logo
జాతీయం

మోడీ వ్యూహ తంత్రం... కన్నడిగులను మెప్పిస్తుందా?

మోడీ వ్యూహ తంత్రం... కన్నడిగులను మెప్పిస్తుందా?
X
Highlights

విజయం సాధించేందుకు మోడీ అనుసరిస్తున్న ఎత్తుగడలు ఒక్కొటొక్కటిగా జనాలకు అర్థమవుతున్నాయి. చరిత్ర పాఠాలను...

విజయం సాధించేందుకు మోడీ అనుసరిస్తున్న ఎత్తుగడలు ఒక్కొటొక్కటిగా జనాలకు అర్థమవుతున్నాయి. చరిత్ర పాఠాలను చెప్పడంలో ప్రధాని మోడీని మించిన వారు లేరనే చెప్పవచ్చు. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి వీరుల చరిత్రను చెబుతుంటారు. అంతేకాదు... కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రను ఎలా విస్మరించిందో వివరిస్తారు. అక్కడితే ఆగకుండా ఆ వీరులకు కాంగ్రెస్ ఎలా అన్యాయం చేసిందో వివరిస్తారు. అక్కడితో ఆగితే ఆయన మోడీ కాదు. అలాంటి వీరుల త్యాగాలకు గుర్తింపు తెచ్చేది బీజేపీ మాత్రమేనని కుండబద్దలు కొడుతారు. అసలైన దేశ చరిత్రను పరిరక్షించేది తామేనని స్పష్టం చేస్తారు. అలాంటి మోడీ తాజాగా కాంగ్రెస్ పై టిప్పు సుల్తాన్ జయంతి అస్ర్తాన్ని సంధించారు. మరి ఇలాంటి అస్ర్తాలు బీజేపీకి విజయం అందిస్తాయా ?

నిన్న గాక మొన్న కర్నాటకలో ఫీల్డ్ మార్షల్ కరియప్ప, జనరల్ తిమ్మయ్య ల జన్మస్థలంలో జరిగిన ప్రచార సభలో వారి పేర్లను ప్రస్తావించిన మోడీ అక్కడి ఓటర్లను ఆకట్టుకున్నారు. తాజాగా చిత్రదుర్గ ప్రాంతంలో జరిగిన సభలో అక్కడి వీరనారి ఓబవ్వ ఉదంతాన్ని ప్రస్తావించి ఓటర్ల మనస్సులు గెలుచుకున్నారు. బాగల్కోటె జిల్లా ముథోళ్ కు చెందిన జాతి శునకాలు సైన్యంలో తమ సేవలందిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నాయని మోడీ అన్నారు. వాటిని చూసైనా కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని విపక్షంపై ధ్వజమెత్తారు. మొత్తం మీద దేశంలో దేశభక్తి అంటే దానిపై బీజేపీకి మాత్రమే పేటెంట్ ఉందన్న అభిప్రాయాన్ని కల్పించడంలో విజయం సాధించారు. మైనారిటీ వర్గం ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్ బీజేపీ తరహాలో దూకుడు ధోరణి కనబర్చలేకపోతున్నది.

నిన్న మొన్నటి వరకూ కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆధిక్యం వస్తుందనో, హంగ్ ఏర్పడుతుందనో విశ్లేషకులు అనే వారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతున్నట్లుగానే ఉంది. అక్కడ బీజేపీ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో వీరనారి ఓబవ్వ, చిత్రదుర్గ రాజు నాయక మడకరి ఉదంతాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రస్తావించారు. వీరిద్దరూ టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీని ఎదిరించిన వీరులు. ధీరవనిత ఓబవ్వ వీరత్వాన్ని విస్మరించిన కాంగ్రెస్, టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించేందుకు ఎందుకు ఉబలాటపడుతోందని ప్రశ్నించారు. ఓట్ల ను పొందేందుకు టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఇతర నాయకులను విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. సుల్తానుల రాజ్య విస్తరణ కాంక్షను అడ్డుకునేందుకు హైదర్ అలీ సైనికులను ఓబవ్వ ఎదిరించిన తీరును ఆయన ఓటర్లకు గుర్తు చేశారు. సుల్తానులను ఎదిరించిన నాయకులను విస్మరించిన కాంగ్రెస్, ఓట్ల కోసం మాత్రం సుల్తానుల జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని విమర్శించారు. చిత్రదుర్గ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. మూడేళ్ళుగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే గత ఏడాది టిప్పు సుల్తాన్ ను నరహంతకుడిగా, మాస్ రేపిస్ట్ గా అభివర్ణించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది.

బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరుడిగా టిప్పు సుల్తాన్ కు చరిత్రలో స్థానం ఉంది. అదే సమయంలో తన రాజ్యాన్ని విస్తరించుకునేందుకు స్థానిక హిందూ రాజులను ఆయన హ‍తమార్చినట్లు కూడా చరిత్ర చెబుతోంది. టిప్పు సుల్తాన్ ను, ఆయన తండ్రిని ఎదిరించిన వీరులను స్థానికులు నేటికీ ఆరాధిస్తుంటారు. టిప్పు సుల్తాన్, హైదర్ అలీ లు తంజావూర్ ప్రాంతంలో అనేక అరాచకాలకు పాల్పడినట్లు చెబుతారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రభుత్వం గత ఏడాది టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించడం పెను వివాదాలకు దారి తీసింది. ఈ ఉత్సవాలను బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు.

Next Story