మహానాడు అంటేనే మహా విందు.. ఈసారి వంటకాలు ఇవే!!

మహానాడు అంటేనే మహా విందు.. ఈసారి వంటకాలు ఇవే!!
x
Highlights

తెలుగుదేశం మహానాడు అంటేనే పసందైన విందుకు చిరునామా. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావటంతో.., ఆయన ఇష్టపడే వంటకాలతో...

తెలుగుదేశం మహానాడు అంటేనే పసందైన విందుకు చిరునామా. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావటంతో.., ఆయన ఇష్టపడే వంటకాలతో మహానాడుకు విచ్చేసే అతిధులకు విందు ఇస్తుండటం ఆనవాయితీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి.. భోజనాలు, సాయంత్రం స్నాక్స్‌‌ ప్రసిద్ధి చెందిన రుచులతో అందించనున్నారు. మూడు రోజుల్లో మొత్తం లక్షన్నర మందికి భోజనాలను మహానాడు వేదికగా ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడుకు వచ్చే అతిథులకు షడ్రశోపేతమైన విందు వడ్డించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకి వేల సంఖ్యలో ప్రతినిధులు తరలి వస్తున్నందున, వారి భోజనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటలు, మిఠాయిల్ని ప్రత్యేకంగా వడ్డించనున్నారు.

మహానాడును ఏ ప్రాంతంలో నిర్వహించినా భోజన ఏర్పాట్లకు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆత్రేయపురం పూతరేకులు.. తాపేశ్వరం కాజా.. బందరు లడ్డు.. పప్పు-దప్పళం, ఉలవచారు, పాల తాలికలు.. చక్కెర పొంగలి.. ఇలాంటి సంప్రదాయ వంటలతో పాటు, యాపిల్‌ హల్వా, వెజ్‌ జైపూరీ, కడాయ్‌ వెజిటబుల్‌ కుర్మా వంటి పదార్థాలు.. ఇలా రోజుకు 30 రకాల వంటలు మహానాడు అతిథులకు నోరూరించనున్నాయి.

మద్రాసు పకోడీ, కొబ్బరి అన్నం, మామిడికాయ పప్పు, దొండకాయ వేపుడు, గుత్తి వంకాయ, బీరకాయ రోటిపచ్చడి, సేమ్యా కేసరి, మిర్చి బజ్జీలు, గారెలు, పుణుగులు, ఇడ్లీలు, మైసూరు బోండాలు, గులాబ్‌జాం, మసాలా వడలు, చింతపండు పులిహోర, గుమ్మడికాయ కూర, వంకాయ బఠానీ కూర, బెండకాయ కొబ్బరి వేపుడు... ఇలా అనేక రకాలున్నాయి.

ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జిల్లా మంత్రి దేవినేని ఉమా తదితరులతో కూడిన బృందం భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. మహానాడు జరిగే సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవరణలో వంటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహానాడు ప్రతినిధులకు భోజనాలు సిద్ధం చేయడానికి 400 మంది పాకశాస్త్ర నిపుణులు పనిచేయనున్నారు. వడ్డించడానికి 800 మందిని నియమించారు. వెయ్యి మంది కూర్చుని భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వారికి నిలబడి తినే విధానంలో వడ్డిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories