీకి 36 స్థానాలు ఉన్నాయి. వీటిలో కనీసం 30 అయినా ఇవ్వాలని కోరుతోంది. సీపీఐ గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో నెగ్గింది. ఈసారి కనీసం ఐదు స్థానాలనైనా కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణ జనసమితి కనీసం 17 స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. గెలుపు లక్ష్యంగా సీట్లను కేటాయించుకోవాలని.. ఆయా పార్టీలకు పూర్తి స్థాయిలో పట్టున్నవి, గెలిచే అవకాశాలున్న స్థానాలనే తీసుకోవాలని కాంగ్రెస్‌ సూచిస్తోంది. ఇప్పటికే టీడీపీ, టీజేఎస్, సీపీఐ కోరుతున్న స్థానాలపై కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమీక్షించుకున్నారు. కాంగ్రెస్‌ గెలిచే స్థానాలను ఇవ్వడం సాధ్యం కాదని ఆ పార్టీ ఇప్పటికే భాగస్వామ్య పక్షాలకు చెప్పింది.

ఎన్ని సీట్లు అనేదాని కన్నా ఏయే స్థానాలు కోరుతున్నారనే అంశంపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని కూటమిలోని పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఏయే స్థానాలను ఎందుకు అడుగుతున్నారు? అక్కడ ఉన్న బలమేంటి? అభ్యర్థి బలాబలాలు వంటి అంశాలను విశ్లేషించనున్నారు. పొత్తుల చర్చలున్న అన్ని స్థానాల్లోనూ ఇలా సమగ్ర విశ్లేషణ అనంతరమే ఏకాభిప్రాయానికి వస్తామని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. కూటమి పార్టీల ఉమ్మడి అజెండాలో ఏకాభిప్రాయం కుదిరిందని, సీట్ల సర్దుబాటు కూడా సమస్యలు లేకుండా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. పట్టువిడుపుల ధోరణి ఉంటుందని, గెలుపు ప్రాతిపదికగా కూటమిలోని అన్ని పార్టీలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

తమ పార్టీల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నందున తగిన సంఖ్యలోనే సీట్లు అడుగుతున్నామని కాంగ్రెసేతర పక్ష నేతలు పేర్కొంటున్నారు. 20 మందికి పైగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నాలుగైదు సీట్లంటే సర్దిచెప్పడం సమస్యగా ఉందని వివరిస్తున్నారు. కూటమిలో ఉన్నా పార్టీలు ప్రత్యేకతను కాపాడుకోవాల్సి ఉంటుందని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకున్న తర్వాత పోటీ చేయకుంటే ఎలా అనే చర్చ పార్టీల్లో అంతర్గతంగా ఉందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories