కూటమిలో కోదండరామ్‌ ఇమడలేకపోతున్నారా?

కూటమిలో కోదండరామ్‌ ఇమడలేకపోతున్నారా?
x
Highlights

మహాకూటమిలో కోదండరాం ఇమడలేకపోతున్నారా....హంతక కూటమితో ఎలా కలుస్తారన్న టీఆర్ఎస్‌ విమర్శలతో సతమతమవుతున్నారా...టీడీపీతో కలిసి వెళ్లడానికి అస్సలు ఇష్టపడటం...

మహాకూటమిలో కోదండరాం ఇమడలేకపోతున్నారా....హంతక కూటమితో ఎలా కలుస్తారన్న టీఆర్ఎస్‌ విమర్శలతో సతమతమవుతున్నారా...టీడీపీతో కలిసి వెళ్లడానికి అస్సలు ఇష్టపడటం లేదా...సీట్ల పంపకంపై రాజీపడలేకపోతున్నారా....మరి మహా కూటమిలో కోదండరాం ఉంటారా...గుడ్‌ బై చెప్పి, సొంతంగా బరిలోకి దిగుతారా? మహాకూటమిలో కోదండరాం కల్లోలంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా?

సీట్ల పంపకంపైనా కోదండరాం సంతృప్తిగా లేరు. మొదటి నుంచి బలమైన 90 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని, గెలిచే స్థానాలు వదులుకోవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. దీంతో కాంగ్రెస్ మహాకూటమిలో సహచర పార్టీలకు 29 స్థానాల్లో సర్దుబాటు చేసుకోవాలని సూచించడంతో, అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఇటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తాము 8-12 స్థానాల్లో పోటీ చేస్తామని ..అటు టీ టీడీపీ నేతలు తాము 25 స్థానాలకు తక్కువ కాకుండా పోటీలో దిగుతామని బెట్టు చేశారు. దీంతో మొదటి నుంచి 25కి పైగా స్థానాల్లో తెలంగాణలో పాగా వేయాలని భావించిన తెలంగాణ జన సమితికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అనుకున్న స్థానాలు రావడంలేదని కోదండరాం అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఉద్యమ సమయంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై, తెలంగాణ ప్రజల్లో సదభిప్రాయం లేదని తెలంగాణ జన సమితి నేతలు కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీతో కలిసి వెళ్తే, ఎన్నికల్లో టీజేఎస్‌కు కూడా ప్రజల ఆదరణ ఉండదని, సొంత పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయని తెలుస్తోంది. తెలంగాణ అమరుల ఆకాంక్షలే ఎజెండాగా ముందుకు వెళ్లాలని....మహాకూటమి అందుకోసం కామన్ మినిమమ్‌ ప్రోగ్రాంకు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు కోదండరాం. అంతేకాదు, సీఎంపీకి ఛైర్మన్‌గా తననే నియమించాలని కోదండరాం షరతు పెట్టారట. అయితే కోదండ ప్రతిపాదనలు మహాకూటమి నేతలు అంతగా స్వాగతించని పరిస్థితి ఏర్పడింది.

టీఆర్ఎస్‌ నేతల విమర్శల ప్రభావమో లేదంటే, స్వంత పార్టీల నేతల వ్యాఖ్యల ఎఫెక్టో కానీ, టీడీపీ అంటేనే కోదండరాం దూరం జరుగుతున్నారని తెలుస్తోంది. టీడీపీ సాకుగా చూపి జన సమితి నేతలు చర్చలకు కూడా కొద్దికాలంగా దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి ఏ అభ్యంతరం లేదుకాని, టీడీపీతో కలిసి వెళ్తే, ప్రజలు హర్షించరని భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ లేకుండా మహాకూటమి జట్టుకడితే ఎక్కువ సీట్లుపొందవచ్చని జససమితి ఎత్తుగడలా ఉంది. కానీ కోదండరాం తన శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్‌లో కొందరు కీలక నేతలు, గాంధీ భవన్‌లో రగిలిపోతున్నారు. ఇలా మహాకూటమిలో కోదండారం ఇమడలేకపోతున్నారో...లేదంటే కోదండరాంతోనే కూటమి పెద్దలు రగిలిపోతున్నారో కానీ, ఇరుపక్షాల మధ్య సఖ్యత కుదరడం లేదని అర్థమవుతోంది.

మొత్తానికి మహాకూటమి తమ షరతులకు ఒప్పుకుంటే సరి, లేకపోతే సొంతగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది కోదండరాం పార్టీ. బలమైన స్థానాలు ఎంచుకుని తమ పార్టీ అభ్యుర్దులను నేరుగా రంగంలో దించాలని ఆలోచిస్తోంది. మరికొద్దిరోజుల్లో ఎన్నికల సంఘం నుంచి పార్టీకి ఏదోక గుర్తు కూడా వస్తుందని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులు పొసగక ముందే ఆదిలోనే కోదండరాం తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories