పాటలు లేనిదే పూట గడవని ఆవు..

Highlights

మడిసన్నాక కూసింత కళాపోసనుండాలనే సినిమా డైలాగు ఆ ఆవు కూడా విన్నట్లుంది. సంగీతంలో ఓలలాడుతూ తేలియాడుతోందా ఆవు. ప్రతీ రోజు పాటలు వింటూ తన దినచర్యను...

మడిసన్నాక కూసింత కళాపోసనుండాలనే సినిమా డైలాగు ఆ ఆవు కూడా విన్నట్లుంది. సంగీతంలో ఓలలాడుతూ తేలియాడుతోందా ఆవు. ప్రతీ రోజు పాటలు వింటూ తన దినచర్యను ప్రారంభించే ఈ గోమాత, ఆ పాటలే లేకుంటే నానాయాగీ చేస్తోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో పాటలు వినే గోమాత కథేమిటో మీరే చూడండి...!

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీకాంత్ రెండేళ్ళ కిందట ఓ ఆవును కొనుగోలు చేశారు. రూ.28 వేలకు ఒంగోలు దేశవాళి ఆవును తీసుకొచ్చి పోషిస్తున్నారు. పాల వ్యాపారం కోసం తీసుకొచ్చిన ఆవు ప్రతీ రోజు ఉదయం సమీపంలోని రామాలయంలో వచ్చే పాటలను వింటూ ఆనందించేది. ఆ పాటలు వింటూనే పుష్కళంగా పాలు కూడా ఇచ్చేది. ఆ సంగీతాన్ని ఆస్వాదించినంత సేపు కడుపు నిండా గడ్డి మేసేది. ఆ పాటలు ఆగిపోయిన వెంటనే కొమ్ములాడిస్తూ, గంతులేస్తూ నానా గొడవ చేసేది.

చాలా రోజులకు ఈ విషయాన్ని గుర్తించిన శ్రీకాంత్ గోమాతకు సంగీతం వినిపించడం ప్రారంభించారు. సెల్ ఫోనులో పాటలు పెట్టి దాని చెవి దగ్గర పెట్టినపుడు ఆనందంగా తలాడిస్తూ ప్రశాంతంగా ఉండడాన్ని గమనించారు. ఆ పాటలు ఆపిన వెంటనే కొమ్ములతో కుమ్ములాటకు దిగసాగింది. అది సంగీతానికి అలవాటు పడిందని గ్రహించి ఓ సెల్ ఫోనులో ప్రత్యేకంగా మెమొరీ కార్డు వేసి, అందులో అన్నీ భక్తి గీతాలు నింపించారు. ఆ సెల్ ఫోనును ఆవు మెడకు కట్టి పాటలు వినిపించసాగాడు. అలా, పాటలు వింటున్నంత సేపు గోవు ప్రశాంతంగా ఉంటుంది. సంగీతానికి అనుగుణంగా తలాడిస్తూ, మేత మేస్తూ ఆనందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పాటలు వినడం దాని దినచర్యగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories