లాంచీ ముంచిన పాపం ఎవరిది? ఈ హత్యలకు శిక్షల్లేవా?

లాంచీ ముంచిన పాపం ఎవరిది? ఈ హత్యలకు శిక్షల్లేవా?
x
Highlights

ఎత్తయిన కొండలు... గోదావరి సోయగాలు... లాంచీ ప్రయాణం... పాపికొండల విహారం... అందమైన అనుభూతిని ఆవిరి చేస్తుందెవరు? ఘోరమన్న మాట చిన్నదయ్యేలా......

ఎత్తయిన కొండలు... గోదావరి సోయగాలు... లాంచీ ప్రయాణం... పాపికొండల విహారం... అందమైన అనుభూతిని ఆవిరి చేస్తుందెవరు? ఘోరమన్న మాట చిన్నదయ్యేలా... చిన్నబుచ్చుకునేలా... గుండెలు పగిలే విషాదాన్ని నింపుతున్న పాపులెవరు? ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన దోషులెవ్వరు? మొన్నెప్పుడో కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నిన్న లాంచీలో అగ్నిప్రమాదం.. ఇప్పుడు గోదారిలో జలసమాధి ఘోరం? ఇన్ని దారుణాలకు జవాబుదారి ఎవ్వరు? వేల టన్నుల బరువున్న షిప్పులు మహా సముద్రాలను అలవోకగా దాటేస్తుంటే... మరి మనకే ఎందుకిలా అవుతోంది? నిబంధనలు చెబుతున్నా... వాటన్నింటికి నీళ్లొదిలేస్తూ... ప్రయాణం సాగిస్తున్న మనది స్వయం కృతాపరాధమా? ప్రకృతి ప్రకోపమా?

నిండు గోదావరిలో నిర్లక్ష్యం రాజ్యమేలింది. నది మధ్యలో జరగరాని ఘోరం జరిగింది. అందమైన పాపికొండల నడుమ పెను విషాదం నెలకొంది. ఎందరి జీవితాలో తలకిందు చేసింది. ఎన్నో కుటుంబాల గుండెల్ని పిండేసింది. అసలే సిమెంట్‌ బస్తాల బరువు... ఆపై పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకున్న లాంచీ... మధ్యలో వెళ్లగానే తిరగబడింది. దానికి ప్రకృతి కూడా తోడైంది. సుడిగాలి రూపంలో జలసమాధి చేసేసింది.

ప్రమాద మృతులకు నష్టపరిహారం చెల్లించడాలు... ఆదుకుంటామన్న ఊరడింపులు... ఉద్యోగం కల్పిస్తామన్న ఉపశమన వ్యాఖ్యలు... ఇళ్లు కట్టించి ఇస్తామన్న రాజకీయ కుయుక్తులు... ఇలా హడావిడి చేయడం... ఆపై సద్దుమణిగాక సైలెంట్‌ అవ్వడం!! ఇంకా ఎన్నాళ్లు, ఇలాంటి ఘోరాలు చూడాలి. మాటలకందని మృత్యుక్రీడను ఇంకెన్నాళ్లు భరించాలి.

తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం మంటూరు... లాంచీ ప్రమాదానికి కేంద్రం. మంగళవారం ఉదయం వివిధ పనుల కోసమని దేవీపట్నం, కొండమొదలు దాని పరిసర గ్రామాల ప్రజలు సంతకోసమని బయల్దేరారు. వేర్వేరు చోట్ల తమ పనులన్నీ ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దేవీపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి లాంచీ ప్రయాణం మొదలైంది.

లాంచీ మునిగిపోయే ముందు వర్షానికి, గాలివానకు లాంచీలో ప్రయాణికులు కూర్చునే గదులకు తలుపులు వేసేశారు. దీంతో లాంచీతో పాటు ప్రజలు మునిగిపోయినా వారు బయటకు రాలేకపోయారు. మృతదేహాలు తేలకపోవడానికి కారణం కూడా తలుపులు మూసివేయడమే. అయితే ఆకాశంలో మార్పులను చూసిన ప్రజలు... లాంచీని సురక్షితమైన ప్రాంతంలో ఆపాలని సరంగిని వేడుకున్నా... అతని మనసు కరగలేదు. ఏటికి ఎదురీదుతూ లాంచీని ముంచేశాడు. జీవితాలను తలకిందులు చేశాడు.

ఏ లాంచీలోనైనా ప్రయాణికుల భద్రతకే పెద్దపీట వేయాలి. సర్కార్‌ లాంచీల్లోనైతే చట్టప్రకారం ఏంచేయాలో అంతోఇంతోనైనా చేస్తారు. కానీ ప్రైవేటు లాంచీల ఓనర్లకు ఇవేమీ పట్టింపుల్లేవు. ఇంకా చెప్పాలంటే పెద్దగా పట్టించుకోరు కూడా. భద్రత కల్పించే లైఫ్ జాకెట్లు ఉండవు. కంటితుడుపుగా చూపించేందుకు మాత్రమే అన్నట్టు కొన్ని జాకెట్లను పెట్టుకుంటారు. పైగా చెక్ చేసే వారే బోట్ల నిర్వహణలో భాగస్వాములు కావడంతో చెకింగ్‌లు కూడా అంతంత మాత్రమే.

లాంచీ నడపాలంటే.. తాము చెప్పే అన్ని నియమ నిబంధనలను పాటించాలని సర్కార్‌ చెబుతుంది. అవేంటో చూద్దాం.
ఒక్కో ప్రయాణికుడికి లైఫ్‌జాకెట్‌ తప్పనిసరిగా ఇవ్వాలి... అగ్నిమాపక పరికరాలు బోటులో ఏర్పాటు చేయాలి... మూడు నెలలకోసారి తనిఖీలు చేయించాలి.
శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే లాంచీలో నియమించాలి. లాంచీ ఎక్కిన వారి పూర్తి వివరాలు పోలీసులకు విధిగా అందించాలి. రాళ్లు, ఇసుక మేటలల వివరాలతో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. లాంచీలోకి మద్యం, మత్తు పదార్థాలు అనుమతించొద్దు. కానీ ఇవేమీ కనిపించవు. ఎవరి ఇష్టం వారిదే. ఎవరి కక్కుర్తి వాళ్లదే.

మరి ఈ హత్యలకు శిక్షల్లేవా? పాశ్చాత్య దేశాల్లో ఉన్న ప్రగతి మన దగ్గర కళ్లకు కట్టినట్టు చూపిస్తామంటూ బాకాలూదే నాయకులు ఇప్పటికైనా గ్రహించాలి. ప్రజల ప్రాణాలకంటే అభివృద్ధి ముఖ్యం కాదన్న నిజాన్ని తెలుసుకోవాలి. ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించరు కానీ... అలాంటి ఉపద్రవం మళ్లీ
పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. చట్టాలను మరింత కఠినతరం చేయాలి. కనీసం గోదావరి లాంచీ ప్రమాదంతోనైనా తెలుగు రాష్ట్రాల పాలకులు కళ్లు తెరుస్తారని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories