వీరంతా లోకల్‌ అనుకుంటున్నారా? కాస్త మనసుపెట్టండి!!

వీరంతా లోకల్‌ అనుకుంటున్నారా? కాస్త మనసుపెట్టండి!!
x
Highlights

కమిషనర్లు వస్తుంటారు...పోతుంటారు...చంటిగాడు లోకల్‌. పక్కా లోకల్ అంటాడు ఓ సినిమాలో రవితేజ. కానీ తెలంగాణ ఎన్నికల్లో చాలామంది చంటీలు నాన్‌లోకల్. పక్కా...

కమిషనర్లు వస్తుంటారు...పోతుంటారు...చంటిగాడు లోకల్‌. పక్కా లోకల్ అంటాడు ఓ సినిమాలో రవితేజ. కానీ తెలంగాణ ఎన్నికల్లో చాలామంది చంటీలు నాన్‌లోకల్. పక్కా స్థానికేతలు. తాము పుట్టింది ఒకచోటయితే, మరో నియోజకవర్గంలో పోటీపడుతున్నారు. సీఎం నుంచి పీసీసీ చీఫ్‌ దాకా ఎందరో, మరెందరో నాన్‌‌లోకల్స్.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ప్రస్తుతం పోటీ చేస్తున్న నియోజకవర్గం గజ్వేల్. కానీ ఆయన స్వగ్రామం సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక. కేసీఆర్ పొలిటికల్‌ లైఫ్‌ సిద్దిపేట నుంచే మొదలైనప్పటికీ... పలు ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని విస్తరించేందుకు, మరింత ముందుకు తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ఆయన కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాల బరిలో నిలిచి, విజయం సాధించారు. 2014లో గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా, హుజూర్‌ నగర్‌కు నాన్‌లోకలే. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం తాటిపాముల ఆయన స్వగ్రామం. 1994లో కోదాడ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009, 2014 ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా హుజూర్‌నగర్‌ నుంచే పోటీ చేస్తున్నారు. కోదాడ నుంచి గెలుపొందిన ఉత్తమ్‌ భార్య పద్మావతి, స్వగ్రామమైన లింగంపేట మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల నియోజకవర్గంలో ఉంది. అలా భార్యాభర్తలూ, తమతమ నియోజకవర్గాలకు నాన్‌ లోకల్‌ క్యాండెట్సే.

రాష్ట్రంలో మరో కీలక నేత, సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కె. తారకరామారావు కూడా నాన్‌ లోకలే. ఆయన పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి ఆయన నాన్‌ లోకల్‌ అవుతారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా చింతమడక.

సూర్యాపేట నియోజకవర్గం నుంచి గెలుపొంది, అక్కడ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్‌రెడ్డి స్వగ్రామం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం. ప్రస్తుతం చెన్నూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాల్క సుమన్‌ స్థానికేతరుడే. ఈయనది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతం. పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వగ్రామం వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. 2009లో పక్క నియోజకవర్గమైన పాలకుర్తి నుంచి తొలిసారిగా టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా నెగ్గారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

సికింద్రాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ, ఎస్సీ రిజర్వు అయిన అంథోల్ నుంచి దశాబ్దాలుగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచే బరిలోకి దిగుతున్నారు. మానకొండూర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న రసమయి బాలకిషన్‌ది సిద్దిపేట జిల్లా.

జడ్చర్ల కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి స్థానికేతరుడైౖౖనా... పాలమూరు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం. 2008లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడారు. ఇక ఈయన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క మధిర కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన స్వగ్రామం వైరా నియోజకవర్గంలోని స్నానాల లక్ష్మీపురం. వైరా ఎస్టీకి రిజర్వు కావడంతో విక్రమార్క మధిర నుంచి పోటీ చేస్తున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి. ఆ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు కావడంతో పాలేరు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి స్వగ్రామం వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి. సండ్ర వెంకటవీరయ్య టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన స్వగ్రామం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం రాజుపేట. పాలేరు నియోజకవర్గం జనరల్‌కు కేటాయించడంతో ఎస్సీ రిజర్వు అయిన సత్తుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు.

రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌. ఆయన తాండూరు నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి. అయితే ఆయన వరుసగా సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన గీతారెడ్డి, జహీరాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. గీతారెడ్డి తొలుత 1989లో గజ్వేల్‌ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రిజర్వేషన్లు మారడంతో జహీరాబాద్‌కు మారాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.

ఇలా వీరంతా, పుట్టింది ఒకచోట, పోటీ చేస్తున్నది మరోచోట. నాన్‌లోకల్‌ అభ్యర్థులైనా, అటువంటి భావన కలగకుండా, నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం, నాన్‌ లోకల్‌ అంశాన్ని ప్రత్యర్థులు రైజ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories