నిండా ముంచేందుకు .. నిపా తరుముకొస్తుంది!! బీ అలర్ట్‌

నిండా ముంచేందుకు .. నిపా తరుముకొస్తుంది!! బీ అలర్ట్‌
x
Highlights

కేరళలో మొదలైన ‘నిపా’ కలవరం చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిపా వైరస్‌ కొత్తదేం కాదు. కానీ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది,...

కేరళలో మొదలైన ‘నిపా’ కలవరం చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిపా వైరస్‌ కొత్తదేం కాదు. కానీ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది, పైగా సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. కేరళలో కూడా ఉన్నట్టుండి ముగ్గురు దీని కారణంగా మృత్యువాత పడటం, వీరిలో ఒక నర్సు కూడా ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి.

నిపా వైరస్‌ కొంత అరుదైనదేగానీ మరీ అంత కొత్తదేం కాదు. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. జంతువులకూ, మనుషులకు కూడా జబ్బు తెచ్చిపెడుతుంది. మనుషుల్లోనైతే ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. అందుకే కేరళ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.

నిపా వైరస్‌ గబ్బిలాల్లో, వాటిలోనూ ప్రధానంగా పండ్లు తినే గబ్బిలాల్లో ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా చాలా రకాల వ్యాధుల దాడికి ఆస్కారం ఉంది. అందుకే వీటిని ఎగిరే నక్కలనీ పిలుస్తుంటారు. మరీ ఎక్కువగా కాకపోయినా.. గత రెండు దశాబ్దాలుగా అప్పుడప్పుడు విజృంభించి, కలవరం సృష్టిస్తున్న వైరస్‌ ఇది. దీన్ని తొలిగా 1998లో మలేషియా, సింగపూర్‌లలో గుర్తించారు. అప్పట్లో ఇది పందుల ద్వారానే వ్యాపిస్తోందని భావించారుగానీ తర్వాత దీనిపై అవగాహన మరింతగా పెరిగింది.

2004లో పశ్చిమ బెంగాల్లో ఈత, ఖర్జూర కల్లు తాగిన వారిలో ఈ వ్యాధి కనిపించింది. లోతుగా పరిశోధిస్తే ఆ కల్లు గబ్బిలాలకు సంబంధించిన స్రావాలతో కలుషితమైందనీ, దాని ద్వారానే వ్యాధి మనుషులకు సంక్రమించిందని గుర్తించారు. ఈ వైరస్‌ మనుషుల్లో చేరితే ఒకరి నుంచి మరొకరికి కూడా వేగంగా వ్యాపిస్తోంది. నిపా వైరస్‌ బారినపడితే- జ్వరం, వాంతులు వికారం, తలనొప్పి వంటి సాధారణ వైరల్‌ జ్వర లక్షణాలే మొదలవుతాయిగానీ.. దీనితో వచ్చే పెద్ద సమస్య మెదడువాపు. జ్వరంతో పాటే వీళ్లలో తలనొప్పి, గందరగోళం, విపరీతమైన మగత, సోయి సరిగా లేకపోవటం వంటి లక్షణాలు బయల్దేరతాయి. కొందరిలో శ్వాస కష్టమవుతుంది. ఈ దశలో సరైన వైద్యం అందకపోతే కోమాలోకి వెళ్లిపోయి, వేగంగా మృత్యువాతపడతారు.

నిపా వైరస్‌ కారణంగా జ్వరం బారినపడిన వారిలో సగటున నూటికి 70 మంది మృత్యువాతపడుతున్నారంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందే అనుమానించటం ముఖ్యం. కేవలం లక్షణాల ఆధారంగానే దీన్ని నిర్ధారించటం కూడా కష్టం. అనుమానం బలంగా ఉంటే రక్తం సేకరించి పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వంటి సంస్థలకు పంపిస్తే వాళ్లు పరీక్షించి నిపా వైరస్‌ ఉందేమో నిర్ధారిస్తారు.

గబ్బిలాల కొరికిన పండ్లు తినటం ఈ వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి గాట్లు లేని పండ్లు ఎంచుకోవటం, వాటిని పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం. రెండోది- పందుల వంటి జంతువులకు దూరంగా ఉండటం మంచిది. ప్రస్తుతానికి ఈ సమస్య కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతోంది. మన ప్రాంతంలో దీని ఆనవాళ్లేం లేవు. కాబట్టి ఆందోళన అవసరం లేదుగానీ అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా అవసరం.

ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ వెలుగులోకి రాని నిపా వైరస్‌ కేరళలో విజృంభిస్తుండటంతో పొరుగు రాష్ర్టాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తమయ్యాయి. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories