ఆశపడి... భంగపడి... వారసుల వావివరసలేంటి?

ఆశపడి... భంగపడి... వారసుల వావివరసలేంటి?
x
Highlights

నాన్న ఉన్నాడనే భరోసాతో నాలుగేళ్ళు, నాయకుల వారసులు రాజకీయల్లో చురుగ్గా తిరిగారు. యువసేనల పేరుతో వీధివీధికి ఫ్లెక్సీలు పెట్టారు. సేవా కార్యక్రమాలు...

నాన్న ఉన్నాడనే భరోసాతో నాలుగేళ్ళు, నాయకుల వారసులు రాజకీయల్లో చురుగ్గా తిరిగారు. యువసేనల పేరుతో వీధివీధికి ఫ్లెక్సీలు పెట్టారు. సేవా కార్యక్రమాలు చేశారు. వారసత్వపు కోటాలో, టికెట్‌ పక్కాగా వస్తుందని లెక్కలేశారు. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది. అన్ని పార్టీలు, కొడుకులు, కూతుళ్లకు నో చెప్పాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో, సుపుత్రుల ఆశలు నిరాశలయ్యాయి. తండ్రి వారసత్వంతో, రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుదాం అనుకున్న వరంగల్ రాజకీయ వారసులకు, ఈ ఎన్నికలు కలిసి రాలేదు. నాలుగేళ్లుగా సభలు, సమావేశాలు, సేవా కార్యక్రమాలు, యూత్‌ సమ్మేళనాలతో పడరాని పాట్లు పడ్డా, ఆ కష్టమంతా వృధాగానే మిగిలింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే 12 స్థానాలకు గాను, పదకొండింటిలో పాత వారికే టికెట్లు ప్రకటించింది టీఆర్ఎస్‌. మహాకూటమి అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోయినా, పాతవారినే బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితంగా చాలా ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న వారసులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. పార్టీలు ఈ దఫా ఎన్నికల్లో పాత కాపులకే పట్టం కడుతున్నాయి. కొత్త ప్రయోగాలకు మొగ్గు చూపడం లేదు. సీనియర్లకే టికెట్లు ఇచ్చి గట్టెక్కాలనే పంథాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారసుల పేర్లు మొదట్లో వినిపించినా చివరికి వారి తల్లినో, తండ్రినో మళ్లీ బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి. తమ పిల్లలకు అవకాశం కల్పించాలని నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నా..అధిష్ఠానాలు ససేమిరా అంటున్నాయి.

కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్‌ భూపాలపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం మొదట్లో వినిపించింది. అత్తగారి ఊరు అదే నియోజకవర్గం కావడంతో అక్కడ టికెట్‌ ఆశించారు. పలు కార్యక్రమాలూ చేశారు. తర్వాత అసలుకే ఎసరు వచ్చింది. సురేఖకు టీఆర్ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో, కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ పార్టీ నుంచి సైతం రెండు స్థానాలు కోరారు. పొత్తుల్లో భాగంగా ఆ అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో సుస్మితా బరిలో నిలవడం కష్టమే. మరో ఐదేళ్ళు ఆగాల్సిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ అశలు పెట్టుకున్న మరో వారసుడు ములుగు తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ కొడుకు ప్రహ్లాద్. తండ్రికి ఆరోగ్యం సహకరించక పోవడం, మరోవైపు అధికార పార్టీ హవా ఉన్నప్పుడే బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడ్డాడు. తండ్రితో పాటు ములుగు నియోజకవర్గం మొత్తం కలియతిరిగాడు. తానే వారసున్ని, కాబోయో ఎమ్మెల్యేనంటూ విస్త్రృత ప్రచారం చేశాడు. తీరా టిఆర్‌ఎస్ అధిష్టానం సిట్టింగ్‌లకే సీటు కేటాయించడంతో కంగుతిన్నాడు. అయితే ఇప్పటికే ములుగు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ పదవి దక్కడంతో కొంతలోకొత అశాజనకంగా పదవి ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే పదవి కోసం మరో ఐదేళ్ళు ఆగాల్సిన పరిస్థితి.

భూపాలపల్లి నుంచి తండ్రి వారసత్వాన్ని అందుకోవాలని ఆరాటపడ్డారు సిరికొండ ప్రశాంత్. తండ్రికి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కలిసి వస్తుందని, అన్నీ కదురితే ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించారు. కాని సిట్టింగ్ సీటుతో ఆశలు ఆవిరయ్యాయి. మధుసూధనాచారికి ముగ్గురు కుమారులు. ఆది నుంచి తండ్రికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొన్నది మాత్రం ప్రశాంతే. రెండో కుమారుడైన ప్రశాంత్‌ తండ్రి అడుగు జాడల్లో నడుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్ష పదవి దక్కుతుందని అనుకున్నారు. ఇప్పటివరకు అధ్యక్షుల నియామకం జరగలేదు. ఈ ప్రతిపాదన అక్కడితోనే ఆగిపోయింది. తాజాగా మళ్లీ సిరికొండ అభ్యర్థిత్వమే ఖరారైంది. దీంతో మరో ఐదేళ్ళ నిరీక్షణ తప్పడం లేదు ప్రశాంత్‌కు.
ఇలా తల్లిదండ్రుల రాజకీయ వారసత్వంతో, అసెంబ్లీలో అధ్యక్షా అనాలనుకున్న వారసులకు, నిరాశ ఎదురవుతోంది. ఇంతకాలం తాము పడ్డ కష్టమంతా వృధా అయ్యిందని యువ నాయకులు మథనడుపుతున్నారు. నెక్ట్స్ టైమ్ బెటర్‌ లక్‌ అని తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories